అయ్యోఎస్‌!

ABN , First Publish Date - 2021-08-20T08:44:26+05:30 IST

పాలనలో కీలక భూమిక పోషించే ఐఏఎ్‌సలను సక్రమంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందా? వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌ ఇవ్వకుండా వారి సేవలను నష్టపోతోందా? ఒక్కో అధికారికి రెండు మూడేసి బాధ్యతలు అప్పగిస్తూ వారిపై పని భారాన్ని..

అయ్యోఎస్‌!

రాష్ట్రంలో ఐఏఎస్‌లపై పని భారం

ఒక్కొక్కరికి రెండు మూడు బాధ్యతలు 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద అదనంగా రెవెన్యూ, 

వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, సీసీఎల్‌ఏ

పంచాయతీరాజ్‌ కార్యదర్శి సందీప్‌కు విద్య, విద్యుత్తు..

ఏ పోస్టుకూ న్యాయం చేయలేకపోతున్న అధికారులు

మరోవైపు కొందరు వెయిటింగ్‌.. 3 జిల్లాలకు కలెక్టర్లే లేరు 


కొత్త కేడర్‌ పోస్టులను మంజూరు చేయాలంటూ రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. రాష్ట్రానికి 208 ఐఏఎస్‌ పోస్టులు మంజూరయ్యాయి. ఇందులో 136 మంది ఐఏఎస్‌లు మాత్రమే ఉన్నారు. ఇంకా 72 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ ఈ పోస్టులను మంజూరు చేయాల్సి ఉన్నా ఏటా 8-10మందిని మాత్రమే కేటాయిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న మానవ వనరులను సర్కారు వినియోగించుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పాలనలో కీలక భూమిక పోషించే ఐఏఎ్‌సలను సక్రమంగా వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందా? వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌ ఇవ్వకుండా వారి సేవలను నష్టపోతోందా? ఒక్కో అధికారికి రెండు మూడేసి బాధ్యతలు అప్పగిస్తూ వారిపై పని భారాన్ని పెంచుతోందా? అంటే.. అవుననే అంటున్నాయి ఐఏఎస్‌ వర్గాలు. ఉన్నవారి సేవలను వినియోగించుకోకుండా అదనపు పోస్టులను మంజూరు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోందని ఐఏఎస్‌లు వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలెక్టర్‌ పోస్టులు పెరిగినా కొంత మందిని వెయిటింగ్‌లో పెట్టి  వారి సేవలను వాడుకోవడం లేదని అంటున్నారు. ఒక్కో అధికారికి రెండు మూడేసి బాధ్యతలు కట్టబెట్టే బదులు ఇతర అధికారులకు అప్పగించవచ్చు కదా అన్న అభిప్రాయాలున్నాయి. 2018 ఎన్నికల సందర్భంగా ఒకేసారి 50 మందికి పైగా ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం... 


ఆ తర్వాత పెద్దఎత్తున ట్రాన్స్‌ఫర్లు చేయలేదు. ఒకటి అరా బదిలీలు చేపడుతున్నా పూర్తి స్థాయిలో సర్దుబాటు చేయడం లేదు. ఫలితంగా కొంత మంది అదనపు భారాన్ని మోస్తుంటే, మరికొంత మంది వెయిటింగ్‌లో ఉండిపోతున్నారు.


పాలనకు వెన్నెముక వారే

వాస్తవానికి ఏ రాష్ట్రంలోనైనా పాలనకు వెన్నెముక ఐఏఎస్‌ అధికారులే. జీవోలు తయారు చేయాలన్నా, విధానాలను రూపొందించాలన్నా, ప్రభుత్వ పెద్దలకు అంతర్గత సలహాలు ఇవ్వాలన్నా, కింది స్థాయి సిబ్బందిపై పర్యవేక్షణ ఉంచాలన్నా వీరే కీలకం. కలెక్టర్లు సహా డైరెక్టర్లు, కమిషనర్లు, కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల పోస్టుల్లో వీరే కీలక భూమిక పోషిస్తారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తారు. ఆయా శాఖలకు కేటాయించిన నిధుల వ్యయాలను పరిశీలిస్తుంటారు. ఏటా బడ్జెట్‌ సందర్భంగా తమ శాఖకు కావాల్సిన నిధుల ప్రతిపాదనలను సిద్ధం చేస్తారు. మంత్రులు కూడా సలహాల కోసం ఐఏఎ్‌సలపైనే ఆధారపడతారు. ఇలా అన్ని బాధ్యతలను నెత్తిన వేసుకుని ‘కదిలే యంత్రాల్లా’ పని చేసే ఐఏఎ్‌సలకు  మరిన్ని ‘అదనపు బాధ్యతలు’ తోడవుతున్నాయి. దీంతో వారు ఏ పోస్టుకూ న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది.


