పునర్నిర్మాణం ఎప్పుడు!?

ABN , First Publish Date - 2021-08-05T05:38:49+05:30 IST

ములుగు జిల్లాలోని రామప్ప గుడిని..

పునర్నిర్మాణం ఎప్పుడు!?
జనగామ ఇల్లా నిడిగొండలో శిధిలావస్థలో త్రికూటాలయం

ఏళ్లుగా ఆలన పాలన లేని కాకతీయుల నాటి కళాసంపద
గుళ్లను విప్పి కుప్ప పోసి చేతులెత్తేసిన అధికారులు
మట్టిలో కలిసిపోతున్న శిల్పాలు
రాష్ట్ర పురావస్తు శాఖ నిర్లక్ష్యానికి పరాకాష్ట
‘రామప్ప’ స్ఫూర్తితో పునర్వైభవం తేవాలంటున్న చరిత్ర ప్రేమికులు


హన్మకొండ, ఆంధ్రజ్యోతి: 
ములుగు జిల్లాలోని రామప్ప గుడిని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించడంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మిగిలిన కాకతీయుల చారిత్రక కట్టడాల పరిస్థితిపై సహజంగానే చర్చ మొదలైంది. రామప్ప దేవాలయం కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్నందువల్ల యునెస్కో గుర్తింపునకు నోచుకోగలిగింది. ఉమ్మడి జిల్లాలో ఈ శాఖ పరిధిలో రామప్పతోపాటు, హన్మకొండలోని వేయిస్తంభాలగుడి, వరంగల్‌లోని కాకతీయుల కోట ఉన్నాయి. మిగతావన్నీ రాష్ట్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్నాయి. ఇవి కూడా కాకతీయుల కాలం నాటివే. రామప్ప గుడి అంతటి శిల్ప కళా సౌందర్యం వీటిలో కన్పించకపోయినా దాదాపు అదే రీతిలో నిర్మించినవే. చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి.  

ఏకకూట త్రికూట, పంచకూట ఆలయాలు వీటిలో ఉన్నాయి. అయితే  ఈ ఆలయాలు ఆలనా పాలనా లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటిలో కొన్ని పూర్తిగా కూలిపోగా మరికొన్ని కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పూర్తిగా కుప్పకూలితే వాటి స్థంభాలు, శిల్పాలు ధ్వంసం అవుతాయి. ముక్కలైన వీటిని తిరిగి ఒక దగ్గరకు చేర్చి పునరుద్ధరించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. అందువల్ల పడిపోయేందుకు సిద్ధంగా గుళ్లను గుర్తించి ముందే మరమ్మతు చేయడం, వీలు కానీ పక్షంలో వాటిని ఎక్కడికక్కడ విప్పి వాటితోనే పూర్వరూపంలో పునరుద్ధరించడం ఒక్కటే మార్గం. ఈ ప్రయత్నంలో భాగంగా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోని హన్మకొండ వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం, రామప్పలోని కామేశ్వరాలయాలను ఎక్కడికక్కడ విప్పిపెట్టారు. వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పునర్నిర్మాణ పని ఒక్కటే 70శాతం వరకు జరిగింది. కామేశ్వరాలయం పనులు మొదలే కాలేదు.

రాష్ట్ర పురావస్తుశాఖ కూడా తన పరిధిలో ఉన్న కాకతీయులకాలం నాటి పూర్తిగా శిథిలమై కూలడానికి సిద్ధంగా ఉన్న కొన్ని ముఖ్యమైన ఆలయాలను గుర్తించింది. పూర్తిగా కూలిపోక ముందే వాటిని విప్పి కుప్పపోసింది. ఏళ్లు గడుస్తున్నా వాటి పునర్నిర్మాణం మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. విడిభాగాలన్నీ మట్టికొట్టుకు పోతున్నాయి. ఎండకు, వానకు తడుస్తున్నాయి. విలువైన శిల్ప ఖండాలు చోరుల పాలవుతున్నాయి. విప్పకుండా ఉంటే సందర్శకులకు చూడడానికైనా అవి కనిపించేవి. నేలమట్టం చేయడంవల్ల పూర్తిగా కనుమరుగై పోయాయి.  రామప్ప పట్ల చూపిన చొరవనే ఈ కట్టడాల పట్ల చూపాలని ప్రజలు, పర్యాటకులు, పురావస్తు ప్రేమికులు కోరుతున్నారు.  

వేయిస్తంభాల గుడి
కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలోని హన్మకొండ వేయిస్తంభాల ఆలయ కల్యాణ మండపం శిథిలావస్థకు చేరడంతో మళ్లీ యథావిధిగా కట్టాలని 2006లో విప్పారు. నిర్మాణానికి రూ.7.5కోట్లు మంజూరయ్యాయి. పురావస్తుశాఖ నిర్లక్ష్యం వల్ల పదిహేనేళ్లు గడిచినా నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పుడు అంచనా వ్యయం రెట్టింపు అయింది. వేయిస్తంభాల ఆలయ సందర్శనకు వచ్చే వేలాదిమంది పర్యాటకులు కల్యాణ మండపం చూసే అవకాశంలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.

