-
-
Home » Andhra Pradesh » Amaravati Farmers Mahapadayatra-NGTS-AndhraPradesh
-
పశ్చిమలో ఉత్సాహంగా పాదయాత్ర
ABN , First Publish Date - 2022-10-11T09:29:18+05:30 IST
అమరావతి రైతుల మహాపాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించడంతో..

నేడు 16 కి.మీ. నడక.. పూజారి వ్యాఖ్యలతో రైతుల ఆవేదన
భీమవరం, అక్టోబరు 10: అమరావతి రైతుల మహాపాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. సోమవారం పాదయాత్రకు విరామం ప్రకటించడంతో రైతులు పెనుగొండలో విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. జిల్లాలో జోరున కురుస్తున్న వానకు తడుస్తూనే పాదయాత్ర ముందుకు సాగుతోంది. ఈ నెల 9వ తేదీ ఆదివారం వరకు జిల్లాలో ఐదు రోజుల పాటు తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో పాదయాత్ర కొనసాగింది. 500 మందిపైగా రైతులుపశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 100 కిలోమీటర్ల మేరకు నడిచారు. కాగా, పాదయాత్ర 29వ రోజు మంగళవారం ఆచంట నుంచి తణుకు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది.
ఉదయం 9గంటలకు పెనుగొండ నుంచి ఇలిందలపర్రు మీదుగా ఇరగవరం మండల కేంద్రానికి చేరుకుంటుంది. అక్కడ మధ్యాహ్నం భోజనం అనంతరం, తణుకు మండలం వేల్పూరు గ్రామంలో రాత్రి బస చేస్తారు. సుమారు 16 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. కాగా, మహా పాదయాత్రకు సోమవారం విరామం ప్రకటించిన రైతులు పెనుగొండలోని కల్యాణ మండపంలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ సమయంలో స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీ మాతను దర్శించుకునేందుకు కొందరు రైతులు వెళ్లారు. ఈ సందర్భంగా ఒక పూజారి.. ‘పాదయాత్రలో రోజుకు ఎంత ఇస్తున్నా’రంటూ ప్రశ్నించారు. దీంతో రైతులు నిర్ఘాంతపోయారు. భూములు ఇచ్చి రోడ్డున పడిన తమను ఇలాంటి సూటిపోటి మాటలతో అవమానాలకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకుడిపై కమిటీ సభ్యులకు ఫిర్యాదు చేశారు.