అదనపు బాధ్యతలతో సతమతం

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎలాంటి బాదరాబందీ లేకపోతేనే ప్రభుత్వ పాలనకు, ఐఏఎస్‌లపై పర్యవేక్షణకు పూర్తి సమయాన్ని కేటాయించే వీలుంటుంది. అయితే ప్రస్తుత సీఎస్‌గా ఉన్న సోమేశ్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు రెవెన్యూ, వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  సీసీఎల్‌ఏ పోస్టు, మైనింగ్‌ శాఖ కార్యదర్శి పోస్టు కూడా ఈయన వద్దే ఉన్నాయి. సచివాలయ అధికారుల పదోన్నతుల కమిటీ, ల్యాండ్‌ పూలింగ్‌ కమిటీ ఇలా ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ ఆయన సమయాన్ని కేటాయించలేకపోతున్నారన్న అభిప్రాయాలున్నాయి. వాణిజ్య పన్నులు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టును ఇతరులకు అప్పగించవచ్చు కదా అని అభిపాయ్రాలున్నాయి. ఇక రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మకు రవాణా శాఖతో పాటు ఆర్టీసీ ఎండీ పోస్టు అదనంగా ఉన్నాయి.


ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా కొనసాగుతున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు సమాచార, పౌర సంబంధాల కమిషనర్‌ పోస్టుతో పాటు, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ పోస్టు అదనంగా ఉన్నాయి. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పరిశ్రమల శాఖను అదనంగా మోస్తున్నారు. మైనారిటీ  సంక్షేమ కార్యదర్శి అహ్మద్‌ నదీం కార్మిక శాఖ కమిషనర్‌గా కొనసాగాల్సి వస్తోంది. సీఎంవో కార్యదర్శిగా ఉన్న వి. శేషాద్రి స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా, ఇటీవల సీఎంవో కార్యదర్శిగా నియమితులైన రాహుల్‌ బొజ్జా ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రఘుందన్‌రావు వ్యవసాయ శాఖ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.


ఇలా ఒక్కొక్కరికి రెండేసి, మూడేసి బాధ్యతలు ఉండడంతో ఏ శాఖకూ న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఒక చోట ఫైళ్లు క్లియర్‌ చేస్తుంటే, మరో చోట కుప్పలా పెరిగిపోతున్నాయి. పైగా ఒక శాఖ తర్వాత మరో శాఖపై సమీక్షలు, సమావేశాలు ఉంటే  పొద్దస్తమానం ఫైళ్లు పట్టుకుని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో శాఖాపరమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సక్రమంగా పర్యవేక్షించలేకపోతున్నారన్న ఆరోపణలున్నాయి. రవాణా, రోడ్లు, భవనాల శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సునీల్‌ శర్మ... 49 వేల మంది ఉద్యోగులతో నడుస్తోన్న ఆర్టీసీని మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పర్యవేక్షించడం కష్టతరంగా మారింది. ఇంత పెద్ద సంస్థకు పూర్తి స్థాయి ఎండీ లేకపోవడంతో గాడి తప్పి... క్రమేణా నష్టాల ఊబిలోకి జారుకుంటోంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖకు ప్రత్యేకంగా కార్యదర్శి లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అసలే ఈ శాఖకు మంత్రి లేడు. ఈ శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఉంది. అయినా... ముఖ్యకార్యదర్శి లేకపోవడంతో శాఖపై పర్యవేక్షణ కొరవడుతోంది. 


సందీప్‌కుమార్‌.. తీన్‌మార్‌..

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సందీ్‌పకుమార్‌ సుల్తానియా పరిస్థితి మరీ దారుణంగా మారింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న సందీ్‌పకుమార్‌కు అత్యంత కీలకమైన రెండు అదనపు బాధ్యతలను అప్పగించారు. విద్యుత్తు శాఖ కార్యదర్శిగా, విద్యా శాఖ కార్యదర్శిగా ఈయనకు అదనపు బాధ్యతలున్నాయి. నిజానికి విద్యుత్తు, విద్యా శాఖలు చాలా ముఖ్యమైనవి. కరోనా నేపథ్యంలో పాఠశాలలను తెరవడం, హేతుబద్ధీకరణ వంటి కీలక సందర్భాల్లో పూర్తి స్థాయి అధికారి లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. మూడు శాఖల్లో ఆయన దేనికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. ఈయన నుంచి అదనపు బాధ్యతలను తప్పించి, ఇతర అధికారులకు ఇచ్చే అవకాశం ఉన్నా... ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. 


వీరంతా వెయింటింగ్‌లో

కొంత మంది ఐఏఎస్‌ అధికారులను వెయిటింగ్‌ లిస్టులో పెట్టడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. యాదాద్రి-భువనగిరి జిల్లా కలెక్టర్‌గా ఉన్న అనితా రామచంద్రన్‌ను జూన్‌లో అక్కడి నుంచి బదిలీ చేసి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. 2020లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీం, మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లును బదిలీ చేసి వెయిటింగ్‌లో పెట్టారు. ప్రస్తుతం వీరు పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి కె. శశాంక జూలై నుంచి వెయిటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం మేడ్చల్‌-మల్కాజిగిరి, భద్రాద్రి-కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలకు కలెక్టర్లు లేరు. వెయిటింగ్‌లో ఉన్నవారితోనైనా ఈ పోస్టులను భర్తీ చేయవచ్చు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనా లేదు. ఇలా ఒక్కొక్కరికి రెండు మూడేసి బాధ్యతలు అప్పగిస్తూ... వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పాలన సాగుతుండటం పట్ల విమర్శలు ఎక్కువగానే ఉన్నాయి.  

Updated Date - 2021-08-20T08:44:26+05:30 IST