దేవరయాంజాల్‌ భూములపై.. హక్కుదారులెవరు?

ABN , First Publish Date - 2021-05-08T07:49:19+05:30 IST

దేవరయాంజాల్‌లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి చెందిన భూములపై హక్కుదారులెవరు? ఆ భూములు తమవంటే తమవని రైతులు, దేవాదాయ శాఖ అధికారులు వాదిస్తున్నారు.

దేవరయాంజాల్‌ భూములపై.. హక్కుదారులెవరు?

  • 50 ఏళ్లకు పైగా తెగని వివాదం
  • 15 ఏళ్లుగా జోరందుకున్న నిర్మాణాలు
  • గోదాములకు కేరాఫ్‌.. ఇప్పటికే 220
  • దేవాదాయ శాఖ, రైతుల క్లెయిమ్‌లు


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): దేవరయాంజాల్‌లోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి చెందిన భూములపై హక్కుదారులెవరు? ఆ భూములు తమవంటే తమవని రైతులు, దేవాదాయ శాఖ అధికారులు వాదిస్తున్నారు. 50 ఏళ్లకుపైగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఎటూ తేలలేదు. 15 ఏళ్లుగా ఈ భూముల్లో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. 220కి పైగా గోదాములు వెలిశాయి. ఫలితంగా దేవరయాంజాల్‌ ఇప్పుడు గోదాములకు కేరాఫ్‌ అడ్ర్‌సగా మారింది. చాలా వరకు నిర్మాణాలు ప్రముఖుల బంధువుల పేరుతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ల కమిటీ ఇచ్చే నివేదికతో 50 ఏళ్లకు పైగా కొనసాగుతోన్న సమస్య కొలిక్కి వస్తుందా? వేచి చూడాలి.


ఇవీ.. భూముల చరిత్ర..!

దేవరయాంజాల్‌లోని శ్రీ సీతారామస్వామి ఆలయానికి నిజాం నవాబు 1,531.18 ఎకరాలను 1925-26లో ఇనాంగా ఇచ్చినట్లు దేవాదాయ శాఖ వద్ద రికార్డులు ఉన్నాయి. నిజాం సర్కారు అప్పట్లో సీతారామచంద్రారెడ్డి అనే వ్యక్తిని ఆలయ సంరక్షకునిగా నియమించింది. ఇలా ఇనాం ఇచ్చిన స్థలంలో సర్వే నంబర్లు 688 నుంచి 712, 716లో 431.22 ఎకరాలు, సర్వే నంబర్లు 639/బి, 664/2, 665/2, 666/1, 668 నుంచి 681 వరకు, 683/బి, 686, 687, 713 నుంచి 715 సర్వే నంబర్లలో 369.20 ఎకరాలు, సర్వే నంబర్లు 55 నుంచి 63, 212 నుంచి 218, 656, 657, 660 నుంచి 662, 717, 718, 722, 723, 730, 731, 737 సర్వే నంబర్లలో 391.33 ఎకరాలు, సర్వే నంబర్లు 513, 524లలో 9.17 ఎకరాలు, సర్వే నంబర్లు 514 నుంచి 523వరకు, 530, 737/1లలో 131.39 ఎకరాలు, సర్వే నంబర్లు 639/ఎ, 640, 641, 664/1, 665/1, 667/2, 682, 683/ఎ, 684, 685లలో 83.07 ఎకరాలు, సర్వే నంబర్‌ 658లో 7.39ఎకరాల చొప్పున రాములోరి భూములు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములన్నీ రైతుల ఆధీనంలో ఉన్నాయి. 


ఈ భూములన్నీ రాములోరివేనని దేవాదాయ శాఖ చెబుతుండగా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము కొనుగోలు చేశామని రైతులు 50 ఏళ్లుగా వాదిస్తూ వస్తున్నారు. కోర్టుల్లో కేసులు నడుస్తూనే ఉన్నాయి. 1954-55లో పట్టాభిరెడ్డి, నారాయణరెడ్డి అనే వ్యక్తులు పట్వారీలుగా కొనసాగారు. ఆ సమయంలోనే దొంగ డాక్యుమెంట్లు సృష్టించి.. వారి బంధుమిత్రులకు నోటరీ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 1925 నుంచి ఈ భూముల రికార్డులను పరిశీలించగా వివిధ సర్వే నెంబర్లలో 1425.17ఎకరాల భూమి సీతారామస్వామి దేవస్థానం పేరిట ఉంది. తర్వాత రికార్డులు మారుతూ వచ్చాయి. 1925-26లో పహాణీలో ఆలయ సంరక్షకులు సీతారామస్వామి, ముత్వెల్లి రాముడి పుల్లయ్య పేరుతో ఉంది. 1944 సెత్వార్‌లో కొన్ని చోట్ల సీతారామస్వామి, ఆర్‌.రామచంద్రయ్య, మరికొన్ని చోట్ల ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లు, పోరంబోకు కుంట అంటూ రికార్డుల్లో నమోదైంది. కొంతమేర భూమి మాత్రమే సీతారామస్వామి దేవస్థానం పేరిట ఉంది. మిగిలిన భూముల రికార్డులు మాత్రం సర్కారు, ఏరోడ్రోమ్‌, సీలింగ్‌ సరప్లస్‌ కేటగిరీలో ఉన్నాయి. ఈ భూములపై ఇప్పటి వరకు ఎవరికీ హక్కుల్లేవు. ప్రభుత్వం ఈ భూముల టైటిల్‌పై ఎటూ తేల్చలేదు. దాదాపు 800ఎకరాలు రైతుల ఆధీనంలో ఉన్నాయి.


