తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఏమిటి?
ABN , First Publish Date - 2021-02-17T08:36:55+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కె. చంద్రశేఖరరావు పాత్రను వివరించండి ? 1969 నాటి తెలంగాణ ఉద్యమం బలహీనపడడానికి కారణాలను చర్చించండి? ఎన్నికల రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయానికి గల కారణాలను మదింపు చేయండి..
- ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయానికి కారణాలేమి?
- కేయూ ఎంఏ పొలిటికల్ సైన్స్ పరీక్షలో ప్రశ్నలివి
- సిలబస్‌తో సంబంధం లేని ప్రశ్నాపత్రం
- ఆశ్చర్యపోయిన అభ్యర్థులు
హైదరాబాద్, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కె. చంద్రశేఖరరావు పాత్రను వివరించండి ? 1969 నాటి తెలంగాణ ఉద్యమం బలహీనపడడానికి కారణాలను చర్చించండి? ఎన్నికల రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయానికి గల కారణాలను మదింపు చేయండి?.. ఇవీ కాకతీయ యూనివర్సిటీ (కేయూ) ఎంఏ పొలిటికల్ సైన్స్ పేపర్‌లో ఇచ్చిన ప్రశ్నలు. వీటిని చూసి ఆశ్చర్యపోవడం అభ్యర్థుల వంతైంది. కేయూ ‘స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (ఎస్‌డీఎల్‌సీఈ)’ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మంగళవారం ఎంఏ పొలిటికల్ సైన్స్ ఫైనల్ ఇయర్ 5వ పేపర్ పరీక్షను నిర్వహించారు. అయితే... 5వ పేపర్‌కు సంబంధించి తమకు ‘గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ అనే సబ్జెక్టు ఉందని, కానీ... ప్రశ్నాపత్రంపై ‘గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ’ అనే సబ్జెక్టును ప్రింట్ చేశారని విద్యార్థులు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల అధ్యయన దృక్పథాలు, రాష్ట్ర రాజకీయ చరిత్ర, ఆంధ్రలో స్వాతంత్రోద్యమం, సాంఘిక-ఆర్థిక పరిస్థితులు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, ఆంధ్రప్రదేశ్ అవతరణ, గవర్నర్, గవర్నర్ల వ్యవస్థ-విశ్లేషణ, మంత్రిమండలి, ముఖ్యమంత్రి, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఉద్యమాలు, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు, ప్రభావ వర్గాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ-నిర్మాణం, విధులు, మారుతోన్న ధోరణులు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఇటీవలి పరిణామాలు వంటి అంశాలతో సిలబస్ ఉందని, కానీ... ప్రశ్నాపత్రంలో తెలంగాణ రాజకీయాల గురించి ప్రశ్నలు వేశారని వివరించారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర, టీఆర్‌ఎస్ విజయానికి కారణాలు, తెలంగాణలో కింది స్థాయి పాలనలో చేపట్టిన సంస్కరణలు, 1969 నాటి తెలంగాణ ఉద్యమం బలహీనపడడానికి కారణాలు తెలపాలంటూ అసంబద్ధ ప్రశ్నలు ఇచ్చారని వాపోయారు. జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ మంత్రిని సంతృప్తిపర్చడానికి ‘పల్లె ప్రగతి లక్ష్యం... గ్రామాల స్వభావం, గ్రామీణాభివృద్ధికి తోడ్పడడమే ’... చర్చించుము అంటూ మరో ప్రశ్నను ఇచ్చారని తెలిపారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్షీణించడానికి గల కారణాలను విమర్శనాత్మకంగా పరిశీలించండి? తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం బలహీనపడడానికి కారణాలను తెలపండి? అంటూ ప్రశ్నలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, గతంలో 3 గంటల వ్యవధి ఉండేదని, కానీ... ఇప్పుడు వ్యవధిని 2 గంటలకు తగ్గించినా... అవే 10 ప్రశ్నల్లో ఐదింటిని రాయాలంటూ పేర్కొన్నారని వివరించారు. దీంతో సమయం సరిపోక పరీక్షలను సరిగా రాయలేకపోయామని విద్యార్థులు తెలిపారు.