ABN Digital mediaలో ఏపీ పొత్తులపై సర్వే.. 2024 TDP గెలుపు ఖాయం!..
ABN , First Publish Date - 2022-06-09T17:34:53+05:30 IST
వైసీపీ (YCP) ఆగడాలతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) జనం విసిగిపోయారు.
Amaravathi: వైసీపీ (YCP) ఆగడాలతో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) జనం విసిగిపోయారు. అధికారపార్టీ నేతల తీరును అసహ్యించుకుంటున్నారు. గడప గడపకు అంటూ ఎమ్మెల్యేలు వీధుల్లోకి వెళితే జనం నిలదీసి చీవాట్లు పెడుతున్నారు. రోడ్లు లేవు, నీళ్లు రావడం లేదు, కరెంట్ చార్జీలు భరించలేకపోతున్నాం. ఇంటి పన్ను విపరీతంగా పెంచారు.. సంక్షేమ పథకాలు అందడంలేదంటూ ఎమ్మెల్యేల వెంటపడుతున్నారు. వైసీపీ నేతలకు సెగ తగలడంతో వాళ్లు పలాయనం చిత్తగించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో జన నాడిని తెలుసుకునేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రయత్నించింది. ఏబీఎన్ డిజిటల్ మీడియాలో నిర్వహించిన సర్వేలో లక్షా 30వేల మంది పాల్గొన్నారు. జగన్ సర్కార్‌పై తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. పొత్తులు ఉన్నా, లేకపోయినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలో తేలింది.
నిజానికి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహించిన సర్వే పొత్తుల గురించి మాత్రమే.. కాకపోతే జననాడి చూస్తే మాత్రం అధికారం మారడం ఖాయమని తేలిపోయింది. ట్విట్టర్‌లో నిర్వహించిన సర్వేప్రకారం టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలని 45.7 శాతం మంది అభిప్రాయపడ్డారు. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని 18 శాతం, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని 19.2 శాతం మంది సూచించారు. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని 17.1 శాతం మంది కోరుకుంటున్నారు.
ఇక యూట్యూబ్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని 45 శాతం, టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని 18 శాతం మంది అభిప్రాయంవ్యక్తం చేశారు. జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలని 9 శాతం మంది కోరుకుంటున్నారు. టీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాలని 28 శాతం మంది కోరారు. అటు ట్విట్టర్, ఇటు యూ ట్యూబ్‌లో నిర్వహించిన సర్వేలో సగటున చూస్తే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని 31.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని 18.6 శాతం మంది కోరుకుంటున్నారు. జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగాలని 13.05 శాతం మంది సూచించారు. టిడీపీ ఒంటరిగా బరిలోకి దిగడమే తగిన మార్గమని 36.85 శాతం మంది కోరారు.