కంట్లో కారం కొట్టి.. నోట్లో బెల్లం పెట్టినట్లు..

ABN , First Publish Date - 2021-07-09T00:48:29+05:30 IST

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవహారం కంట్లో కారం కొట్టి, నోట్లో బెల్లం పెట్టినట్లు ఉందని వైఎస్సాఆర్ టీపీ

కంట్లో కారం కొట్టి.. నోట్లో బెల్లం పెట్టినట్లు..

హైదరాబాద్: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవహారం  కంట్లో కారం కొట్టి, నోట్లో బెల్లం పెట్టినట్లు ఉందని వైఎస్సాఆర్ టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. ఈ రోజు జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణలో ఎంతమంది ఆత్మగౌరవంతో బతుకుతున్నారన్నారు. తెలంగాణను ప్రగతిపథంలో నడిపించడమే తమ లక్ష్యమని షర్మిల పేర్కొన్నారు. " మా ఇంట్లో నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి..ఎవరు చస్తే నాకేంటి అన్నట్లు" కేసీఆర్‌ ఉన్నారని షర్మిల విమర్శించారు. ఉద్యమం కోసం మీ ఇంట్లో ఎంతమంది చనిపోయారని నాలుగు ఉద్యోగాలు ఉన్నాయని ఘాటుగా ప్రశ్నించారు.


కళ్ల ముందు ఖాళీలు కనిపిస్తున్నా భర్తీ చేయాలన్న ఆలోచన రాలేదా అని సూటిగా ప్రశ్నించారు. ఉప ఎన్నికలు వస్తే మాత్రం త్వరలో ఉద్యోగాలు అంటారని షర్మిల విమర్శించారు. తర్వాత నోటిఫికేషన్లు ఉండవు, ఉద్యోగాలు రావన్నారు.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ విషయంలో కేసీఆర్‌ ఘోరంగా విఫలమయ్యరన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఇవ్వలేదని, కేసీఆర్‌ మోసగాడని షర్మిల ఆరోపించారు. 



రైతులు కేసీఆర్‌ చెప్పిన పంటే వేయాలి, కేసీఆర్‌ చెప్పిన విత్తనాలే కొనాలా అని షర్మిల ప్రశ్నించారు. పెట్టుబడికి, రాబడికి పొంతనే లేకున్నా వ్యవసాయమే చేయాలన్నారు. అప్పులెక్కువైతే ఆత్మహత్యలు లేదా పొలాలు అమ్ముకోవాలా అని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్ల ప్రతి ఎకరాకు 30 వేల వరకు నష్టం వస్తుందన్నారు. కంట్లో కారం కొట్టి, నోట్లో బెల్లం పెట్టినట్లు కేసీఆర్‌ వైఖరి ఉందన్నారు. మీరు రైతుబంధువులు అయితే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయన్నారు.


తెలంగాణలో అప్పులేని కుటుంబం ఉందా అని షర్మిల ప్రశ్నించారు. సంపద సృష్టించడం అంటే అప్పులు చేయడం కాదన్నారు. స్వయం సమృద్ధి సాధించడమే వైఎస్సార్‌ టీపీ లక్ష్యమని షర్మిల ప్రకటించారు. వైఎస్సార్‌ అందరినీ సమానంగా ప్రేమించారన్నారు. కులాలు, మతాల మధ్య తేడాలు చూపకుండా పనిచేస్తామన్నారు. అందరి అవసరాలను తీర్చడమే తమ లక్ష్యమని షర్మిల పేర్కొన్నారు. 




Updated Date - 2021-07-09T00:48:29+05:30 IST