‘సేఫ్‌’ గేమ్‌!

ABN , First Publish Date - 2022-07-18T07:56:48+05:30 IST

‘సేఫ్‌’ గేమ్‌!

‘సేఫ్‌’ గేమ్‌!

పోస్టింగుల్లో జగన్‌ సర్కారు ముందుచూపు

చెప్పినట్లు చేసేవారికే కీలక పదవులు

తమ పని కాగానే మరో చోటుకు బదిలీ

అక్కడా చెప్పిన మాట వినాల్సిందే

తేడా వేస్తే శంకరగిరి మాన్యాలే

రాజకీయ ప్రత్యర్థులకు సన్నిహితులైన అధికారులే తాజా టార్గెట్‌

కీలక పోస్టులిచ్చి వారితో స్వకార్యాలు నెరవేర్చుకుంటున్న వైనం

ప్రభుత్వం మారినా వారిని టచ్‌ చేయరు!

అప్పుడు మనకూ ఇబ్బందులు ఉండవ్‌

ప్రభుత్వ పెద్దల దూరాలోచన


ప్రతిభ, సామర్థ్యాలతో సంబంధం లేదు. పనితీరుపై ఫిర్యాదులున్నా పర్లేదు. కానీ మనం చెప్పిన నోరెత్తకుండా చేసిపెడతారా లేదా అనేదే జగన్‌ జమానాలో కీలకంగా మారింది. మన రాజకీయ శత్రువుతో సన్నిహితంగా ఉండేది ఎవరు? గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిందెవరు? రేపు ప్రభుత్వం మారినా తమ దాకా ఇబ్బందులు రాకుండా చూసుకోగలవారెవరు? ఇలాంటి అంచనాలతోనే అధికారుల జాబితాను తయారుచేసి.. వాటి ఆధారంగానే పోస్టింగులిస్తున్నారని అధికార వర్గాల్లోనే  చర్చ జరుగుతోంది. ఒక శాఖలో తమ పని పూర్తికాగానే అస్మదీయ అధికారులను వేరే శాఖకు పంపుతున్నారని.. అక్కడ తోక జాడిస్తే బదిలీ వేటు వేసి.. ఎందుకూ కొరగాని పోస్టింగులు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏ ప్రభుత్వమైనా.. వివిధ శాఖలకు కార్యదర్శులు, విభాగాధిపతులు (హెచ్‌వోడీ)గా అఖిల భారత సర్వీసు అధికారులను నియమిస్తుంటుంది. ప్రతిభ, సామర్థ్యం, ట్రాక్‌ రికార్డు ఆధారంగా ప్రాధాన్య  విభాగాల్లో పోస్టింగులిస్తుంది. తీవ్రమైన ఫిర్యాదులు, పనితీరుపై విమర్శలు ఎదుర్కొంటున్నవారికి, ట్రాక్‌ రికార్డు సరిగా లేనివారికి పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టులు ఇస్తుంటుంది. కానీ మన రాష్ట్రంలో అన్నీ రివర్సే. ఇక్కడ ‘ముందుచూపు’ పోస్టింగులు ఇస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చేది ఎన్నికల కాలం కావడంతో స్వకార్యాలు నెరవేర్చుకునేందుకు ఏరికోరి కొందరు అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తున్నారని, వారి పనితీరును బట్టి తదుపరి సేవలకు వాడుకుంటున్నారని సర్వత్రా  చర్చ సాగుతోంది. ఈ వ్యవహారంలో అధినేత వద్ద పనిచేసే ఓ ముఖ్య అధికారిదే కీలక పాత్ర అని అధికారుల సోషల్‌ మీడియా చర్చల్లో ప్రధానంగా వినిపిస్తోంది. ఏ శాఖలో ఎవరికి పోస్టింగ్‌ ఇచ్చారు.. ఆ శాఖలో ఇటీవల ఏమేం పెద్ద నిర్ణయాలు తీసుకున్నారు.. ఏ అధికారిని బదిలీ చేశారు..? అందుకు గల బలమైన కారణాలేమిటన్న కోణాల్లో వారు చర్చించుకుంటున్నారు. ఎన్నికల వేడి రాజుకోకముందే స్వకార్యాలను పూర్తిచేయించుకోవాలన్న వ్యూహంలో భాగంగా కొన్ని పోస్టింగులు ఉంటాయని, ఈ విషయంలో తస్మాత్‌ జాగ్రత్త అని పరస్పరం హెచ్చరించుకుంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులకు సన్నిహితులుగా ముద్రపడిన అధికారులతోనే స్వకార్యాలు నెరవేర్చుకునేలా కొత్త తరహా పోస్టింగులు ఉంటున్నాయని, ఒకవేళ ప్రభుత్వం మారి పలు నిర్ణయాలపై సమీక్షలు జరిగినా సదరు అధికారులే బాధ్యులుగా ఉంటారని.. అప్పుడు వారిని ఎలాగూ టచ్‌చేయరని, తాము కూడా క్షేమంగా ఉంటామనే దూరాలోచనతో ఈ వ్యూహాన్ని ఆచరిస్తున్నట్లు అనుకుంటున్నారు. అయితే మాట వినని వారిని క్షణాల్లోనే మార్చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


సీనియారిటీతో సంబంధం లేదు..

