అదంతా.. కొండ-ప్రభుత్వ భూమి

ABN , First Publish Date - 2022-09-08T09:33:23+05:30 IST

అదంతా.. కొండ-ప్రభుత్వ భూమి

అదంతా.. కొండ-ప్రభుత్వ భూమి

రికార్డుల్లో రుషికొండ సర్వే నం. 19లో ఇదే ఉంది 

ఏపీటీడీసీకి ఆ భూమిపై హక్కుందా? 

అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చట్టం ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌లోని కొండలను పరిరక్షించాలి

జీవీఎంసీకి ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ లేఖ


విశాఖపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని రుషికొండపై రూ.250 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టు నిర్మించేందుకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కు అసలు ఆ భూమిపై హక్కు ఉందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికీ ఆ భూమి ‘కొండ-ప్రభుత్వ భూమి’గానే చూపిస్తోంది. విశాఖలో ఉంటున్న ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ రాశారు. భవనాల నిర్మాణానికి ఏపీటీడీసీ దరఖాస్తు చేస్తే మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎలా అనుమతులు జారీ చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. 


లేఖలో శర్మ ఏం పేర్కొన్నారంటే.. 

విశాఖ గ్రామీణ మండలం రుషికొండ సర్వే నంబర్‌ 19లో కొండ..ప్రభుత్వ భూమి ఉన్నట్టు ప్రభుత్వ రికార్డులు పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అంటే ఏపీటీడీసీకి ఎటువంటి టైటిల్‌ లేదని అర్థమవుతోంది.

అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ చట్టం ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ పరిధిలోని కొండలను పరిరక్షించాలి. వాటిపై ఎటువంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. గతంలో వుడా (ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ) దీనిని మాస్టర్‌ప్లాన్‌లో సీఆర్‌జెడ్‌ కింద కూడా గుర్తించింది.

ఏపీటీడీసీ రుషికొండలో హరిత రిసార్ట్స్‌ను కూలగొట్టి, ఆ వ్యర్థాలను తీరం పొడవునా కిలోమీటర్ల మేర వెదజల్లింది. ఇది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అర్బన్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది.

రుషికొండపై నిర్మిస్తున్న బిల్డింగ్‌ కాంప్లెక్స్‌ కోసం ఏపీటీడీసీ బోర్లు వేసి ఆ నీటిని వినియోగిస్తోంది. సీఆర్‌జెడ్‌ ప్రాంతంలో ఇలా బోర్లు వేయకూడదు. ప్రాథమికంగానే నిబంధనలు ఉల్లంఘించిన సంస్థకు నిర్మాణ అనుమతులు ఇవ్వడం ఏ విధంగాను సమంజసం కాదు.


విస్తీర్ణంపైనా అస్పష్టత 

ఏపీటీడీసీ రుషికొండపై క్లైమ్‌ చేస్తున్న భూ విస్తీర్ణంలో కచ్చితత్వం లేదని, ఒక్కోచోట ఒక్కోవిధంగా చెబుతోందని, అందులో ఏది వాస్తవమో తేల్చాల్సిన అవసరముందని శర్మ తన లేఖలో పేర్కొన్నారు. అధికారిక గ్రామ రికార్డుల్లో సర్వే నంబరు 19లో 85.2 ఎకరాలుగా చూపిస్తోంది. అందులో కొండ అనే ఉంది. మరో వైపు ఏపీటీడీసీ తన బ్రోచర్‌లో రుషికొండ ప్రాజెక్టు భూమి విస్తీర్ణం 65.65 ఎకరాలుగా పేర్కొంది. ఇంకో వైపు పర్యావరణ మంత్రిత్వ శాఖ కొండపై మొత్తం విస్తీర్ణం 61 ఎకరాలని ప్రస్తావించింది. ఈ విషయంలో ఏపీటీడీసీకే క్లారిటీ లేదని  శర్మ అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం దరఖాస్తు చేసిన ఏపీటీడీసీ పేర్కొన్న వివరాల్లో విశ్వసనీయత లేనందున, అక్కడ కొత్తగా జీవీఎంసీ సర్వే చేయాల్సిన అవసరముందన్నారు. రికార్డుల్లో దానిని కొండగా చూపిస్తున్నందున అక్కడి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఏపీటీడీసీకి నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదని సూచించారు. 

Read more