డీసీఐలో మరో శంకర్‌దాదా!!

ABN , First Publish Date - 2022-09-23T10:53:28+05:30 IST

డీసీఐలో మరో శంకర్‌దాదా!!

డీసీఐలో మరో శంకర్‌దాదా!!

ఇంటర్‌ అర్హతతో ఎండీ, సీఈవో పోస్టు

డిగ్రీ సర్టిఫికెట్‌ నకిలీదిగా తేలిన వైనం

సీజీఎంగా ఉంటూ ప్రైవేటు సంస్థకు 

భారీగా లబ్ధి చేకూర్చారని అభియోగం

ఎస్సీ(హిందు) అంటూనే.. మత ప్రచారం

ఫిర్యాదుల వెల్లువతో విచారణకు ఆదేశం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డీసీఐ) పరువు మరోసారి బజారున పడింది. తప్పుడు సర్టిఫికెట్లతో ఎండీగా, సీఈవోగా బాధ్యతలు చేపట్టిన జీవైవీ విక్టర్‌.. డీసీఐ రూ.100 కోట్లకు పైగా నష్టాల్లో ముంచగా, ఇటీవల ఆయన్ను తప్పించారు. దీనికి ముందు కంపెనీ సెక్రటరీ శ్రీకాంత్‌ సహా మరో కీలక అధికారిని సస్పెండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ అధికారి అంటూ సీజీఎం దివాకర్‌ను ఎండీ, సీఈవో పోస్టులో నియమించారు. ఇప్పుడు ఆయనపైనా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దివాకర్‌ 1987లో ఎస్సీ కోటా స్పెషల్‌ డ్రైవ్‌లో డెక్‌ కేడెట్‌(ఒక షిప్‌లో)గా డీసీఐలో చేరారు. ఆ తర్వాత మళ్లీ ఎస్సీ కోటా స్పెషల్‌ డ్రైవ్‌లో డీజీఎంగా 2009లో బాధ్యతలు చేపట్టారు. కేవలం 10 నెలలు మాత్రమే పనిచేసి రాజీనామా చేశారు. తిన్నగా వెళ్లి డీసీఐకి పోటీ కంపెనీ అయిన మెర్కటర్‌లో డీజీఎం ఆపరేషన్స్‌గా చేరి, అక్కడ 32 నెలలు పనిచేశారు. ఆ తర్వాత మళ్లీ 2012లో డీసీఐకి ఆపరేషన్స్‌ జీఎంగా వచ్చారు. అప్పుడు ఆయన డీసీఐకి టెన్త్‌, ఇంటర్‌, బీకామ్‌ డిగ్రీ పాసై, ఎంబీఏ చదువుతున్నట్టు సర్టిఫికెట్లు సమర్పించారు. ఆయన జీఎంగా పనిచేసిన కాలంలో పోటీ కంపెనీ అయిన మెర్కటర్‌ సుమారుగా రూ.800 కోట్ల విలువైన పనులను డీసీఐ కంటే 5 శాతం వరకు అధికంగా కోట్‌ చేసి దక్కించుకుంది. ఈ కాంట్రాక్టులు ఆ కంపెనీకి దక్కడం వెనుక దివాకర్‌ పాత్ర ఉందనే  ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు దివాకర్‌ జీఎంగా పనిచేస్తూనే న్యాయ విభాగాన్ని కూడా పర్యవేక్షించేవారు. ఆ సమయంలో రూ.50 కోట్ల విలువైన ఆర్బిట్రేషన్‌ మెర్కటర్‌కు దక్కింది. ఇది కూడా ఆయన చలవేననే ఆరోపణలు ఉన్నాయి. డీసీఐలో చీఫ్‌ ఆపరేషనల్‌ ఆఫీసర్‌(సీవోవో) పోస్టు లేకపోయినా ఆయనకు కట్టబెట్టడానికి నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఎంఎస్‌ రావు అనే డైరక్టర్‌ ఏపీ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. దాంతో అవే బాధ్యతలతో దివాకర్‌ను సీజీఎంగా నియమించారు. డీసీఐలో సుమారుగా ఎనిమిది విభాగాలు ఉన్నాయి. దివాకర్‌కు ఎక్కువగా డ్రెడ్జర్‌లో పనిచేసిన అనుభవమే ఉంది. పాలనా అనుభవం తక్కువ. టెక్నికల్‌, ఫైనాన్స్‌, లీగల్‌, ప్రాజెక్ట్స్‌, హెచ్‌ఆర్‌, ఐటీ ఇలా అన్ని విభాగాలకు ఆయన్ను సీజీఎంను చేయడంపై అభ్యంతరాలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇది నిబంధనలకు విరుద్ధమని పలువురు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 


ఎస్సీగా క్లెయిమ్‌ చేస్తూనే..

ఎండీ, సీఈవో పోస్టుకు ఆగస్టు, 2020లో డీసీఐ నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు ఎస్సీ(హిందు)గా దివాకర్‌ దరఖాస్తు చేశారు. అదే సమయానికి ఆయన విశాఖలోని యూనియన్‌ చాపల్‌ బాప్టిస్ట్‌ చర్చికి వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. అంటే ఇటు క్రిస్టియన్‌గా ఉంటూ ఉద్యోగం కోసం హిందువుగా పేర్కొన్నారనేది ప్రధాన ఆరోపణ. ఇటీవల ఎండీ, సీఈవో పోస్టు నుంచి జీవైవీ విక్టర్‌ను తప్పించిన తర్వాత ఈయన్ను ఆ పోస్టులో జూలై 14న నియమించారు. అప్పుడు సెబీకి డీసీఐ ఈ విషయం తెలియజేస్తూ దివాకర్‌కు బీకామ్‌ డిగ్రీతో పాటు డ్రెడ్జ్‌ గ్రేడ్‌ మాస్టర్‌ 1 అర్హత ఉందని పేర్కొంది. బీకామ్‌ పాసైనట్టు 2012లోనే దివాకర్‌ సర్టిఫికెట్‌ సమర్పించగా, దానిని ఇటీవల వెరిఫికేషన్‌కు పంపితే అది తప్పుడు సర్టిఫికెట్‌ అని తేలింది. అంటే ఇంటర్మీడియెట్‌ అర్హతతోనే ఆయన్ను ఓ ప్రభుత్వ రంగ సంస్థకు ఏకంగా ఎండీని, సీఈవోను చేసేశారు. పైగా దివాకర్‌ డీసీఐలో ఎండీ, సీఈవో పోస్టుకు దరఖాస్తు చేసినప్పుడు మెర్కటర్‌లో పనిచేశానని, అది డీసీఐకి అనుబంధ సంస్థ అని పేర్కొన్నారని, అది తప్పు అని పలువురు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 


విచారణ జరిపిస్తున్నాం

డీసీఐలో చాలామంది అధికారులు పాతుకుపోయారు. ఇటీవల వారిపై దృష్టి పెట్టాం. ఇంతకు ముందు పనిచేసిన ఎండీ, సీఈవో విక్టర్‌ను విజిలెన్స్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్‌ చేశాం. వేరే స్వతంత్ర సంస్థతో కూడా విచారణ చేయిస్తున్నాం. సంస్థలో సీనియర్‌ అనే ఆలోచనతో దివాకర్‌కు ఎండీ, సీఈవో బాధ్యతలు అప్పగించాం. ఆయనపైనా ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై విచారణ జరిపిస్తున్నాం. 

- కె. రామమోహన్‌రావు, విశాఖపట్నం పోర్టు చైర్మన్‌


Updated Date - 2022-09-23T10:53:28+05:30 IST