15 ఏళ్లుగా జోరందుకున్న నిర్మాణాలు

దేవరయాంజాల్‌లోని వివాదాస్పద భూముల్లో 15 ఏళ్ల నుంచి గోదాములు, షెడ్లు నిర్మిస్తున్నారు. వేర్వేరు సర్వే నెంబర్లలో ప్రస్తుతం 220కు పైగా అక్రమ గోదాములు ఉన్నాయి. వాటిలో 50 ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. వీటికి హెచ్‌ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఒక్కో గోదాము కనీసం 2 ఎకరాల నుంచి గరిష్ఠంగా 10 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రముఖ కంపెనీలు, బహుళ జాతి సంస్థలకు ఈ గోదాములను లీజుకు ఇచ్చారు. మరికొందరు నోటరీలతో కబ్జాలో ఉన్నారు. గోదాము స్థలాలే కాకుండా స్థానిక రైతుల్లో ఒక్కొక్కరి వద్ద 2 నుంచి 20 ఎకరాల దాకా భూమి ఆధీనంలో ఉంది. కొందరు రైతులైతే.. ప్రభుత్వం నుంచి క్రమబద్దీకరించుకున్నామని చెబుతున్నారు. మరికొందరు 2 నుంచి ఐదేసి ఎకరాల్లో దాదాపు 15 ఫాంహౌ్‌సలను నిర్మించారు. ఇలా గోదాములు, ఫాంహౌ్‌సలు ఉన్నవారిలో అత్యధికులు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల బంధువులు కావడం గమనార్హం. 


ఈటల ఉదంతంతోనే..?

ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న దేవరయాంజాల్‌ భూముల వివాదంపై ప్రభుత్వం నలుగురు ఐఏఎస్ల కమిటీని ఏర్పాటు చేయడానికి కారణం మాజీ మంత్రి ఈటల రాజేంద్ర భార్య జమున పేరిట అక్కడ నిర్మాణాలు జరగడమే. మొత్తం అక్రమ నిర్మాణాల నిగ్గు తేల్చాలంటూ ప్రభుత్వం ఈ కమిటీని ఆదేశించింది. అయితే.. ప్రభుత్వంలోని మరికొందరు పెద్దలకు కూడా ఇక్కడ నిర్మాణాలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ ఈటల భార్యకు 6.22 ఎకరాల భూమి ఉంది. అందులో గోదాములు నిర్మించారు. స్థానికుల వద్ద వారు ఈ భూమిని కొన్నట్లు సమాచారం. మంత్రి మల్లారెడ్డి బావమరిది కూడా రెండున్నర ఎకరాల్లో ఫాంహౌస్‌ నిర్మించారు. ఈ భూముల్లోనే 25 ఎకరాల్లో సాయిగీతా ఆశ్రమం ఉంది. పది ఎకరాల్లో ఎస్వీఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌, శుభ గృహ పేరిట 15 ఎకరాల లేఔట్‌ ఉన్నాయి. మరో 20ఎకరాల్లో శివశివాని స్కూల్‌, కళాశాల, హాస్టల్‌ భవనం కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్‌ల కమిటీ మొత్తం భూముల నిగ్గు తేలుస్తుందా? లేక ఈటల భూములపైనే ఫోకస్‌ పెడుతుందా? వేచిచూడాల్సిందే. కమిటీ రేపోమాపో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం.


రంగంలోకి ఏసీబీ, విజిలెన్స్‌

ఆలయ భూముల ఆక్రమణలపై ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అవ్వడంలో పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని ఈ రెండు సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చినప్పటి నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నాయి. దేవాదాయ శాఖ అధికారులకు నోటీసులు ఇచ్చి, విచారణ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

Updated Date - 2021-05-08T07:49:19+05:30 IST