ఎమ్మెల్సీ కవితకు కీలక పదవి.. కేసీఆర్ రంగం సిద్ధం!?

ABN , First Publish Date - 2021-02-05T18:25:52+05:30 IST

కవితకు కీలక పదవి ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారా?

ఎమ్మెల్సీ కవితకు కీలక పదవి.. కేసీఆర్ రంగం సిద్ధం!?

తన కూతురు కవితకు కీలక పదవి ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారా? అందుకే ఆమె బిజీ పర్యటనలతో యాక్టివ్ అవుతున్నారా?  దూరమైన సంఘాలను దగ్గరకు తీసుకునే టాస్క్‌ను కవితకు అప్పగించారా? ఆర్టీసీ సంఘం టీఎంయూ సింగరేణి కార్మిక యూనియన్ టీబీజీకేఎస్‌ను పటిష్టం చేసేందుకు కసరత్తు చేస్తున్నారా? ఆయా సంఘాలకు గౌరవాధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఎమ్మెల్సీ కవిత రెడీ అయ్యారా? ఇంతకీ ఆమె యాక్టీవ్ పాలిటిక్స్‌పై టీఆర్ఎస్‌లో ఎలాంటి చర్చ జరుగుతోంది? వాచ్ దిస్ ఇంట్రస్టింగ్ స్టోరీ.


కేసీఆర్ స్కెచ్!?

వారసుడిగా కేటీఆర్‌కు పట్టాభిషేకంతోపాటు కూతురు కవితకు ప్రాధాన్యత పదవి ఇచ్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రిపేర్ అవుతున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా జరుగుతోంది. ఇటీవల కవిత విస్తృతస్థాయి పర్యటనలు, కార్యకలాపాలతో ఆ ప్రచారం మరింత బలంగా వినిపిస్తోంది. ముందుగా కూతురిని యాక్టివ్ చేసి ఆ తర్వాత కీలక పదవులు అప్పగించేందుకు కేసీఆర్ స్కెచ్ గీశారనే గుసగుసలు గుప్పుమంటున్నాయి. వరుస పరాభవాల నేపథ్యంలో దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకునే పనిలో టీఆర్ఎస్ పడింది. అందుకోసం ఇప్పటికే కేసీఆర్ వరాల మూటలు విప్పుతున్నారు. గుర్రుగా ఉన్నవారిని మచ్చిక చేసుకునే పని ప్రారంభించారు. కేటీఆర్ ఓ వైపు అన్నీ తానై వ్యవహరిస్తుండగా.. మరోవైపు తన కూతురు కవిత సేవలను కూడా వినియోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆమెకు కూడా కొన్ని టాస్క్‌లు అప్పగించినట్లు అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.


ఊహాగానాలు ఇవీ..!

నిజానికి కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అందుకోసం క్యాబినెట్‌ని రీషెఫుల్ చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారనే వాదన కూడా వినిపిస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుత క్యాబినెట్‌లోని నలుగురు మంత్రులకు ఉద్వాసన పలుకుతారనే ప్రచారం జోరందుకుంది. అయితే అదే సమయంలో మరో చర్చ కూడా జరుగుతోంది. కేటీఆర్‌ను సీఎం చేయాలని భావిస్తోన్న కేసీఆర్ కూతురికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ సీఎం అయితే ఆయన స్థానంలో కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వొచ్చని పార్టీలో కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈలోగా తన తండ్రి ఇచ్చిన టాస్క్‌ను కంప్లీట్ చేయడం మీద ఆమె ఫోకస్ పెట్టారనీ, అందుకే యాక్టీవ్‌గా తిరుగుతున్నారనీ విశ్లేషించుకుంటున్నారు.


ఏ బాధ్యతను అప్పగించారు!?

