ప్రకాశంలో వైసీపీ శ్రేణుల వీరంగం

ABN , First Publish Date - 2022-04-10T08:47:19+05:30 IST

ప్రకాశం జిల్లాలో వైసీపీ శ్రేణులు శనివారం వీరంగం సృష్టించాయి.

ప్రకాశంలో వైసీపీ శ్రేణుల వీరంగం

  • టీడీపీ ఎమ్మెల్యే డోలా ఇంటిపై దాడికి యత్నం
  • స్వామికి రక్షణగా భారీగా నిలిచిన ‘తమ్ముళ్లు’
  • ఉద్రిక్త వాతావరణం... పోలీసులు రంగప్రవేశం
  • వైసీపీ నేతలు పలువురు అరెస్టు... విడుదల
  • బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే స్వామి


ఒంగోలు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లాలో వైసీపీ శ్రేణులు శనివారం వీరంగం సృష్టించాయి. టీడీపీకి చెందిన కొండపి ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఇంటిపై దాడికి తీవ్ర ప్రయత్నం చేశాయి. వ్యూహం ప్రకారం కొండపి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకుడు వరికూటి అశోక్‌బాబు నాయకత్వంలో వందలాది మంది కార్యకర్తలు, పార్టీ శ్రేణులు స్వామిని దూషిస్తూ ఆయన ఇంటిపై దాడికి ప్రయత్నించారు. అది తెలిసి స్వామికి మద్దతుగా టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి వద్దకు చేరారు. ఉద్రిక్త వాతావరణ తలెత్తడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. స్వామి ఇంటికి బయలుదేరిన వైసీపీ శ్రేణులను మధ్యలోనే అడ్డుకున్నారు. ముఖ్య నేతలను అరెస్టు చేశారు. 


నేపథ్యం ఇదీ...

మంత్రి బాలినేని అవినీతికి పాల్పడ్డారంటూ ఎమ్మెల్యే స్వామి శుక్రవారం పలు ఆరోపణలు చేశారు. ఆదిమూలపు సురేశ్‌కు తిరిగి మంత్రి పదవి రాకుండా ఆడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని, ఇది దళిత వ్యతిరేక చర్యని ధ్వజమెత్తారు. దీనిపై వైసీపీ నాయకత్వం శుక్రవారం రాత్రి పలువురు నాయకులతో ఖండనలు ఇప్పించింది. శనివారం ఉదయం వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు టంగుటూరులో సమావేశమయ్యాయి. అక్కడనుంచి స్వామి ఇంటిపై దాడికి ర్యాలీగా బయల్దేరాయి. విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు స్వామి ఇంటి వద్దకు చేరారు. వైసీపీ శ్రేణుల ర్యాలీ నాయుడుపాలెం సమీపానికి వచ్చేసరికి సీఐ లక్ష్మణ్‌ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు రహదారి మీదనే నిరసనకు దిగాయి. దీంతో ఎస్పీ మల్లిక గర్గ్‌ ఒంగోలు నుంచి అదనపు బలగాలను తరలించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అశోక్‌బాబును, మరికొందరు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టంగుటూరు పోలీస్‌స్టే‌షన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం అశోక్‌ మాట్లాడుతూ తమకు స్వామి ఇంటిపై దాడి చేసే ఉద్దేశం లేదన్నారు. బాలినేనిపై స్వామి చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా పాదాభివందనం చేద్దామనుకున్నామని, లేనిపక్షంలో ఆయన క్షమాపణ చేప్పేవరకు ఇంటిముందే నిరసన తెలియజేయాలని నిర్ణయించామన్నారు. 


బెదిరింపులకు లొంగం: స్వామి

అధికార పార్టీ బెదిరింపులు, దాడులకు బెదిరిపోయి లొంగే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్వామి స్పష్టం చేశారు. తాను చేసిన ఆరోపణల్లో నిజం లేకపోతే బాలినేని నిరూపించుకోవాలని సవాల్‌ చేశారు. మంత్రి సురేశ్‌కు పదవి రాకుండా అడ్డుకుంటున్న విషయం నిజమో కాదో తేల్చి చెప్పాలన్నారు. అధికార పార్టీ నాయకులు తనపై చేసిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్వామి పేర్కొన్నారు. 


స్వామికి చంద్రబాబు, లోకేశ్‌ ఫోన్‌

టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌... ఎమ్మెల్యే స్వామికి ఫోన్‌చేసి ధైర్యంగా ఉండాలని సూచించారు. మంత్రిపై ఆరోపణలు చేస్తే దాడికి ప్రయత్నించటం హేయమైన చర్య అన్నారు. ప్రాణాలు తీసే కిల్లర్‌ గేంబ్లర్‌ బాలినేని... మా ఎమ్మెల్యే స్వామి జోలికొస్తే ఖబడ్దార్‌ అంటూ లోకేశ్‌ హెచ్చరించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడికి వైసీపీ శ్రేణులు యత్నించడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. కొండపి టీడీపీ శ్రేణులతో పాటు కనిగిరి, కందుకూరు మాజీ ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, శివరాం, ఒంగోలు లోక్‌సభ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, టీడీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నాగేశ్వరరావు తదితరులు ఎమ్మెల్యే స్వామి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడి పార్టీఅండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

Read more