ఉల్లం‘ఘనులు’
ABN , First Publish Date - 2021-12-15T05:52:22+05:30 IST
ఉల్లం‘ఘనులు’

మద్యం షాపుల ఏర్పాటులో నిబంధనలు బేఖాతర్
గుడి, బడికి సమీపంలోనే
వివచ్చలవిడిగా విక్రయాలు
ఎమ్మార్పీకి మించి ధరలు
ఊరూరా బెల్టుషాపులతో దందా
ఏటూరునాగారంలో
ఒకే కాంప్లెక్సులో మూడు దుకాణాలు
‘మామూలు’ విషయమే అంటున్న ఆబ్కారీ అధికారులు!
(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)
మద్యం వ్యాపారులు నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులను బేఖాతరు చేస్తున్నారు. విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం అక్రమ విక్రయాలు జోరుగా సాగిస్తున్నారు. జనావాసాల మధ్యనే బెల్టు షాపులు ఏర్పాటవుతున్నాయి. గుడి, బడి అనే తేడా లేదు. ఆధ్యాత్మిక ప్రదేశాలు, విద్యా సంస్థల సమీపంలోనే ఈ దందా కొనసాగుతోంది.
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మొత్తం 60 మద్యం షాపులకు ప్రభుత్వం ఇటీవల టెండర్లు నిర్వహించింది. ఈ నేపథ్యంలో మంగపేట మండలం మినహా మిగతా 19 మండలాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. మంగపేట మండలంలో గిరిజనేతరులు కోర్టును ఆశ్రయించడంతో అక్కడి రెండు మద్యం షాపులను పస్రా, మేడారంలో అదనంగా ఏర్పాటు చేశారు. ఇక డిసెంబరు 1వ తేదీ నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రావటంతో లిక్కర్ వ్యాపారులు నూతన షాపులను ప్రారంభించారు. ఈసారి మద్యం పాలసీలో కొత్తగా రిజర్వేషన్లను అమలు చేయటంతో పాటు ఆంధ్ర నుంచి వచ్చిన కొత్త వ్యాపారులు సైతం జిల్లాల్లో పలు షాపులను నడిపిస్తున్నారు. చాలా వరకు గుడ్‌విల్‌తో మద్యం షాపులు కొనుగోలు చేసిన వ్యాపారులు లాభాల కోసం వేట మొదలు పెట్టారు. ఆబ్కారీ శాఖతో లిక్కర్ వ్యాపారులు కుమ్ముక్కై నిబంధనలు యఽథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనలు జాన్తానై..
ప్రార్థన మందిరాలు, బడి, జనావాసాల మధ్య మద్యం షాపులు ఏర్పాటు చేయొద్దనే నిబంధనలను మద్యం వ్యాపారులు ఉల్లంఘిస్తున్నారు. జాతీయ రహదారికి దూరంగా దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా స్వప్రయోజనాలకే మొగ్గు చూపుతున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఒకే కాంప్లెక్స్‌లో మూడుమద్యం షాపులు ఏర్పాటు కావడం విస్మయానికి గురిచేస్తోంది. బిల్టు షాపులకు మద్యాన్ని సరఫరా చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు. 20వేలకు పైగా జనాభా ఉన్న ఏటూరునాగారంలో మూడు షాపులను ఒకే చోట ఏర్పాటు చేయడంపై ఎక్సైజ్ శాఖ మౌనం పాటించడంలో ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆదాయంపై ఉన్న ధ్యాస నిబంధనల అమలులో ఎందుకు లేదని ప్రజలు నిలదీస్తున్నారు. అలాగే వెంకటాపురం(నూగూరు) మండల కేంద్రంలో జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆందోళనలు చేపడుతున్నారు. కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు ఇబ్బందికరంగా ఉన్న ఈ మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మహిళలు రోడ్డుపై బైఠాయించినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారుల్లో చలనం రావటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఆందోళన చేసిన మహిళలపై కేసులు పెడతామంటూ అధికారులు చిందులు తొక్కుతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. అంతేకాకుండా ఈ షాపులను వరంగల్‌కు చెందిన ఓ మద్యం వ్యాపారి రూ.75 లక్షలు గుడ్‌విల్‌గా చెల్లించి సొంతం చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఆ వ్యాపారి ఎక్సైజ్ శాఖలోని ఓ ఉన్నత అధికారికి సమీప బంధువు కావడంతో నిబంధనలు బేఖాతరు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో