లంచానికి వాట్సాప్‌ గ్రూప్‌!

ABN , First Publish Date - 2021-08-10T07:56:37+05:30 IST

ఎరువులు, పురుగు మందుల డీలర్లతో ఏకంగా వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి, లంచం ఇవ్వాలని వేధిస్తున్న వ్యవసాయాధికారి... ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. భద్రాద్రి

లంచానికి వాట్సాప్‌ గ్రూప్‌!

వ్యవసాయాధికారి బరితెగింపు

రూ.90వేలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ఏవో


చండ్రుగొండ, ఆగస్టు 9: ఎరువులు, పురుగు మందుల డీలర్లతో ఏకంగా వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి, లంచం ఇవ్వాలని వేధిస్తున్న వ్యవసాయాధికారి... ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. భద్రాద్రి జిల్లా చండ్రుగొండలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నార్లపాటి మహేశ్‌ సుమారు ఏడేళ్లుగా చండ్రుగొండ వ్యవసాయాధికారి(ఏవో)గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని ఎరువుల డీలర్లతో ఓ వాట్సప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసిన ఏవో.. ఒక్కొక్క షాపు యజమాని రూ.15వేలు లంచం ఇవ్వాలని మెసేజ్‌ పెట్టారు. గతంలోనూ ఇలాగే వేధింపులకు గురి చేయడం, తాజాగా మరోసారి ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో గత నెల 30న ఆరుగురు డీలర్లు ఎర్రం సీతారాములు, గోదా సత్యం, నన్నక వెంకటరావు, ముకేష్‌, చేవుల చంద్రరావు, మచ్చా కుమార్‌.. ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు పథకం ప్రకారం సోమవారం చండ్రుగొండ రైతువేదిక భవనంలో ఉన్న ఏవోకు డీలర్లు రూ.90వేలు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదిలాఉండగా, తన బంధువుల పేరుతో ఎరువుల దుకాణం లైసెన్సు పొందిన సదరు ఏవో.. అది ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నదని చెబుతూ రైతులను మోసగించినట్లు తెలిసింది.

Updated Date - 2021-08-10T07:56:37+05:30 IST