Amaravathi : అమరావతే ఏకైక రాజధాని!
ABN , First Publish Date - 2022-12-20T03:04:48+05:30 IST
ఏపీ రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి జాతీయ స్థాయిలో భారీ మద్దతు లభించింది. వేలాది ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు న్యాయం జరగాలని, అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని సోమవారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) నిర్వహించిన కిసాన్ గర్జన ర్యాలీలో ప్రత్యేక తీర్మానం చేశారు.
భారతీయ కిసాన్ సంఘ్ తీర్మానం
రాజధాని రైతులకు జాతీయ మద్దతు
అమరావతి పనులు 60-70 శాతం పూర్తి
మోదీ పట్టించుకుని పూర్తిచేయాలి
ఢిల్లీలో జరిగిన ‘కిసాన్ గర్జన’లో
అమరావతి రాజధాని రైతుల వేడుకోలు
న్యూఢిల్లీ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఏపీ రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి జాతీయ స్థాయిలో భారీ మద్దతు లభించింది. వేలాది ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు న్యాయం జరగాలని, అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని సోమవారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) నిర్వహించిన కిసాన్ గర్జన ర్యాలీలో ప్రత్యేక తీర్మానం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో శనివారం నిర్వహించిన మహా ధర్నాలో జగన్ ప్రభుత్వం తమకు చేసిన అన్యాయాన్ని రైతులు ఎండగట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలోని రాంలీల మైదాన్ వేదికగా నిర్వహించిన ‘కిసాన్ గర్జన’కు బీకేఎస్ నేతలు అమరావతి రైతులను ఆహ్వానించారు. దీనికి అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమకు జరిగిన అన్యాయంపై మరోసారి గళం విప్పారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన విధానాన్ని వివరించారు. తొలుత, బీకేఎస్ అఖిల భారత కార్యదర్శి కొండల సాయిరెడ్డి మాట్లాడుతూ.. అమరావతి రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో తాము అమరావతి రాజధానిని ప్రత్యేక అంశంగా ఎజెండాలో చేర్చామని తెలిపారు. రాజదాని విషయంలో జగన్ ప్రభుత్వం తుగ్లక్‌లా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేయాల్సి ఉంటుందన్నారు. అమరావతికి తాము గతంలోనే మద్దతు తెలిపామన్నారు. రాజధాని విషయంలో ఏపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరికాదని విమర్శించారు. రాజధాని రైతులకు బీకేఎస్ మద్దతుగా ఉంటుందని తెలిపారు. గతంలో కూడా అమరావతి రైతుల ఆందోళనకు తాము మద్దతు ఇచ్చామని వివరించారు. రాజధాని సాధించే వరకు అమరావతి రైతు ల పక్షాన నిలబడతామన్నారు.
అనాలోచిత నిర్ణయం
అమరావతి పరిరక్షణ సమితి నాయకులు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, రైతు సమన్వయ కమిటీ నాయకులు స్వరాజ్యరావు, గద్దె తిరుపతిరావు మాట్లాడుతూ.. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మూడు రాజధానుల పేరుతో రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలని నినదించారు. మహిళా రైతులు మాట్లాడుతూ.. రాజధాని కోసం 33 వేల ఎకరాల పచ్చటి భూములను ఇచ్చామని, వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా తాము రోడ్డున పడ్డా జగన్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వమైనా తమ మొర వింటుందనే ఉద్దేశంతో కిసాన్ గర్జన ద్వారా తమ సమస్యలు వివరించామని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులతో రాజధాని పనులు 60-70 శాతం పూర్తయ్యాయని మిగిలిన పనులు కూడా పూర్తయ్యేలా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.