సీనియారిటీ, హోదా, సర్వీసును చూడకుండా ఇష్టానుసారంగా పోస్టింగ్‌లు మార్చుతున్నారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అందులో మచ్చుకు కొందరి అంశాలు చర్చలకొస్తున్నాయి.. సీఎస్‌ స్థాయి కలిగిన ఓ సీనియర్‌ అధికారిని ఉత్తరాంధ్రలో ఓ ప్రమాదకర ఘటన కేసు విచారణ కోసం వాడుకున్నారు. అదే సమయంలో ఆయనకు ప్రభుత్వంలో అతి ముఖ్యమైన పోస్టు ఆఫర్‌ చేశారు. ఏకకాలంలో రెండు కీలక పోస్టుల్లో కొనసాగిన ఆయన్ను ఓ రోజున ఉన్నట్టుండి ఓ ముఖ్యమైన పోస్టు నుంచి తొలగించారు. ఇది అధికార వర్గాల్లో సంచలనంగా మారింది. పెద్దలు రంగప్రవేశం చేసి ఏదోవిధంగా సర్దుబాటు చేశారు. 48గంటల వ్యవధిలో తిరిగి ఆ  పోస్టును అప్పగించారు. ఈలోగా ఉత్తరాంధ్ర ప్రమాద ఘటన కేసును ఆయన కొలిక్కి తీసుకొచ్చారు. విశాఖలో లేటరైట్‌ ముసుగులో బాక్సైట్‌ తవ్వేస్తున్నారన్న కేసులోనూ ఆయన్ను గట్టిగానే వాడుకున్నారు. ఆ కేసులో పెద్దలు కోరుకున్నట్లుగానే నివేదికలు ఇచ్చారు. తర్వాత కొద్దిరోజులకే ఆయన్ను ముఖ్యమైన పోస్టు నుంచి మళ్లీ తప్పించేశారు. కనీసం ఆఫీసుకు రాకుండానే ఆయన రిలీవ్‌ అయ్యారు. సొంత పనులు సరిగ్గా చేయనందుకే ఆయన్ను అడవుల బాట పట్టించారన్న చర్చ అధికార వర్గాల్లో సాగింది.


విశాఖలో అన్నిటికీ వాడుకుని.. 

ఒక అధికారి గత ప్రభుత్వంలో ఓ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. ప్రభుత్వం మారగానే కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. అక్కడా ఇమడలేక కొందరు పెద్దలను పట్టుకుని తిరిగి రాష్ట్ర సర్వీసుకొచ్చారు. మధ్యవర్తుల ద్వారా అధినేత్రిని కలిశారు. విశాఖలోని ఓ కీలక ప్రాజెక్టు పని ఉందని ఆమె చెప్పారు. ఆయన తలూపారు. అంతే.. మరుసటిరోజే ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చారు. విశాఖలో ఇప్పుడు రచ్చరచ్చ అవుతోన్న ఓ ప్రాజెక్టు, భూముల బదలాయింపు, రుణాల కోసం భూములు, ఆస్తుల తాకట్టు వంటి కీలకమైన పనులకు ఆయన ఎస్‌ బాస్‌ అన్నారు. అయితే సీఎంవోలో కీలక అధికారికి బంధువు, సన్నిహితుడైన ఇంజనీరింగ్‌ అధికారిని టచ్‌చేశారు. అంతే.. ఆయన్ను అక్కడి నుంచి మార్చారు. చెప్పని పనులు కూడా చేశారని ఆయనపై కన్నెర్ర చేసినట్లు చర్చ జరుగుతోంది.


రూల్స్‌ ప్రకారం వెళ్తానంటే..

ఇంకొక సీనియర్‌ అధికారి. అణగారిన వర్గాల మేలు కోసం ఉద్దేశించిన శాఖల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు. అధికారులపై వచ్చిన అభియోగాలను పరిశీలించి వాస్తవిక నివేదికలిచ్చే కీలక బాధ్యతలు కూడా నిర్వహించారు. పెద్దలకు కంట్లో నలుసుగా మారిన ఓ అఖిల భారత సర్వీసు అధికారిపై విచారణ సందర్భంగా ఏం చేయాలో ఆయనకు దిశానిర్దేశం చేశారు. ఇందుకాయన అంగీకరించలేదు. రూల్స్‌ ప్రకారం వెళ్తానని, అడ్డగోలుగా వెళ్తే తాను ఇబ్బందుల్లో పడతానని స్పష్టం చేశారు. అంతే.. ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పించేశారు. కొంతకాలం వెయిటింగ్‌లో ఉంచి.. తర్వాత ఏ మాత్రం ప్రాధాన్యం లేని పోస్టింగ్‌ ఇచ్చారు.


