వైసీపీకి 45-67 సీట్లే!

ABN , First Publish Date - 2022-09-19T09:16:40+05:30 IST

వైసీపీకి 45-67 సీట్లే!

వైసీపీకి 45-67 సీట్లే!

వచ్చే ఎన్నికలపై సర్వేలు చెబుతున్నది ఇదే

జనసేన బలంగా పుంజుకుంటుంది

నేతలు, శ్రేణులు సన్నద్ధంగా ఉండాలి

అమరావతిపై వైసీపీ ద్వంద్వ వైఖరి

చట్టసభలో బేషరతుగా మద్దతిచ్చారు

ఇల్లు కట్టుకున్నానని నమ్మించారు

నేడు 3 రాజధానులంటూ హడావుడి

జగన్‌పై జనసేనాని పవన్‌ ఫైర్‌


అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 45 నుంచి 67 స్థానాలకే పరిమితం కాబోతోందని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాజకీయ నిపుణుల అధ్యయనాలు, సర్వే రిపోర్టుల ప్రకారం ఆ పార్టీకి వచ్చే సీట్లు అవేనని.. జనసేన బలంగా పుంజుకుంటుందని.. పార్టీ నాయకులు, శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపిచ్చారు. జనసేన పార్టీ విభాగమైన డా. బీఆర్‌.అంబేద్కర్‌ లీగల్‌ సెల్‌ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. ‘అన్నకు, చెల్లికి వచ్చిన తగాదాలు, ఆస్తి గొడవలు చక్కబెట్టుకుంటున్నారు. 300 ఎకరాల సొంత ఆస్తులను కాపాడుకునే విషయంలో మీరెంతో జాగ్రత్తగా వ్యవహరించారు. మరి ఆంధ్ర ప్రజలకు సంబంధించిన వేల కోట్ల రూపాయలను తెలంగాణలో ఎందుకు వదిలేశారు..? కేవలం కప్పు కాఫీకి, పెసరట్టు ముక్కకి రాష్ట్ర ఆస్తులు ధారాదత్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రితో మీ భేటీల్లో ప్రజల ఆస్తులను వదిలేసి రావడం వెనుక ఇదే అసలు అంతరార్థం’ అని సీఎం జగన్‌పై మండిపడ్డారు. ఇంకా ఏమన్నారంటే..


రాజధానిపై నమ్మించి..

అమరావతిపై వైసీపీ ఆడుతున్న ద్వందవైఖరి ప్రజలు గుర్తించాలి. చట్టసభలో  బేషరతుగా అమరావతికి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. రాజధానిని క్రమంగా విస్తరించుకుంటూ పోవాలని, ఒకేసారి 35 వేల ఎకరాల్లో అభివృద్ధి అసాధ్యమని అప్పట్లో జనసేన చెప్పింది. వైసీపీ మాత్రం అమరావతికి పూర్తిస్థాయిలో మద్దతు పలికింది. ఆ పార్టీ అధినేత కూడా ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు. ప్రజలను పూర్తిస్థాయిలో నమ్మించారు. ఇప్పుడు మాత్రం మూడు రాజధానులంటూ నానా హడావుడి చేస్తున్నారు. మరి మీకు అప్పట్లోనే మూడు రాజధానులు చేయాలన్న ఆకాంక్ష ఉంటే, చట్టసభల సాక్షిగా ఎందుకు ప్రజలను మధ్య పెట్టారో సమాధానం చెప్పాలి. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం విన్నప్పుడు అసెంబ్లీలో పోరాడేందుకు మా పార్టీ ఎమ్మెల్యేలు లేరన్న విషయం బాధ పెట్టింది. ఈ ప్రభుత్వం ఆ కేసును సీబీఐకు ఇస్తామని చెప్పి.. ఇప్పటి వరకూ ఆ హామీ పూర్తి చేయలేదు. దొమ్మీలు, దోపీడీలు చేసిన వారు రాజ్యాన్ని ఏలుతుంటే.. హత్యలు, అఘాయిత్యాలు చేసే వారిని రక్షించక ఏం చేస్తారు..? ఒక మహిళ మానానికి భంగం వాటిల్లితే రాష్ట్ర హోం మంత్రి నిందితులను వెనకేసుకు వచ్చే వ్యాఖ్యలు చేస్తున్నారు. నేరం చేసిన వారు మానభంగం చేయడానికి రాలేదని.. దొంగతనం చేయడానికి వచ్చారని.. పొరపాటున మానభంగం జరిగిందని చెప్పడం.. ఈ పాలకులు ఎంత బాగా పాలిస్తున్నారో చెప్పకనే చెబుతోంది.