హరీశ్‌రావు, కవితలు తప్పుకోవడంతో అటు ఆర్టీసీ, ఇటు టీబీజీకేఎస్ సంఘాలు కొంత బలహీనపడటమే కాకుండా ఆ కార్మికులు టీఆర్ఎస్‌కు కొంత దూరమయ్యారనే చర్చ పార్టీలో ఉంది. అయితే ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఫలితాలు గులాబీ దళపతి గుండెల్లో గుబులు పుట్టించాయి. ఇక ఆ పార్టీకి తిరోగమనం ప్రారంభమైందన్నప్రచారం ఊపందుకుంది. దీంతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దూరమైన సంఘాలు, వర్గాలను చేరదీసే పనిలో పడినట్లు వినికిడి. ఆ బాధ్యతను కవితకు అప్పగించినట్లు టాక్. అందుకే కవిత మళ్లీ టీబీజీకేఎస్, టీఎంయూను బలోపేతం చేసే పని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సమ్మె తర్వాత టీఎంయూ రెండుగా విడిపోయింది. ఆ సంఘం నేతలు అశ్వత్థామరెడ్డి బీజేపీకి, థామస్‌రెడ్డి టీఆర్ఎస్‌కు అనుకూలంగా మారిపోయినట్లు పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. ఎవరికి వారే సంఘం తమదని ఓన్ చేసుకుంటున్నారు. అయితే టీఎంయూ గౌరవాధ్యక్ష బాధ్యతలు చేపట్టి థామస్‌రెడ్డి ద్వారా ఆ సంఘాన్ని బలోపేతం చేయాలని కవిత భావిస్తున్నట్లు కార్మిక వర్గాల టాక్. ఇప్పటికే పలు దఫాలుగా ఆమె వారితో చర్చలు జరిపినట్లు చర్చించుకుంటున్నారు.


గులాబీ బాస్ ఆదేశం..!

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగుల నుంచి కుల సంఘాల వరకు టీఆర్ఎస్ స్వయంగా ప్రోత్సహించింది. జేఏసీలను పెట్టించి ముందుకు నడిపించింది. వివిధ ఉద్యోగ కార్మిక సంఘాలకు ఆ పార్టీ నేతలే గౌరవాధ్యక్షులుగా ఉండి సహాయ సహకారాలు అందించారు. వాటి ద్వారా అంతిమంగా వచ్చే పొలిటికల్ బెనిఫిట్‌ను టీఆర్ఎస్ తన బుట్టలో వేసుకుంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఖరిని పూర్తిగా మార్చుకుంది. కొన్ని సంఘాల నుంచి వచ్చిన తలనొప్పులతో ఆయా సంఘాలకు గౌరవాధ్యక్ష పదవుల నుంచి టీఆర్ఎస్ నేతలు తప్పుకోవాలని గులాబీ బాస్ ఆదేశించారు. తమ ససమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీలో తమకు అనుబంధంగా ఉన్న టీఎంయూ సైతం సమ్మెకు దిగడంతో దాని గౌరవాధ్యక్షులుగా ఉన్న హరీశ్‌రావు ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు. ఇక ఆ తర్వాత జీహెచ్ఎంసీ అధికారిక సంఘం గౌరవాధ్యక్ష బాధ్యతల నుంచి కూడా హరీశ్‌రావు వైదొలిగారు. అదే సమయంలో సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలి బాధ్యతలకు కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు.


ఏ పదవి ఇస్తారో..!?

ఇక సింగరేణిలోనూ గతంలో ఎన్నికల సందర్భంగా కెంగర్ల మల్లయ్యను టీబీజీకేఎస్ నుంచి బహిష్కరించారు. ఆయనకు మొదటి నుంచి అక్కడ మంచి పట్టుంది. ఆయనను దూరం చేసుకోవడం వల్ల సింగరేణిలో కొంత నష్టపోయామన్న భావనకు టీఆర్ఎస్ వచ్చింది. అందుకే ఆయన్ను తిరిగి తీసుకురావడానికి కవిత ప్రయత్నం చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె తరుచూ సింగరేణిలోనూ పర్యటనలు చేస్తున్నారు. కార్మిక నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. త్వరలోనే తిరిగి టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష బాధ్యతలు కూడా చేపడతారని తెలుస్తోంది. ఇలా మొత్తానికి కవిత తనకిచ్చిన టాస్క్‌ను సక్సెస్ ఫుల్‌గా చేసే పనిలో పడ్డారు. యూనియన్ల సంగతి ఓకే గానీ.. ఇంతకీ కేసీఆర్ కవితకు మంత్రి పదవి ఇస్తారా? లేక పార్టీ పదవి ఇస్తారా? ఇస్తే ఎప్పుడనేది టీఆర్ఎస్‌లో వాడివేడిగా చర్చ జరుగుతోంది. మరి తన కూతురిని ఎమ్మెల్సీ చేసిన కేసీఆర్.. ఆమెకు మళ్లీ ఎలాంటి పెద్ద పదవిని అప్పగిస్తారో చూడాలి.



Updated Date - 2021-02-05T18:25:52+05:30 IST