పెట్రో ధరలపై కేసీఆర్ మాట్లాడరేం?
ABN , First Publish Date - 2021-10-25T08:14:57+05:30 IST
పెట్రో ధరల పెంపు వెనుక కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సిలిండర్ ధర రూ. 50 కేంద్రం పెంచితే ఆ భారం రాష్ట్ర ప్రభుత్వం..

- ఇందులో రాష్ట్రం పాత్ర ఉంది
- కేసుల వల్లే మోదీకి గులాంగిరీ
- మాకు ఎవరితో పొత్తుండదు
- ప్రజాప్రస్థానం యాత్రలో షర్మిల
మహేశ్వరం/ఇబ్రహీంపట్నం, అక్టోబరు 24: పెట్రో ధరల పెంపు వెనుక కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉందని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. గతంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో సిలిండర్ ధర రూ. 50 కేంద్రం పెంచితే ఆ భారం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వైఎస్ ప్రకటించి ఆ మేర ప్రజలపై భారం పెరగనీయలేదని పేర్కొన్నారు. కేంద్రం పెట్రో ధరలు పెంచుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెప్పి బారు బీరు తెలంగాణాగా మార్చారని, మద్యంతో వచ్చే ఆదాయమే రాష్ట్రానికి ప్రధాన వనరుగా మారిందని ఆమె చెప్పుకొచ్చారు. ఫాంహౌ్‌సలో తాగి పడుకుంటే సరిపోదని ప్రజల సమస్యలు తెలియాలంటే తమతో కలిసి పాదయాత్ర చేస్తే వాస్తవాలేమిటో తెలుస్తాయని పేర్కొన్నారు. ప్రజాప్రస్థానంలో భాగంగా ఐదవ రోజు రంగారెడ్డిజిల్లా మహేశ్వరం పరిధిలోని నాగారం నుంచి షర్మిల పాదయాత్ర మొదలైంది. మన్సాన్పల్లి చౌరస్తా, మహేశ్వరం మీదుగా 14 కిలోమీటర్లు సాగి తుమ్మలూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘తెలంగాణలో వైఎ్సఆర్టీపీకి ఎవరితో పొత్తు ఉండదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. వైఎస్ వారుసులుగా మా మీద ప్రజలకు విశ్వసనీయత ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం’ అని పేర్కొన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మద్య లోపాయికారీ ఒప్పందం ఉందని.. అవినీతి కేసుల విషయంలో ఆందోళనతోనే డిల్లీలో మోదీ ప్రభుత్వానికి కేసీఆర్ గులాం గిరి చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్నా బీజేపీ ఆయన్ను జైల్లో పెట్టడం లేదని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా పట్టబడ్డ రేవంత్‌రెడ్డిని జైలుకు పంపకుండా కేసీఆర్ కాపాడుతున్నారని, ఇది కాంగ్రెస్, టీఆర్‌ఎ్‌స మద్య ఉన్న ఒప్పందం కాదా అని ప్రశ్నించారు. పట్టపగలు అడ్డంగా దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి అని ఆయన పిలక కేసీఆర్ చేతిలో ఉందని పేర్కొన్నారు. ‘మొన్న మాకు బీజేపీతో పొత్తు ఉందని చిన్నదొర (కేటీఆర్) మాట్లాడుతున్నారు. అయ్యా చిన్న దొర కేటీఆర్ గారూ.. బీజేపీతో, కాంగ్రెస్‌తో మీకు, మీ అయ్యకు లోపాయికారి పొత్తు ఉంది. అవినీతి కేసుల నుంచి కాపాడుకునేందుకు ఢిల్లీకి వెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నది వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు.
అన్ని వర్గాలను మోసం చేసి కేసీఆర్, తన కుటుంబంలో మాత్రం ఐదు ఉద్యోగాలు కల్పించుకున్నారని విమర్శించారు. ఎంతో నమ్మకంతో ప్రజలకు సేవ చేస్తారని మహేశ్వరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డిని ప్రజలు గెలిపిస్తే తన సొంత ప్రయోజనాలకోసం అధికార టీఆర్ఎస్లో చేరారని ఆరోపించారు. ఒక డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేయని విద్యాశాఖమంత్రి ఎందుకని విమర్శించారు. వైఎస్ఆర్ టీపీని ఆశీర్వదిస్తే పేదలకు ఆరోగ్య శ్రీ ద్వారా కార్పోరేట్ వైద్యం, పక్కాఇళ్లు, ఫీజు రియంబర్స్మెంట్, నైపుణ్య శిక్షణ ఇచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
షర్మిలను కలిసిన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి
షర్మిలను ఆదివారం ఉదయం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుమారు గంటపాటు భేటీ అయ్యారు. తల్లి విజయమ్మ భోజన విరామసమయంలో మన్సాన్పల్లి వద్ద షర్మిలను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
నేడు షర్మిల పాదయాత్ర ఇలా
సోమవారం షర్మిల పాదయాత్ర మహేశ్వరం, కందుకూరు మండలాల్లో సాగనుంది. ఉదయం 9:30 నిమిషాలకు మహేశ్వరం నుంచి ప్రారంభమవుతుంది. తుమ్ములూరు, మహబత్నగర్ క్రాస్‌రోడ్డు, తుమ్మలూరు గేట్, రాచలూరు గేట్, కందుకూరు మండల పరిధిలోని బైరాగిగూడ క్రాస్‌రోడ్డు మీదుగా లేమూర్ క్రాస్ రోడ్డు మీదుగా లేమూర్కు షర్మిల చేరుకుంటారు. ఇక్కడ మాటా-ముచ్చట కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం షర్మిల అగర్మియగూడకు చేరుకుని ఇక్కడ గ్రామస్థులను కలుస్తారు. రాత్రి ఆగర్మియగూడలో బస చేస్తారు.