భారీగా నిధులు మళ్లీంపు..

వైసీపీ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి సంబంధించి రూ.450 కోట్లు, ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ నిధులు రూ.400 కోట్లు, గత ప్రభుత్వం ఎల్‌ఐసీ దగ్గర ఉన్న అభయహస్తం సొమ్ములు రూ.2 వేల కోట్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నుంచి రూ.1,100 కోట్లు, పంచాయతీలకు చెందాల్సిన నిధులను దారి మళ్లించింది. ఈ నిధులు దారి మళ్లించే అధికారం మీకు ఎవరిచ్చారు? సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా.. గడప గడపకు వస్తున్న ప్రజాప్రతినిధులను ప్రశ్నించినా కేసులు పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మిలిటెంట్‌ మైండ్‌ సెట్‌తో ముందుకెళ్లాలి. ఆయుధాలు అక్కర్లేదు.. మాటే ఆయుధం.. దానికి జనసేన లీగల్‌ విభాగం దన్నుగా నిలబడాలి. జనసైనికులకు న్యాయపరమైన అంశాల్లో సదస్సులు, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలి. వారికి న్యాయపరమైన సెక్షన్ల మీద పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తే ఎలా నిలువరించాలన్న దానిపై కచ్చితంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి.


రాష్ట్ర సమస్యలపై నిత్యపోరాటం

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ చెప్పిన మాటలు నాకు నిత్య స్ఫురణ. అధ్యయనం, పోరాటం, నిర్మాణం అనే మూడు మాటలు నాకు పరిశీలకాలు. 2003 నుంచి రాష్ట్ర రాజకీయాలను, ప్రజా సమస్యలను నిత్యం అధ్యయనం చేశాం. 2014 నుంచి రాష్ట్ర సమస్యలపై నిత్య పోరాటాలు చేశాం. వచ్చే ఎన్నికల్లో నిర్మాణ దశ నుంచి అధికారం చేపట్టే వరకూ మన ప్రయత్నం బలంగా జరగాలి. 80వ దశకంలో ఎన్టీఆర్‌ పార్టీ పెట్టి అతి తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చిన పరిస్థితులు వేరు. అప్పటి సామాజిక పరిస్థితులు భిన్నం. 2019లో ఓటమిపాలైన సమయంలో చాలా మంది పార్టీ వదిలి వెళ్లిపోతాడు.. కుంగిపోతాడు అనుకున్నారు. కానీ నేను బలమైన వృక్షాన్ని. నా మీద వాలే పక్షులు వెళ్లిపోయినా నేను బలంగా నాటుకుని నీడనిస్తాను. సెంటు భూమి లేకపోయినా ఈ దేశాన్ని అంటిపెట్టుకున్న కోట్ల మంది ప్రజల్లాగా నేను కూడా నా పార్టీని, నేలను, దేశాన్ని, సమాజాన్ని వదిలే ప్రసక్తే లేదు. నేను జీవితంలో చేసిన అతి గొప్ప పని, మంచి పని రాజకీయాల్లోకి రావడమే.  మనకోసం నడచివచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకొని, వారిని ఓటర్లుగా మార్చాలి.


పవన్‌ యాత్ర ఆలస్యం

అక్టోబరులో మొదలు కావలసిన తన యాత్ర ఆలస్యమవుతుందని పవన్‌ తెలిపారు. కాస్త ఆలస్యమైనా.. యాత్ర మాత్రం కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘అక్టోబరులో ప్రతి నియోజకవర్గ సమీక్ష సమావేశాలు ఉంటాయి. విజయవాడ పశ్చిమ నుంచి మొదలుపెడతాం. వచ్చే ఎన్నికల్లో తపన, తృష్ణ ఉన్న అభ్యర్థులను రంగంలోకి దింపుతాం. ప్రతి నియోజకవర్గంలోనూ బలాలు పెంచుకుని గెలుపే లక్ష్యంగా ఈ సారి పార్టీ ప్రణాళికను పక్కాగా రూపొందిస్తాం. బలమైన మార్పును కోరుకునే జనసేన గురించి ప్రజలు కచ్చితంగా ఒకసారి ఆలోచించి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Read more