కోటగుళ్లు
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గణపురం కోటగుళ్లు కాకతీయుల కళాక్షేత్రంగా పేరుగడించాయి. రేచర్ల రుద్రుడి తనయుడు గణపతి రెడ్డి కట్టించిన ఈ ఆలయాన్ని రెండు దశాబ్దాల కిందట విప్పి మళ్లీ కట్టాలని ప్రతిపాదించారు. పునరుద్ధరణ పనులు చేపట్టి సగంలో వదిలేశారు. దీంతో కట్టడాల పరిస్థితి ప్రస్తుతం అధ్వానంగా మారింది. పైకప్పునకు ఎలాంటి రక్షణ లేకపోవడంతో వర్షపు నీరు నేరుగా గర్భాలయంలోకి చేరుతోంది. గర్భగుడి మధ్యభాగం నుంచి వర్షపు నీరు పడుతుండడంతో పైభాగంలోని రాళ్లు కిందపడిపోతున్నాయి. ఇప్పటికే గర్భాలయం రెండు అడుగుల మేర వెనుకకు ఒరిగి పోయింది. వర్షపు నీరు ఆలయ పునాదుల్లోకి వెళ్లడం వల్ల అవి కుంగిపోతున్నాయి.

నిడిగొండ త్రికూటాలయం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో త్రికూటాలయం ఉంది. 50 స్తంభాల గుడిగా ఎంతో ప్రసిద్ధి చెందింది. గణపతి దేవుడి చెల్లెలు కుందమాంబకు ఈ స్థలం పసుపుకుంకుమ కింద ఇవ్వగా ఆమె అన్నయ్యకు కానుకగా ఆలయాన్ని నిర్మించినట్టు ప్రతీతి. ఆలయం శిథిలమైందన్న కారణంతో 25 యేళ్ల కింద పునర్నిర్మాణం మొదలు పెట్టి ఆ తర్వాత మధ్యలో వదిలేశారు. ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురికావడంతో ఈ ఆలయానికి సంబంధించిన ఆరుదైన శిల్పాలను దొంగలు ఎత్తుకుపోతున్నారు.

ఆగిన పునర్నిర్మాణ పనులు

ములుగు జిల్లా జాకారంలోని త్రికూటాలయం, ఇదే జిల్లాలోని వెంకటాపురం మండలం రామానుజపురంలో పంచకూటాలయాలను 35 ఏళ్ల కిందట పునర్నిర్మించేందుకు విప్పారు. 2017లో ఆలయానికి రూ.40లక్షల చొప్పున పునర్నిర్మాణ పనులు చేపట్టారు. నిధులు లేక పనులను సగంలోనే వదిలేశారు. అయిదు ఆలయాల సమూహమైన పంచకూటాలయంలో భారీ శివలింగం భిన్నమైంది. ఆలయ శిథిలాలు ఎక్కడికక్కడే పంట పొలాల్లో పడవేయడంతో ధ్వంసమవుతున్నాయి.

కొండపర్తి ఆలయం

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ మండలం కొండపర్తిలో సురాభాండేశ్వర స్వామి ఆలయం పక్కనే 500 స్థంభాల గుడి ఉంది. ఇదే గ్రామంలో దాదాపు ఎనిమిది కాకతీయుల కాలం నాటివి కొలువై ఉన్నాయి. వీటిలో మూడు శిథిలావస్థకు చేరుకున్నాయి.

ఏకవీర ఆలయం
కాకతీయులకు ఆరాధ్య దైవమైన ఏకవీర (ఎల్లమ్మ) దేవాలయం రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచెర్ల గ్రామంలో ఉంది. ఇది కూ లిపోయే దశకు చేరింది. కనీసం గుడికి వెళ్లేదారి కూడా లేకుండా పోయింది. ప్ర భుత్వం కొన్ని నిధులు మంజూరు చేసినా ఆల య పునర్నిర్మాణ పనులు ఎక్కడిక్కడే ఆగిపోయాయి. కాకతీయుల సైనికులు ఇక్కడే శిక్షణ తీసుకునేవారని చెబుతారు. మొత్తం రాతితో నిర్మించిన ఈ కట్టడం మరమ్మత్తులు లేక కళతప్పింది.

మరెన్నో..
జనగామ జిల్లాలో పలు పురాతన కాకతీయ కట్టడాలున్నాయి. కానీ పురావస్తు అధికారులు నిడిగొండ, స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం తాటికొండ గ్రామాల్లోని కట్టడాలను మాత్రమే గుర్తించారు. మిగతా వాటిని ప ట్టించుకోలేదు. పురావస్తుశాఖ ఆధీనంలో ఉ న్న ఖిలాషాపురం కోటగోడ ఇటీవల కురిసిన భారీ వర్షానికి కూప్పకూలిన విష యం తెలిసిందే. పాలకుర్తి మండలం చె న్నూరులోని త్రికూటాలయంతో పాటు గూడూరులోని రాజు విరియాల వంశస్తు డు మల్లన 1124లో నిర్మించిన మల్లేశ్వరాలయం పరిస్థితి కూడా దయనీయ స్థితిలో ఉంది. లింగాల ఘణపురం మండలంలో కాకతీయుల ఆడబిడ్డ కుందమాంబ పేరట కుందవరం, చీటూరులో త్రికూటాలయం, వనపర్తిలో శివాలయం, రెండు పురాతన శాసనాలు కూడా ఆలనాపాలన లేకుండా ఉన్నాయి. బచ్చన్నపేట మండలం కొన్నెలో శివాలయం, కొడవటూరులో వినాయకుడి ఆలయం, మాధవపురం దేవుడి గుట్టతండాలోని త్రికూటాలయం శిథిలావస్థకు చేరింది. చెన్నూరులోని కట్టడం కూలేందుకు సిద్ధంగా ఉంది. శివలింగం, నంది విగ్రహం శిథిలమయ్యాయి. ఆలయం పూర్తిగా ధ్వంసమైంది. వావిలాలలోని ఆలయం కూడా కూలిపోయే దశలో ఉంది. బచ్చన్నపేట, లింగాల ఘనపురం మండలాల్లోని కట్టడాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి.
















Updated Date - 2021-08-05T05:38:49+05:30 IST