30% చెల్లింపులే ఆలస్యం

ABN , First Publish Date - 2022-12-15T03:20:03+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు 60 శాతం వరకు ఒకట్రెండు తేదీల్లోనే జమ అవుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.

30% చెల్లింపులే ఆలస్యం

70% జీతాలు, పెన్షన్లు1,2 తేదీల్లోనే ఇస్తున్నాం!

కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి ఇస్తున్నందునే జాప్యం: సజ్జల

అమరావతి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు 60 శాతం వరకు ఒకట్రెండు తేదీల్లోనే జమ అవుతున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మిగిలిన 30 శాతం చెల్లింపులే కొంచెం ఆలస్యమవుతున్నాయన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో కలిపి ప్రతి నెలా చెల్లిస్తున్నందునే రెగ్యులర్‌ ఉద్యోగులకు నిర్ణీత తేదీల్లో జీతాలివ్వడంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. బుధవారమిక్కడ తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో రెగ్యులర్‌ ఉద్యోగులకు జీతాలు టైమ్‌కే వేసేవారని.. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేసేవారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక అందరికీ ఒకేసారి జీతాల చెల్లింపులు చేయాలని ప్రయత్నం చేస్తుండడం వల్ల ఆలస్యమవుతోందని చెప్పారు. ఇక ముందు ఆలస్యం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వోద్యోగుల ఆందోళన ప్రకటనపై మాట్లాడుతూ .. సంక్రాంతి నాటికి చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. వారు ప్రభుత్వంలో అంతర్భాగమన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే .. పారిశ్రామికవేత్తలంతా సీఎం జగన్మోహన్‌రెడ్డికి బంధువులన్నట్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడవద్దంటూ మంత్రులకు కేబినెట్‌లో సీఎం చెబితే.. ఒక్కొక్కరినీ పిలిచి చెప్పొచ్చు కదా అంటూ మంత్రుల్లో విభేదాలు సృష్టించేలా కథనాలు రాస్తున్నారని వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-12-15T03:20:04+05:30 IST