పొంచిఉన్న.. వైట్‌ ఫంగస్‌ ముప్పు

ABN , First Publish Date - 2021-05-21T08:25:49+05:30 IST

కరోనా కల్లోలాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో.. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు దడ పుట్టిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు కొత్తగా వైట్‌ ఫంగస్‌ కలకలం మొదలైంది. లక్షల్లో రోజువారీ కరోనా

పొంచిఉన్న.. వైట్‌ ఫంగస్‌ ముప్పు

బ్లాక్‌ ఫంగస్‌ కంటే యమా డేంజర్‌

బిహార్‌లో నాలుగు కేసుల గుర్తింపు


న్యూఢిల్లీ, మే 20: కరోనా కల్లోలాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో.. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు దడ పుట్టిస్తున్నాయి. వీటికి తోడు ఇప్పుడు కొత్తగా వైట్‌ ఫంగస్‌ కలకలం మొదలైంది. లక్షల్లో రోజువారీ కరోనా కేసులుండగా.. మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బిహార్‌లో నలుగురు వ్యక్తుల్లో వైట్‌ ఫంగస్‌ బయటపడింది. వీరిలో ఓ డాక్టర్‌ ఉండడం గమనార్హం..!


ఏమిటీ వైట్‌ ఫంగస్‌?

కరోనా నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధకత తక్కువగా ఉన్నవారు, మధుమేహులు, చికిత్సలో స్టెరాయిడ్లు వాడిన వారికి బ్లాక్‌ ఫంగస్‌ సోకుతోంది. వైట్‌ ఫంగస్‌ అలా కాదు. కరోనాతో ఏమాత్రం సంబంధం లేకుండా వ్యాప్తిచెందుతోంది. ఇది బ్లాక్‌ ఫంగస్‌ కంటే ప్రమాదకరమైనది. బిహార్‌ కేసుల్లో.. వైట్‌ పంగస్‌ సోకినవారిలో కరోనా లేదు. వారికి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగటివ్‌ రిపోర్టు వచ్చింది. కానీ, సీటీస్కాన్‌లో వైట్‌ ఫంగస్‌ ఆనవాళ్లను గుర్తించామని పట్నా మెడికల్‌ కాలేజీ మైక్రో బయాలజీ చీఫ్‌ డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.సింగ్‌ తెలిపారు. 


లక్షణాలివే..

కరోనా మాదిరిగానే.. వైట్‌ ఫంగస్‌ కూడా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుందని డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.సింగ్‌ చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ ముఖ భాగాన్ని దెబ్బతీస్తుందని, ముక్కు ద్వారా కళ్లకు, మెదడుకు ఇన్ఫెక్షన్‌ అవుతుందని.. వైట్‌ ఫంగస్‌ అలా కాదని చెప్పారు. ‘‘వైట్‌ ఫంగస్‌ ప్రధానంగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే.. ఊపిరితిత్తుల నుంచి గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, పునరుత్పత్తి అవయవాలు, నోటికి వ్యాపించే ప్రమాదముంది’’ అని వివరించారు.


ఎలా గుర్తిస్తారు?

ఎక్స్‌రే, సీటీస్కాన్‌ ద్వారా వైట్‌ ఫంగస్‌ను గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 

చికిత్స ఏమిటి?

పట్నాలోని నలుగురు బాధితులు చికిత్సతో కోలుకున్నారని డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.సింగ్‌ చెప్పారు. ‘‘వైట్‌ ఫంగస్‌ సోకిన వారికి సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. ఇందుకోసం యాంటీ-ఫంగల్‌ ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది’’ అని తెలిపారు.


ముప్పు ఎవరికి?

వైట్‌ ఫంగస్‌కు కరోనా కారణమని చెప్పలేం. బిహార్‌ కేసుల్లో కరోనా లేనివారికి కూడా వ్యాపించింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్స్‌ తీసుకుంటున్న వారు, మధుమేహ వ్యాధిగ్రస్థులు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌, మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న వారికి వైట్‌ ఫంగస్‌తో ముప్పు ఎక్కువగా ఉంటుంది. కొవిడ్‌ రోగులకు కూడా ఈ ముప్పు ఉంటుందని డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.సింగ్‌ వివరించారు. ‘‘కొవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అందించేప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. వైట్‌ ఫంగస్‌ సోకే ప్రమాదం ఉంటుంది. ఆక్సిజన్‌ తయారీలో కుళాయి నీళ్లు వాడితే.. వైట్‌ ఫంగస్‌ వచ్చే ముప్పు ఎక్కువ. ఆక్సిజన్‌ నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది కాబట్టి.. ఆ ప్రాంతంలో వైట్‌ ఫంగస్‌ తిష్టవేస్తుంది’’ అని ఆయన వెల్లడించారు.

Updated Date - 2021-05-21T08:25:49+05:30 IST