ఏపీ రాజధాని అమరావతే
ABN , First Publish Date - 2022-10-17T09:14:08+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ మహాసభ డిమాండ్ చేసింది.
- శంకుస్థాపన వేడుకకు ప్రధాని గంగాజలం తెచ్చారు
- మోదీ శంకుస్థాపన చేసినా కేంద్రం పట్టించుకోదా?
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే పనులు చేపట్టాలి
- సీపీఐ జాతీయ మహాసభల్లో ఏకగ్రీవ తీర్మానం
అమరావతి, విజయవాడ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ మహాసభ డిమాండ్ చేసింది. అమరావతి రాజధాని నిర్మాణం పట్ల ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతికూల వైఖరిని తీవ్రంగా ఖండించింది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయం ప్రజల్లో ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తోందని, ఆ నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలని స్పష్టం చేసింది. అమరావతి రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దుష్ట చర్యలను ఉపసంహరించుకోవాలని సూచించింది. ప్రధాని నరేంద్రమోదీ గంగాజలాన్ని తీసుకొచ్చి అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని తప్పుబట్టింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సానుకూలంగా స్పందించి అమరావతి రాజధాని నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని డిమాం డ్ చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీపీఐ జాతీయ మహాసభ ఆమోదించింది. విజయవాడలో ఈనెల 14 నుంచి సీపీఐ 24వ జాతీయ మహాసభలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభలలో ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆదివారం అమరావతిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘‘అమరావతిని ఏపీ కొత్త రాజధానిగా నిర్ణయిస్తూ 2014, సెప్టెంబరు 4న రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానించారు. అప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీతోసహా ప్రతిపక్ష పార్టీ వైసీపీ, ఇతర అన్ని రాజకీయ పార్టీలూ ఆమోదం తెలిపాయి. రాజధాని నిర్మాణం కోసం రైతులు త్యాగం చేసి 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు. 2017 అక్టోబరు 22న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రూ. 10వేల కోట్లు ఖర్చు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మూడు రాఽజధానుల బిల్లు ప్రవేశపెట్టింది. ఈ నిర్ణయంతో అమరావతి రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి’’ అని పేర్కొంటూ ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానానికి మహాసభల్లో పాల్గొంటున్న 29 రాష్ట్రాల ప్రతినిధులు ఆమోదం తెలపడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అనంతరం ఇదే అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శులు అతుల్ కుమార్ అంజన్, కె.నారాయణ, అమర్జీత్ కౌర్ మీడియాతో మాట్లాడారు.