తెలంగాణ ప్రజల కోసం ఎంతటి పోరుకైనా సిద్ధం: వైఎస్‌ షర్మిల

ABN , First Publish Date - 2021-10-30T01:12:43+05:30 IST

సీఎం కేసీఆర్‌ అవినీతి పాలనను అంతమొందించి సంక్షేమ పాలన తీసుకురావడానికి తెలంగాణ ప్రజల కోసం ఎంతటి పోరుకైనా

తెలంగాణ ప్రజల కోసం ఎంతటి పోరుకైనా సిద్ధం: వైఎస్‌ షర్మిల

ఇబ్రహీంపట్నం: సీఎం కేసీఆర్‌ అవినీతి పాలనను అంతమొందించి సంక్షేమ పాలన తీసుకురావడానికి తెలంగాణ ప్రజల కోసం ఎంతటి పోరుకైనా తాను సిద్ధంగా ఉన్నానని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్‌ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం పదోరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచాల మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా మంచాలలో ఏర్పాటు చేసిన మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మహిళలు, రైతులు, కూలీలు, నిరుద్యోగుల సమస్యలు తెలుసుకున్నారు. కేంద్రంలో మోదీ సర్కారుతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వరి చివరి గింజ వరకు కొంటానని బీరాలు పలికిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి చేరుకుని మోదీకి వంగిదండాలు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తాజాగా ఇప్పుడు వరి సాగు చేయొద్దని హుకుం జారీ చేస్తున్నారని ఇదెక్కడి న్యాయమంటూ ఆమె ప్రశ్నించారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు ఏడాదిలో 30 రూపాయల మేర పెంచారని ఫలితంగా అన్ని వస్తువుల దరలు పెరిగి పేదప్రజలపై తీరని భారం పడిందంటూ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-30T01:12:43+05:30 IST