వచ్చే నెలలోనే గజ్వేల్‌కు వస్తా..కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తా

ABN , First Publish Date - 2021-08-25T07:52:46+05:30 IST

‘‘గజ్వేల్‌కి వస్తా.. కాంగ్రెస్‌ జెండాను ఎగురవేస్తా. ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే తొక్కుకుంటూ పోతా.

వచ్చే నెలలోనే గజ్వేల్‌కు వస్తా..కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తా

  • ఫాంహౌస్‌లో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపించాలి
  • ఉద్యమ ముసుగులో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసుకున్న కేసీఆర్‌
  • దళిత బంధు పేరుతో కొత్త డ్రామా.. దత్తత గ్రామాల్లో అభివృద్ధి ఏదీ?
  • ఫాంహౌస్‌కు వెళ్లేందుకే మూడు గ్రామాల దత్తత: రేవంత్‌రెడ్డి
  • మూడుచింతలపల్లిలో 48 గంటల దళిత, గిరిజన దీక్ష ప్రారంభం

మేడ్చల్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘గజ్వేల్‌కి వస్తా.. కాంగ్రెస్‌ జెండాను ఎగురవేస్తా. ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే తొక్కుకుంటూ పోతా. వెళ్లలేకపోతే గుండు గీయించుకుంటా’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధికార పార్టీకి సవాల్‌ విసిరారు. సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో మంగళవారం చేపట్టిన 48 గంటల దళిత,గిరిజన ఆత్మగౌరవ దీక్షలో రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌కు రేవంత్‌రెడ్డి ఎలా వస్తాడో చూస్తామన్న టీఆర్‌ఎస్‌ నేతలపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే నెలలో గజ్వేల్‌కు వస్తున్నానని, ఎవరిని పిలిపించుకుంటారో పిలిపించుకోండని సవాల్‌ చేశారు. గజ్వేల్‌ ఫాంహౌ్‌సలో బందీ అయిన తెలంగాణ తల్లిని విడిపించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి రూ.15 లక్షల కోట్లు ఖర్చు చేశామని చెబుతూనే.. కేసీఆర్‌ తన పార్టీ బలోపేతానికి, కుటుంబం దోచుకోవడానికి ఈ నిధులన్నింటినీ మళ్లించుకున్నారని ఆరోపించారు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం సబ్‌ప్లాన్‌ కింద ఉన్న నిధులను పక్కదారి పట్టించారన్నారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులు బానిసలుగా బతుకుతున్నారని, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి కుటుంబాలు అనాథలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ ముసుగులో పార్టీని బలోపేతం చేసుకున్న కేసీఆర్‌.. పేద ప్రజలను ఇంకా వంచిస్తూనే ఉన్నారని ఆరోపించారు. 


కేసీఆర్‌ ఇచ్చినవన్నీ తీసుకోండి..

హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక రావడంతో కేసీఆర్‌ మళ్లీ తాయిలాలు ప్రకటిస్తున్నారని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌ ఇచ్చినవన్నీ తీసుకోండని, కానీ.. ఓటు మాత్రం ఆలోచించి వేయాలని హుజురాబాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌కు సర్పంచ్‌ బుద్ధులు పోలేదని, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేవరకు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి ఎన్నికలయ్యాక ఇస్తానంటారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో వరదల సమయంలో ఇంటింటికి రూ.10 వేలు ఇస్తానని వాగ్దానం చేసి మరచిన కేసీఆర్‌.. రాష్ట్రంలోని 29 లక్షల దళిత, గిరిజన కుంటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వరద బాధితుల కోసమంటూ బ్యాంకుల నుంచి రూ.600 కోట్ల అప్పు తెచ్చి.. రూ.300 కోట్లను అధికార పార్టీ నాయకులే కాజేశారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇచ్చి ఓట్లు దండుకునేందుకు కొత్త డ్రామాకు కేసీఆర్‌ తెరలేపారన్నారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లో రుణాల కోసం 9.50 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌ ఉందని, ప్రస్తుతం రాష్ట్రాన్ని రూ.4.5 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని ఆరోపించారు. 


దత్తత గ్రామాల్లో అభివృద్ధి ఏదీ?

కేసీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో తన ఫాంహౌస్‌కు వెళ్లడానికే మూడుచింతలపల్లి, కేశవరం, లక్ష్మాపూర్‌ గ్రామాలను దత్తత తీసుకున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. సీఎం దత్తత గ్రామమైన లక్ష్మాపూర్‌కు రాష్ట్రంలోనే గుర్తింపు లేకుండా పోయిందని, ధరణి వెబ్‌సైట్లో అసలు ఆ గ్రామమే లేదని తెలిపారు. కేశవరంలో దళితులు, బలహీన వర్గాలు, మహిళలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందరికీ అందించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ మనుమడు చదివే స్కూల్లో దళిత, గిరిజన బిడ్డలు చదివినప్పుడే కేజీ టు పీజీ హామీ నెరవేరినట్లు అవుతుందన్నారు. దత్తత గ్రామాల్లో ఆయా గ్రామస్థులతో కలిసి తిరుగుతానని, అభివృద్ధి జరిగిందని ఎవరైనా చెబితే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ విద్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినట్లు చూపిస్తే ముక్కు నేలకు రాస్తానని అన్నారు. బుధవారం సాయంత్రం వరకు మూడుచింతలపల్లిలోనే ఉంటానని, దమ్ముంటే టీఆర్‌ఎస్‌ నాయకులు తాము చేసిన అభివృద్ధి పనులను చూపించాలని సవాల్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, మహే్‌షకుమార్‌ గౌడ్‌, అజరుద్దీన్‌, షబ్బీర్‌ అలీ, అంజన్‌కుమార్‌ యాదవ్‌, గీతారెడ్డి, సీతక్క, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. 


దళితవాడలో రేవంత్‌ బస

రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి మూడుచింతలపల్లి ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ గృహం లబ్ధిదారుడి ఇంట్లో కిరాయికి ఉంటున్న బూరుగుల యాదగిరి అనే వ్యక్తి నివాసంలో బస చేశారు. గ్రామంలోని దళితుల స్థితిగతులపై యాదగిరి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిద్రకు ఉపక్రమించారు. బుధవారం ఉదయం ఎస్సీ కాలనీవాసులతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా దీక్షా శిబిరానికి వెళ్లనున్నారు. 


టీఆర్‌ఎస్‌ శ్రేణుల నిరసన

మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన దీక్ష చేపట్టేందుకు శామీర్‌పేట నుంచి వస్తున్న సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన తెలిపాయి. నాగిశెట్టిపల్లి, జగ్గంగూడతోపాటు మరో ఐదు గ్రామాల్లో ‘రేవంత్‌రెడ్డి గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుకు ఇరువైపులా ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం దత్తత గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ప్లకార్డుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2021-08-25T07:52:46+05:30 IST