శారదా పీఠానికి మరో సంతర్పణ?

ABN , First Publish Date - 2022-08-10T08:00:33+05:30 IST

శారదా పీఠానికి మరో సంతర్పణ?

శారదా పీఠానికి మరో సంతర్పణ?

భీమిలి వద్ద నామమాత్రపు ధరకు 15 ఎకరాలు కేటాయింపు

అదంతా కొండ పోరంబోకు

చదును చేయాలంటే చాలా ఖర్చు

స్వామి చెప్పడంతో ఆ బాధ్యత తీసుకున్న ప్రభుత్వం

ఏకంగా 50 ఎకరాల అభివృద్ధికి కలెక్టర్‌ ఆదేశం

దీనికి 20 కోట్ల దాకా వ్యయం

సీసీఎల్‌ఏ ఆదేశాలు రాగానే వీఎంఆర్‌డీఏకు బదిలీకి ఏర్పాట్లు

మిగతా 35 ఎకరాలూ సమర్పణేనా?


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

శారదా పీఠాధిపతి అడిగిందే తడవుగా జగన్‌ ప్రభుత్వం ఆగమేఘాలపై ఏదంటే అది చేసి పెడుతోంది. సంస్కృత వేద పాఠశాల ఏర్పాటుకు భూమి కావాలని కోరితే.. తొమ్మిది నెలల క్రితం కేబినెట్‌ ఆమోదించిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో 15 ఎకరాల భూమిని నామమాత్రపు ధర (ఎకరా రూ.3.5 లక్షల చొప్పున)కు కేటాయించింది. అదంతా కొండ పోరంబోకు. నిర్మాణాలకు అనువుగా చదును చేయాలంటే బోలెడు ఖర్చవుతుంది. స్వామి అదే మాట ప్రభుత్వ పెద్దల వద్ద ప్రస్తావిస్తే.. ఆ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. ఆ భూమిని విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) ద్వారా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. దీనికి ప్రభుత్వపరంగా కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉండడంతో ఆ దిశగా జిల్లా కలెక్టర్‌ చురుగ్గా ఫైళ్లు నడుపుతున్నారు. సీసీఎల్‌ఏ నుంచి ఆదేశాలు రాగానే దానిని వీఎంఆర్‌డీఏకు బదలాయించడానికి ఏర్పాట్లుచేశారు. అయితే శారదా పీఠానికి కొత్తవలసలో కేటాయించింది కేవలం 15 ఎకరాలు కాగా.. కలెక్టర్‌ అక్కడ 50 ఎకరాలు అభివృద్ధి చేయడానికి ఆదేశాలివ్వడం విశేషం. కొత్తవలస సర్వే నంబరు 73లో 50 ఎకరాలను 105 సర్వే నంబరుతో విభజించి, దానిని వీఎంఆర్‌డీఏకు ఇస్తున్నామని, దానికి స్థానిక సంస్థగా మహా విశాఖ నగర పాలక సంస్థ ఆమోదం తెలపాలని కోరారు. దీనిపై మేయర్‌కు లేఖ రాయగా.. ఆమె గత నెల 20వ తేదీనే ముందస్తు అనుమతి ఇచ్చేశారు. బుధవారం జరిగే కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదానికి ప్రతిపాదించారు. పీఠానికి కేటాయించింది 15 ఎకరాలైతే వీఎంఆర్‌డీఏ నిధులతో 50 ఎకరాల అభివృద్ధికి నిర్ణయించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన 35 ఎకరాలు కూడా పీఠానికే సమర్పిస్తారా..  లేదంటే దానికి ఉపయోగపడేలా ప్రభుత్వం అక్కడ ఇతర కార్యక్రమాలేమైనా చేపడుతుందా అనేది తెలియడం లేదు. దీనిపై రెవెన్యూ అధికారులను అడుగగా.. సమాధానం చెప్పడానికి నిరాకరించారు. ఏదైనా భూమిని నిర్మాణాలకు అనువుగా లేఅవుట్‌గా మార్చడానికి వీఎంఆర్‌డీఏ ఎకరాకు రూ.40 లక్షల వరకు వెచ్చిస్తోంది. ఇప్పుడు ఈ 50 ఎకరాల భూమికి రూ.20 కోట్లు అవసరం. దీనికి ఎవరి ఖాతాలో వేస్తారో చూడాలి.

Read more