‘అమ్మ’ అవుట్‌!

ABN , First Publish Date - 2022-07-08T07:37:27+05:30 IST

‘అమ్మ’ అవుట్‌!

‘అమ్మ’ అవుట్‌!

గౌరవాధ్యక్షురాలి పదవికి విజయలక్ష్మితో బలవంతపు రాజీనామా?

సాగనంపేందుకు జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌!

తాను తొలగించినట్లు గాక.. ఆమే స్వచ్ఛందంగా వైదొలిగేలా స్కెచ్‌

షర్మిల పార్టీలో బిజీగా ఉన్నందున రాజీనామా చేస్తున్నట్లు వైసీపీకి లేఖ?

ముసాయిదాను ఆమెకు పంపిన పెద్దలు

ప్లీనరీ ఫ్లెక్సీల్లోనూ కనిపించని ఫొటోలు

సదస్సుకు రావడం అనుమానమే!

వస్తారంటున్న విజయసాయిరెడ్డి

తొలి ప్రసంగం ఆమెదేనని వైసీపీ వెల్లడి

జగనే శాశ్వత అధ్యక్షుడు

వైసీపీ రాజ్యాంగానికి సవరణ!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భార్య, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు, వైఎస్‌ విజయలక్ష్మిని పార్టీ నుంచి బయటకు పంపేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమెతో బలవంతంగా రాజీనామా చేయించనున్నట్లు సమాచారం. పార్టీ నుంచి తాను పంపేసినట్లు కాకుండా.. ఆమే తనంత తాను గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి వైదొలిగినట్లు బాహ్య ప్రపంచానికి కనిపించేలా వైసీపీ అధినేత జగన్‌ వ్యూహం సిద్ధం చేసినట్లు తెలిసింది. కొడుకు వైఖరితో విసిగి వేసారిన విజయలక్ష్మి గత కొంత కాలంగా వైసీపీ కార్యకలాపాలకు దూరంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. తన కూతురు షర్మిలతో నివసిస్తున్నారు. షర్మిల తెలంగాణలో వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ(వైఎ్‌సఆర్‌టీపీ)ని ఏర్పాటు చేసి ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. ఆమె పార్టీకి తన సంపూర్ణ మద్దతు, సహకారం ఉంటాయని విజయలక్ష్మి ఇదివరకే  ప్రకటించారు. గత కొంతకాలంగా జగన్‌తో, వైసీపీతో ఎడమొహం, పెడమొహంగా ఉన్నారు. ఆమెను పార్టీ నేతలెవరూ పట్టించుకోవడం లేదు. చివరకు ఆమె పుట్టిన రోజున శుభాకాంక్షలు కూడా చెప్పలేదు. శుక్ర, శనివారాల్లో జరిగే వైసీపీ ప్లీనరీకి గౌరవాధ్యక్షురాలి హోదాలో విజయలక్ష్మి వస్తారా రారా అని చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో గుంటూరులో ఏర్పాటు చేసిన ప్లీనరీ ఫ్లెక్సీలలో ఆమె ఫొటోలు కనిపించకపోవడంతో ఆమె రాకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె కచ్చితంగా వస్తారని పార్టీ ముఖ్యనేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి బుకాయిస్తూ వచ్చారు. తాడేపల్లిలో గురువారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విజయలక్ష్మి ప్లీనరీకి హాజరవుతారని ప్రకటించారు. శనివారం తొలి ప్రసంగం ఆమెదేనని పార్టీ అధికారికంగానూ ప్రకటించింది. అయితే ఆమె రారని తెలియడంతో.. పార్టీ నుంచి శాశ్వతంగా సాగనంపేందుకు జగన్‌ వ్యూహం రూపొందించారు. ఆమెతోనే రాజీనామా చేయించేలా ప్లాన్‌ వేశారు. తెలంగాణలో కూతురి పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్నందున.. కొడుకు పార్టీకి పనిచేయడం శ్రమ అవుతోందని.. అందుచేత వైసీపీ గౌరవాధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని ఆమె పార్టీకి లేఖ రాసేలా ముసాయిదా తయారుచేసి పంపినట్లు తెలిసింది.


వైఎస్ ఆర్‌టీపీకి వెన్నుదన్నుగా..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సఖ్యతతో మెలగాల్సి ఉన్నందున తెలంగాణలో కొత్త పార్టీ పెట్టొద్దని చెల్లెలు షర్మిలకు జగన్‌ సూచించారు. కానీ విభేదాలు, మనస్పర్థలతో బయటకు వచ్చేసిన ఆమె.. ఆ రాష్ట్రంలో వైఎ్‌సఆర్‌టీపీని స్థాపించిన సంగతి తెలిసిందే. జగన్‌తో షర్మిలకు విభేదాలు తలెత్తాయని.. ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టబోతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ అప్పట్లో వెలుగులోకి తెచ్చింది. దీనిపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమైంది. తాము వద్దని వారించినా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టారని.. దీనితో తమకు సంబంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ప్రకటించారు. నాటి నుంచి అన్నాచెల్లెళ్ల మధ్య దూరం పెరిగింది. జగన్‌ వద్దన్నా తల్లి విజయలక్ష్మి కుమార్తెకే మద్దతిచ్చారు. రాజశేఖర్‌రెడ్డి తనయను ఆశీర్వదించాలని పలు వేదికలపై తెలంగాణ పౌర సమాజాన్ని కోరారు. కుమార్తెతో కలిసి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 


మూలస్తంభం కూలిపోయింది!

వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో.. పార్టీ గౌరవాధ్యక్షురాలిగా విజయలక్ష్మి గురించి ప్రస్తావించారు. పార్టీ స్థాపించిననాటి నుంచి ఆమె వెన్నుదన్నుగా నిలిచారని.. పార్టీని ముందుకు నడిపిస్తూ మూలస్తంభంలా ఉన్నారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడా మూలస్తంభం కూలిపోయిందని.. పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు కల్పించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


నాడు కుట్ర అన్నారుగా..!

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న ఖాళీస్థలంలో వైసీపీ ప్లీనరీ జరుగనుంది. దాని ఏర్పాట్ల పరిశీలనకు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి కొద్దిరోజుల కింద అక్కడకు వెళ్లారు. మీడియాతో మాట్లాడారు. ప్లీనరీకి విజయలక్ష్మి హాజరవుతారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు వారు ఘాటుగా స్పందించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌ హాజరువుతున్నారా అని అడిగినట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో కావాలనే ఈ ప్రశ్న వేయించారని.. ఇందులో కుట్ర దాగుందని ఆరోపించారు. ఇప్పుడు ఆమె ప్లీనరీకి రావడం లేదని తేలిపోయిందని.. పైగా గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేయిస్తున్నారని.. కుట్ర ఆరోపణలపై వారేమంటారని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

Read more