మూతపడ్డ 6 చక్కెర కర్మాగారాల ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2022-12-16T00:59:18+05:30 IST

రాష్ట్రంలో మూతబడిన ఆరు చక్కెర కర్మాగారాల్లో ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) అమలు చేయాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

 మూతపడ్డ 6 చక్కెర కర్మాగారాల  ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌

పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలి

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అమరావతి, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూతబడిన ఆరు చక్కెర కర్మాగారాల్లో ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్‌ఎస్‌) అమలు చేయాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని పేర్కొంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు కో-ఆపరేటివ్‌ షుగర్స్‌, అదే జిల్లా గాజులమండ్యంలోని వెంకటేశ్వర కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, కడప జిల్లా దౌలతాపురంలోని కడప కో-ఆపరేటివ్‌ షుగర్స్‌, నెల్లూరు జిల్లా కోవూరు కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ, గుంటూరు జిల్లా జంపనిలోని ఎన్‌వీఆర్‌ అండ్‌ ఏడీఆర్‌ కో-ఆపరేటివ్‌ షుగర్స్‌, విశాఖపట్నం జిల్లా తుమ్మపాలలో ఉన్న అనకాపల్లి వీవీ రమణ కో-ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీల పరిధిలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గినందున గత కొన్నేళ్లుగా అవి పని చేయడం లేదు. ఉద్యోగులకు వేతనాలతో పాటు రిటైర్‌మెంట్‌, డెత్‌ బెనిఫిట్స్‌, ఆప్కాబ్‌, ఇతర ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్‌గా ఉన్నందున వీఆర్‌ఎ్‌సను అమలు చేయాలని, పెండింగ్‌ వేతనాలను చెల్లించాలని రాష్ట్ర మంత్రుల బృందం సిఫార్సు చేసింది.

Updated Date - 2022-12-16T00:59:19+05:30 IST