ఆడపడుచులను ఆదుకున్నాడని భర్తను హతమార్చిన భార్య
ABN , First Publish Date - 2021-09-03T05:40:36+05:30 IST
ఆడపడుచులను ఆదుకున్నాడని తన భర్తను హత్య చేసింది ఆ భార్య. అనంతరం శవాన్ని బాత్‌రూంలో పూడ్చివేసి తన భర్త కనిపించడం లేదంటూ కపట నాటకమాడింది...

- అనంతరం బాత్‌రూంలో మృతదేహం పూడ్చివేత
- చెల్లెలి భర్త సహకారంతో ఘాతుకం
- పోలీసుల అదుపులో నిందితులు
నవాబ్‌పేట, సెప్టెంబరు 1 : ఆడపడుచులను ఆదుకున్నాడని తన భర్తను హత్య చేసింది ఆ భార్య. అనంతరం శవాన్ని బాత్‌రూంలో పూడ్చివేసి తన భర్త కనిపించడం లేదంటూ కపట నాటకమాడింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలోని దర్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మొరంబావికి చెందిన చెన్నయ్య (42) రెండు నెలల క్రితం తన పేరు మీద ఉన్న వ్యవసాయ పొలాన్ని ఇతరులకు విక్రయించాడు. దాని ద్వారా వచ్చిన సొమ్ములో కొంత నగదును తోబుట్టువులకు ఇచ్చాడు. మిగతా డబ్బుతో ఇల్లు కట్టించాడు. అయితే ఆడపడుచులకు డబ్బు ఇవ్వడాన్ని ఆయన భార్య రాములమ్మ జీర్ణించుకోలేకపోయింది. భర్తపై కోపం పెంచుకుని తన చెల్లెలి భర్త రఘుతో (హన్వాడ మండలం చిన్న దర్పల్లి) కలిసి హత్య చేసింది. ఇంట్లో నూతనంగా నిర్మించిన బాత్‌రూంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టి, అనుమానం రాకుండా పైన సిమెంట్‌తో నిందితులు చదును చేశారు. ఆ తర్వాత తన భర్త చెన్నయ్య కనిపించడంలేదంటూ రాములమ్మ నాటకం మొదలుపెట్టింది. అయితే చెన్నయ్యకు సంబంధించిన ద్విచక్రవాహనం ఇంటి ముందే ఉండడం, ఆయన కనిపించపోవడంతో మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు అనుమానించారు. దీంతో మంగళవారం రాములమ్మను నిలదీశారు. దేహశద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఎస్‌ఐ శ్రీకాంత్ బుధవారం తన సిబ్బందితో గ్రామానికి చేరుకుని, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో భర్తను తానే చంపి, శవాన్ని బాత్‌రూంలో పూడ్చిపెట్టానని పోలీసుల ఎదుట రాములమ్మ ఒప్పుకొంది. మృతదేహాన్ని పూడ్చిపెట్టిన స్థలాన్ని తవ్వేందుకు సిద్ధమయ్యారు. కానీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆగిపోయింది. గురువారం మృతదేహాన్ని వెలికితీస్తామని ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.