రిటైరైనా కీలక పోస్టు.. 

మూడు రాజధానుల అంశం తెరపైకి రావడానికి ముందు అమరావతిపై ఓ అధికారితో శూలశోధన చేయించారు. ఇందుకు ఆయన్ను అన్ని కోణాల్లో వినియోగించుకున్నారు. ఆ తర్వాత రాజధానిపై రాజకీయంగా, సామాజికంగా మూకుమ్మడి దాడిచేశారు. ఇటీవల ఆ అధికారి పదవీ విరమణ చేశారు. కానీ మరో పనికి వాడుకోవాలనుకొని మరో కీలక పోస్టింగ్‌ ఇచ్చారు. న్యాయాధికారాలు ఉండే ఆ పోస్టును రిటైర్డ్‌ అధికారిని కట్టబెట్టారంటే దాని వెనుక ఎంత ముందుచూపు పని ఉందోనన్న చర్చ సాగుతోంది. ఇంకొక అధికారి కూడా సీనియరే. గత ప్రభుత్వంలో అత్యంత ముఖ్య హోదాలో పనిచేశారు. సర్కారు మారిన తర్వాత ఆయనకు తొలి రెండేళ్లు ఎందుకూ పనిరాని పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత కీలక విభాగానికి మార్చారు. కొంతకాలం తర్వాత అక్కడి నుంచి తప్పించి అప్రధాన పోస్టుకు మార్చారు. అనూహ్యంగా ఇప్పుడు ఆయన్ను ముఖ్యమైన పోస్టులోకి తీసుకొచ్చారు. ఆ శాఖ అధికారిగా, విభాగాధిపతిగా ఆయనే కొనసాగుతున్నారు ఈ శాఖలో ఏ నిర్ణయం జరిగినా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక వేళ ప్రభుత్వం మారితే.. ఆ శాఖలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష జరిగితే.. ముందు ఆయనే ఎదుర్కోవలసి ఉంటుందనే ముందస్తు అంచనాతో ఆ పోస్టు కట్టబెట్టారని చర్చసాగుతోంది. ఒకవేళ తప్పు జరిగినట్లు తేలితే.. వచ్చే ప్రభుత్వం తమ మనిషిని ఎలాగూ టచ్‌ చేయదని, అప్పుడు తమకు కూడా ఆపద రాదన్నది ఈ ముందుచూపు మాటు వ్యూహం.


ఆయనకు అర్హత లేకున్నా..

ఇతర రాష్ట్రాల నుంచి పలువురు అధికారులు డిప్యుటేషన్‌పై ఇక్కడ వాలిపోతున్నారు. అందులో ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు కూడా ఉన్నారు. కోరుకున్నచోట వారికి పోస్టింగులు ఇస్తున్నారు. ఏమాత్రం సంబంధం లేని శాఖల్లో సైతం వారిని కూర్చోబెడుతున్నారు. నమ్మకస్తుడైన ఓ అధికారిని తీసుకొచ్చి భారీ ఆదాయం తీసుకొచ్చే శాఖలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ శాఖ విభాగాధిపతిగా పనిచేసే అర్హత, స్థాయి లేకున్నా సొంత మనిషి అనే ఒకే ఒక్క కారణంతో అక్కడ కూర్చోబెట్టారు. పెద్దలు కోరుకున్నట్లుగా ఆయన పనిచేసుకుంటూ పోతున్నారు. ఎన్నికల తర్వాత ఇదే ప్రభుత్వం వస్తే అదే పోస్టులో కొనసాగుతానని, మరో సర్కారు వస్తే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతానని ఆ అధికారి బాహాటంగానే చెబుతున్నారు.


మంత్రితో తేడా కొట్టి..

గత ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఓ అధికారి.. జగన్‌ సర్కారు వచ్చాక రెండు శాఖల్లో పనిచేశారు. గత ప్రభుత్వానికి సన్నిహితుడనే ముద్ర ఉన్నప్పటికీ ఆయనకు కావాలనే కీలక పోస్టు ఇచ్చారన్న చర్చ సాగుతోంది. ఓ శాఖ పరిధిలో రూ.4 వేల కోట్ల కొనుగోళ్లు జరిపారు. అందులో పెద్ద ఎత్తున గోల్‌మాల్‌ జరిగిందని విపక్షాలు, ప్రజాసంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయన్ను మరో ముఖ్య శాఖ విభాగాధిపతిగా మార్చారు. అక్కడ మంత్రితో తేడా కొట్టింది. అంతే.. బదిలీ చేసేశారు. ఇప్పుడాయన ఎక్కడున్నారో కూడా గుర్తుపెట్టుకోలేనంత అప్రధాన పోస్టుకు మార్చేశారు.

Read more