చుట్టపు చూపుగా పేర్ని నాని
ABN , First Publish Date - 2022-04-23T23:03:30+05:30 IST
గంజి తాగేవాడికి మీసాలు ఎత్తిపట్టేవారు ఇద్దరనే సామెత ఏపీ ఇన్చార్జ్ మంత్రుల విషయంలో ..

గంజి తాగేవాడికి మీసాలు ఎత్తిపట్టేవారు ఇద్దరనే సామెత ఏపీ ఇన్చార్జ్ మంత్రుల విషయంలో నిజమవుతోందా? ఇప్పటిదాకా ఇన్చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో సాధించిందేమిటి? కొత్తగా ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్న మంత్రులు చేయగలిగిందేమిటి? అసలీ మంత్రులు చేయడానికి ఏమైనా ఉందా? లేదా ఇన్చార్జ్ బాధ్యతలు తూతూమంత్రమేనా?
కోరలు లేని పాముల్లా ఉన్నాయి వైసీపీ సర్కారులో ఇన్చార్జ్ మంత్రి పదవులు. చేయడానికి పని ఉండదు. చేసిన పని చెప్పుకోడానికి ఉండదు. ఉత్సవవిగ్రహంలాంటి పదవితో చేయగలిగిందేముందని ఇన్చార్జ్ మంత్రుల ఆవేదన. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించింది. ఇందులో భాగంగా అప్పటి పశ్చిమగోదావరి జిల్లాకు పేర్నినానీని ఇన్చార్జ్గా నియమించారు. అసలే కొత్త ప్రభుత్వం, ఊహించినందానికంటే ఎక్కువ జనాదరణ వచ్చింది. ఇంకేం పనులన్నీ ఆగమేఘాలపై సాగిపోతాయని అందరూభావించారు. కానీ ఈ మూడేళ్ళలో చేసిందేమిటంటే చెప్పుకోవడానికి ఏమీ మిగలేదు. అసలైమైనా చేస్తేనే కదా ఈ పని చేశాం అని చెప్పుకోవడానికి. ఉమ్మడి పశ్చిమగోదారి జిల్లాలోనైతే నానీ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి శూన్యం. గతంలో జిల్లా ఇన్ చార్జ్ మంత్రులకు సంపూర్ణాధికారాలు ఉండేవి. దీనివలన ఆయా జిల్లాల్లో అభివృద్ధిపనులు వేగంగా సాగేందుకు ఆస్కారం ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అవన్నీ అటకెక్కాయి.
మొన్నటిదాకా ఇన్చార్జ్గా ఉన్న పేర్ని నానీ పశ్చిమగోదావరికి చుట్టుపుచూపుగా రావడమే తప్ప తనదైన ముద్ర ఏదీ వేయలేకపోయారు. ఈ మూడేళ్ళలో మొత్తం ఆయన నాలుగుసార్లు మాత్రమే జిల్లా మొహం చూశారు. నిజానికి పేర్ని నాని నివాసమున్న బందరైనా, ఇటు ఆయన పేషీ ఉండే అమరావతైనా ఏలూరుకు కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే ఆయన అటు బందరునుంచైనా, ఇటు బెజవాడ నుంచైనా తేలికగానే ఏలూరుకు చేరుకోవచ్చు. బహుశా సర్కారు తప్పులను మీడియా ముందు కవర్ చేయడానికే ఆయనకు సమయం సరిపోకపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా వైపు రాలేకపోయారనే సెటైర్లు వినిపించేవి. గతంలో ప్రతి జిల్లాకు అభివృద్ధి సమీక్షా మండళ్ళు ఉండేవి. వీటిని డీఆర్సీలుగా వ్యవహరించేవారు. ఇన్చార్జ్ మంత్రి ఈ మండలికి చైర్మన్గా ఉంటే, జడ్పీ చైర్మన్ వైస్ చైర్మన్గా వ్యవహరించేవారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నేతృత్వంలో ఈ మండలిలో జిల్లా అభివృద్ధిపై సమీక్ష నిర్వహించేవారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ డీఆర్సీలను రద్దుచేసింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వీటిని పునరుద్ధరించింది. ప్రతి మూడునెలలకోసారి ఈ మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంది. గత మూడేళ్ళలో పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 16 సమావేశాలు జరగాల్సి ఉండగా కేవలం నాలుగంటే నాలుగే అదీ మొక్కుబడిగా నిర్వహించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఇక గతంలో ఇన్ ఛార్జ్ మంత్రులకు సంక్షేమ పధకాల అమలులో విచక్షాణాధికారాలు ఉండేవి. ఉదాహరణకు ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన ఇళ్లలో 50 శాతం కోటాను ఇన్ ఛార్జ్ మంత్రులు భర్తీ చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ విధానాన్ని తీసివేయడంతో ఈ మంత్రులకు పనిలేకుండా పోయింది. దాంతో పేరుకు ఇన్చార్జ్ మంత్రులే తప్పా..పెద్దగా బాధ్యతలు లేకపోవడంతో.. ఈ పదవి ఉన్నా లేనట్లుగానే మారింది.
ప్రస్తుతం ఏలూరు జిల్లాకు మంత్రి పినిపే విశ్వరూప్ ను, పశ్చిమగోదావరి జిల్లాకు దాడి రాజాను, తూర్పుగోదావరి జిల్లాకు వేణుగోపాల కృష్ణను ఇన్ ఛార్జ్ మంత్రులుగా నియమించారు.గతంలో ఒక్కో ఇన్ ఛార్జ్ మంత్రి పరిధిలో కనీసం 15 నియోజకవర్గాలు ఉండగా, ఇప్పుడు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే నియోజకవర్గాల సంఖ్య తగ్గింది. కాబట్టి ఇన్చార్జ్ మంత్రులు ఆయా జిల్లాలపై గట్టిగానే ఫోకస్ పెట్టేందుకు అవకాశం ఉంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ అంతటా ఎక్కడా వీసమెత్తు అభివృద్ధి పని సాగలేదు. మరి ఇంతమంది ఇన్చార్జ్ మంత్రులను నియమించారు. వారి ఏ అభివృద్ధిని సమీక్షిస్తారనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. బహుశా ఈ ప్రశ్నకు జగన్ ఒక్కరే సమాధానం చెప్పగలరేమో.