చట్టం ముసుగులో అరాచకాలు, అక్రమాలు

ABN , First Publish Date - 2022-10-05T08:18:42+05:30 IST

చట్టం ముసుగులో అరాచకాలు, అక్రమాలు

చట్టం ముసుగులో అరాచకాలు, అక్రమాలు

రైతులకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: కనకమేడల

న్యూఢిల్లీ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): చట్టం ముసుగులో ఆంధ్రప్రదేశ్‌లో అరాచకాలు, అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. అభివృద్థి వికేంద్రీకరణ పేరుతో రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. జగన్‌ సర్కారు ఈ మూడున్నరేళ్లలో రూ.2 లక్షల కోట్లకుపైగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి రైతుల యాత్ర నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారని, రైతులకు ఏదైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. రాజధాని విషయంలో కులాల వారీగా, ప్రాంతాల వారీగా ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. దసపల్లా భూముల్లో కోర్టు తీర్పును అమలు చేయాలని భావిస్తున్న సర్కారు రాజధాని విషయంలోనూ కోర్టు తీర్పుని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. న్యాయ ప్రక్రియను అడ్డం పెట్టుకుని రూ.500 కోట్లతో చవకగా లేపాక్షి భూములను కొట్టేయాలని చూశారని ఆరోపించారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో న్యాయ ప్రక్రియ జరగకుండా డిశ్చార్జ్‌ పిటిషన్స్‌ పేరుతో అడ్డుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీడీపీ అడిగిన ప్రశ్నలకు శ్వేత పత్రం ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు.


Read more