పంట కొనుగోలు డిమాండ్‌తో...కేసీఆర్‌ కొత్త నాటకం

ABN , First Publish Date - 2021-11-23T08:49:54+05:30 IST

కేంద్ర ప్రభు త్వం యాసంగి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేయడం ద్వారా సీఎం కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరదీశారని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు.

పంట కొనుగోలు డిమాండ్‌తో...కేసీఆర్‌ కొత్త నాటకం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభు త్వం యాసంగి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేయడం ద్వారా సీఎం కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరదీశారని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్‌లో ఘోర పరాజయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ అంశాన్ని లేవనెత్తారని ఆయన విమర్శించారు. ‘‘ధాన్యం సేకరణ అన్నది సమస్యే కాదు... హుజూరాబాద్‌ ప్రజలు తిరస్కరించడంతో కదులుతున్న పీఠం అసలు సమస్య... పార్టీని కాపాడుకోవడం సమస్య’’ అని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘ముడి బియ్యం తీసుకోబోమని, యాసంగి పంటను కొనుగోలు చేయబోమని కేంద్రం చెప్పిందా? ఈ వానాకాలం పంటకు సంబంధిం చి ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని మీరు కేంద్రంతో ఒప్పందం చేసుకోలేదా?’’ అని కేంద్ర మంత్రి నిలదీశారు. కేసీఆర్‌ చేసిన దీక్ష రైతులపై ప్రేమతో కాదని, తన పార్టీని రక్షించుకోవడానికేనని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో సాగరహారం, మిలియన్‌ మార్చ్‌, రైల్‌ రోకోల్లో పాల్గొనేందుకు ఒక్కనాడు కూడా కేసీఆర్‌ బయటకు రాలేదని, కేంద్రంపై అబద్ధపు ప్రచారం చేసేందుకు ఇందిరా పార్కు వద్దకు వచ్చి దీక్ష చేశారని విమర్శించారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.  అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సంక్రాంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ముగ్గుల పోటీలు, పాటల పోటీలు నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. 


రైతులను ఆదుకోవాలి: డీకే అరుణ

సీఎం కేసీఆర్‌.. తన అహాన్ని తగ్గించుకొని రైతులను ఆదుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విజ్ణప్తి చేశారు. రాష్ట్ట్రంలో రైతులు వరి కుప్పలపై పడి గుండెలు పగిలి చనిపోతుంటే.. నష్ట పరిహారం ఇవ్వాలనే సోయి ఆయనకు లేదన్నారు. పక్క రాష్ట్రాల్లో మృతిచెందిన రైతులకు రూ.3లక్షల నష్ట పరిహారం ఇస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాగా.. కేసీఆర్‌, కేటీఆర్‌లు ముమ్మాటికి తెలంగాణ ద్రోహులేనని మాజీ మంత్రి డాక్టర్‌ ఏ.చంద్రశేఖర్‌ ఆరోపించారు.  

Updated Date - 2021-11-23T08:49:54+05:30 IST