-
-
Home » Andhra Pradesh » Amaravati Notification Municipality bbr-MRGS-AndhraPradesh
-
Amaravati: అమరావతిపై కొత్త నాటకం..!
ABN , First Publish Date - 2022-09-09T02:16:59+05:30 IST
అమరావతి (Amaravati) రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర లేపింది. రాజధాని రైతుల ఉద్యమం చరిత్రాత్మక వెయ్యి రోజుల ఘట్టానికి

గుంటూరు: అమరావతి (Amaravati) రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నాటకానికి తెర లేపింది. రాజధాని రైతుల ఉద్యమం చరిత్రాత్మక వెయ్యి రోజుల ఘట్టానికి చేరువవుతోన్న తరుణంలో దృష్టి మళ్లించడానికి కొత్తగా అమరావతి మునిసిపాలిటీ అంటూ నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. 22 గ్రామ పంచాయతీలతో కూడిన పురపాలక సంఘం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. తక్షణమే ప్రభాభిప్రాయ సేకరణ జరపాల్సిందిగా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు రాగా వాటిని గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యరూపంలోకి తీసుకొచ్చారు. 10 రోజుల వ్యవధిలో అభ్యంతరాలు, వివరణలు తెలియజేయాలని ఆ నోటిఫికేషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఒకవేళ నిర్ణీత వ్యవధిలో ఎలాంటి జవాబులు రాకుంటే సంబంధిత గ్రామ పంచాయతీని అమరావతి మునిసిపాలిటీ (Municipality)లో విలీనం చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేనట్లుగా భావిస్తామని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ గురువారం వెలుగులోకి రావడంతో అమరావతి ప్రాంత ప్రజలు ప్రభుత్వ వైఖరిపై కారాలు మిరియాలు నూరుతోన్నారు. అమరావతి రాజధాని మాష్టర్‌ప్లాన్ ప్రకారం నగరాన్ని నిర్మించాలని, అందులో ఎలాంటి మార్పులకు తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.
గత ఏడాది డిసెంబరు నెల చివరి వారంలో పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి గుంటూరు జిల్లా కలెక్టర్‌కి అమరావతి కేపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్‌ని ఏర్పాటు చేసేందుకు ప్రజల అభిప్రాయ సేకరణ జరపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ మేరకు అప్పటి కలెక్టర్ వివేక్‌యాదవ్ నోటిఫికేషన్‌లు విడుదల చేసి 19 గ్రామాల్లో ప్రజల అభిప్రాయాన్ని సంక్రాంతి పండగకి ముందువరకు సేకరించారు. తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెంకటపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, అనంతవరం, ఐనవోలు, శాకమూరు, నేలపాడు, దొండపాడు, రాయపూడి, తుళ్లూరు, మంగళగిరి మండలంలోని కురగల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండలో ప్రజల అభిప్రాయాలను సేకరించారు. అన్ని గ్రామాల్లోనూ అధికారులకు నిరసన సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనని తాము తిరస్కరిస్తోన్నట్లు చెప్పారు. దాంతో అమరావతి కేపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ వ్యవహారం మరుగున పడిపోయింది.