41ఏ నోటీసు ఆధారంగా చర్యలొద్దు

ABN , First Publish Date - 2022-11-08T03:37:51+05:30 IST

టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్‌కు జారీచేసిన 41ఏ నోటీసు ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది.

41ఏ నోటీసు ఆధారంగా   చర్యలొద్దు

తీర్పు రిజర్వ్‌లో ఉంది.. తెలుసుకోండి

సీఐడీ అధికారులకు హైకోర్టు ఆదేశం

అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేశ్‌కు జారీచేసిన 41ఏ నోటీసు ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది. సీఐడీ నమోదుచేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఆ వ్యాజ్యాలపై నిర్ణయం వెల్లడయ్యేంతవరకు 41ఏ నోటీసుల ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి. రమేశ్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. ఇరిగేషన్‌ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారులు విజయ్‌, రాజేశ్‌లపై సీఐడీ అధికారులు కేసు నమోదుచేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అయ్యన్న, రాజేశ్‌లను అరెస్ట్‌ చేసి విశాఖ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ముందు హాజరుపర్చగా.. వారిని రిమాండ్‌కు ఇచ్చేందుకు నిరాకరించారు.

సెక్షన్‌ 41ఏ కింద నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని జడ్జి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న తమ ముందు హాజరుకావాలని సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను సవాల్‌ చేస్తూ వారిరువురు సోమవారం హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం వేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వీవీ సతీశ్‌ వాదనలు వినిపిస్తూ.. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ వేశామన్నారు. ఆ వ్యాజ్యాన్ని విచారించి ఇప్పటికే కోర్టు తీర్పు రిజర్వ్‌ చేసిందన్నారు. ఈ సమయంలో 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరడం సరికాదన్నారు. సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకే నోటీసులు ఇచ్చామన్నారు.

Updated Date - 2022-11-08T03:37:51+05:30 IST

Read more