కమర్షియల్ ప్రదేశంలో కాకుండా నివాసాల మద్య షాపులు ఏర్పాటు చేయొద్దనే నిబంధనలను ఎక్సైజ్ శాఖ అధికారులు తుంగలో తొక్కుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇదే తరహాలో రేగొండ మండలంలో ఆందోళనలు సాగుతున్నాయి. వాజేడు మండలంలోనూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు చేస్తున్నారని మందు బాబులు ఆందోళనకు దిగారు. అలాగే భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగేలో కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం షాపు సమీపంలోని చర్చి ఉంది. మద్యం షాపును మరో చోటికి తరలించాలని ఆందోళనకు దిగినా అధికారులు, నిర్వాహకులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. పలిమెల మండల కేంద్రంలో బడికి సమీపంలో మద్యం షాపు ఏర్పాటు చేశారని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాళేశ్వరంలో హనుమాన్ గుడికి సమీప దారిలోనే అమ్మకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎండోన్మెంట్ పరిధిలో లేని ఆలయాలకు ఈ నిబంధనలు వర్తించవనే సాకుతో ఆబ్కారీ శాఖ ఎడాపెడా అనుమతులు ఇస్తూ మద్యం అమ్మకాలను ప్రోత్స హిస్తోందని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.
విచ్చలవిడిగా విక్రయాలు
కొత్త మద్యం వ్యాపారులు బెల్టు షాపులకు భారీగా మద్యం తరలిస్తున్నారు. ఊరూరా ఇలాంటి దుకాణాలు తెరచి అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఆటోల ద్వారా కూరగాయాలు విక్రయించినట్లుగా మద్యం సీసాలను బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారు. ప్రతి ఊరిలో రెండు నుంచి 15 వరకు బెల్టు షాపులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మద్యం దందా జోరుగా సాగుతోంది. ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ.30 వరకు ఆయా మద్యం బ్రాండ్లనుబట్టి అమ్మకాలు సాగిస్తున్నారు. బీరుపై ఏకంగా రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. వాజేడు, ఏటూరునాగారంలో మద్యం షాపుల్లోనే ఎమ్మార్పీ కంటే అధికంగా మద్యం అమ్మకాలు చేస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోనూ ఓ షాపులో అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేంద్రంతో పాటు లక్ష్మిదేవిపేటలో ఉన్న మద్యం షాపుల్లో అధిక ధరల దందే సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లిక్కర్ వ్యాపారులు ఇచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి కొంతమంది ఎక్సైజ్ అధికారులు ఈ వ్యాపారానికి సహకరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
మంగపేటలో మద్యం ఊట
ములుగు మంగపేట మండలంలో మద్యం షాపులకు కోర్టులో కేసుల వల్ల గత రెండు పర్యాయాలు టెండర్లు నిర్వహించలేదు. దీంతో ప్రభుత్వానికి రూ.కోటిన్నర ఆదాయానికి గండిపడింది. అయితే ఏటూరునాగారం, తాడ్వాయి మండలాలతోపాటు పక్క జిల్లాలోని జానంపేట మండలం నుంచి ఇక్కడికి మద్యం సరఫరా అవుతోంది. వైన్ షాపు లేకపోవటంతో ఏటూరునాగారం మద్యం వ్యాపారుల పంట పండుతోందనే ప్రచారం జరుగుతోంది. మంగపేట మండలంలో ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేసి, ఎమ్మార్పీ కంటే ఇక్కడి బెల్టు షాపుల్లో క్వార్టర్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు ఆయా బ్రాండ్‌లనుబట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు వ్యాపారులతో కుమ్ముక్కై మంగపేటలో బెల్టు షాపు ల్లో దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి మద్యం వ్యాపారుల జేబులు నింపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు దృష్టిసారించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి, ములుగు జిల్లాల వాసులు కోరుతున్నారు.