అబ్బే.. పీఠం కోసం కాదు..!

ABN , First Publish Date - 2022-08-11T08:53:21+05:30 IST

అబ్బే.. పీఠం కోసం కాదు..!

అబ్బే.. పీఠం కోసం కాదు..!

భవిష్యత్‌ అవసరాల కోసమే.. ఆ 50 ఎకరాల అభివృద్ధి.. 

వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ వివరణ

అదే నిజమైతే ఆగమేఘాలపై నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు?

జీవీఎంసీ భేటీకి ముందే మేయర్‌ ఎలా అనుమతిచ్చారు?


విశాఖపట్నం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో 50 ఎకరాల అభివృద్ధి భవిష్యత్‌ అవసరాల కోసమేనని విశాఖ మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ వెల్లడించారు. శారదా పీఠం కోసం కాదని బుధవారం ఓ ప్రకటనలో వివరణ ఇచ్చారు. శారదా పీఠాధిపతి అనుగ్రహం కోసం ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. పీఠానికి కొత్తవలసలో కేటాయించిన 15 ఎకరాలు పూర్తిగా కొండపైన ఉండడంతో దానికి మౌలిక వసతులు కల్పించడానికి జిల్లా అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా ఆ పనులు చేపడితే విమర్శలు వస్తాయని దొడ్డిదారిన వీఎంఆర్‌డీఏను రంగంలోకి దించారు. ప్రభుత్వ భూములను తీసుకుని, వాటిని అభివృద్ధి చేసి విక్రయించడం వీఎంఆర్‌డీఏకు అలవాటే కాబట్టి ఆ కోటాలో కొత్తవలస కొండ చుట్టుపక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కొత్తవలస సర్వే నంబర్‌ 73లో సుమారుగా 130 ఎకరాల భూమి ఉంది. అందులో కొండపై 15 ఎకరాలు పీఠానికి ఇచ్చారు. ఆ కొండపైకి రహదారి వేయాలన్నా, అదంతా అభివృద్ధి చేయాలన్నా చాలా ఖర్చు చేయాలి. అంత చేశాక కూడా అది జనావాసాలకు దూరంగానే ఉంటుంది. అందుకని పీఠం పనుల కంటే ముందే మిగిలిన భూమిని అభివృద్ధిలోకి తేవాలని నిర్ణయించారు. తెలివిగా అదే సర్వే నంబర్‌లో 50 ఎకరాలను వీఎంఆర్‌డీఏకి బదలాయిస్తూ రెవెన్యూ అధికారులు ఫైల్‌ నడుపుతున్న వైనంపై ‘శారదాపీఠానికి మరో సంతర్పణ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ బుధవారం కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇదంతా భవిష్యత్‌ అవసరాల కోసమేనని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ వివరణ ఇచ్చారు. అదే నిజమైతే ఫైల్‌ను అంత ఆగమేఘాలపై నడపడం, కౌన్సిల్‌ సమావేశానికి ముందే జీవీఎంసీ మేయర్‌ దానికి అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత ర్యాటిఫికేషన్‌కు పెట్టడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎప్పుడో భీమిలి-భోగాపురం బీచ్‌ కారిడార్‌కు అనుమతి వస్తే.. అప్పుడు దానిని అభివృద్ధి చేస్తామని ఒకవైపు చెబుతూ.. మరోవైపు క్షేత్రస్థాయిలో అక్కడ ఏమేం చేయవచ్చో ఇప్పుడే ప్రణాళిక రూపొందించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీఎంఆర్‌డీఏ వద్ద గతంలో రెవెన్యూ నుంచి తీసుకున్న భూములే అనేకం ఉన్నాయి. వాటిని అభివృద్ధి చేసి విక్రయించడం పెద్ద ప్రహసనంగా మారింది. దాని ధరలు చూసి కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో కొత్తవలస భూముల అభివృద్ధికి సిద్ధమవడం శారదా పీఠానికి పరోక్షంగా సాయం చేయడానికేననేది సుస్పష్టం.

Updated Date - 2022-08-11T08:53:21+05:30 IST