ఎక్కడి వాహనాలు అక్కడే

ABN , First Publish Date - 2021-08-25T08:11:35+05:30 IST

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. మెదక్‌ జిల్లాలోని జాతీయ రహదారి-44పై గంటల కొద్దీ వాహనాల రాకపోకలు నిలిచిపోవడం సర్వసాధారణమైపోయింది.

ఎక్కడి వాహనాలు అక్కడే

  • రామాయపల్లి ఆర్‌యూబీలోకి భారీగా వాన నీరు
  • జాతీయ రహదారి- 44పై స్తంభించిన ట్రాఫిక్‌

తూప్రాన్‌/మేడ్చల్‌, ఆగస్టు 24: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. మెదక్‌ జిల్లాలోని జాతీయ రహదారి-44పై గంటల కొద్దీ వాహనాల రాకపోకలు నిలిచిపోవడం సర్వసాధారణమైపోయింది. జిల్లాలో మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌పై నిర్మించిన అండర్‌ బ్రిడ్జి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వేలైన్‌ కోసం మనోహరాబాద్‌ మండలం రామాయపల్లి వద్ద ఎన్‌హెచ్‌-44పై అండర్‌ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని నిర్మించారు. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంతో ఈ బ్రిడ్జి కింద భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ మార్గంలో రెండు గంటలపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. వర్షపు నీటిని తొలగించే చర్యలు చేపట్టడంతో ఎట్టకేలకు రాత్రి 8 గంటలకు ఒక్కొక్క వాహనం వెళ్లిపోయింది. పూర్తిస్థాయిలో నీటి తొలగింపు సాధ్యంకాకపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. గత యేడాది జూన్‌, సెప్టెంబరు, అక్టోబరులో ఆర్‌యూబీలోకి భారీగా వాన నీరు చేరింది. అప్పట్లో 48 గంటల పాటు వాహనాలను దారి మళ్లించి పంపించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్‌లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

Updated Date - 2021-08-25T08:11:35+05:30 IST