మల్లారెడ్డి, ముత్తిరెడ్డి సంగతేంటి?

ABN , First Publish Date - 2021-05-02T08:34:23+05:30 IST

ఈటల రాజేందర్‌పై పది మంది ఫిర్యాదు చేయగానే విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్‌కు.. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై వచ్చిన కబ్జా ఆరోపణలు వినిపించలేదా అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

మల్లారెడ్డి, ముత్తిరెడ్డి సంగతేంటి?

సీఎం కేసీఆర్‌కు షర్మిల ప్రశ్న

హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): ఈటల రాజేందర్‌పై పది మంది ఫిర్యాదు చేయగానే విచారణకు ఆదేశించిన సీఎం కేసీఆర్‌కు.. మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై వచ్చిన కబ్జా ఆరోపణలు వినిపించలేదా అని వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్‌కు సలాం కొట్టి.. గులాంగిరీ చేసేవారికి ఎలాంటి ఆపద ఉండదా అని నిలదీశారు. నిజంగా కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎ్‌సలోని ఇతర ప్రతినిధులపైనా విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. అవినీతి ఎవరు చేసినా శిక్ష పడాల్సిందేనని, ఈటల అవినీతిపై విచారణనూ స్వాగతిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు.


ఇతర మంత్రుల మాటేంటి?: చాడ

ఈటల మాదిరిగానే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రముఖులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులపై కూడా ఆరోపణలు వచ్చాయని, వాటిపై హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. భూకబ్జాలు, హైదరాబాద్‌ పరిసరాల్లో భూముల ఆక్రమణలపై ఎప్పటికప్పుడు సీపీఐతో పాటు పలు ప్రజాసంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినా ఎలాంటి స్పందనలేదని విమర్శించారు. అన్యాక్రాంతమైన లక్షల ఎకరాల భూముల వ్యవహారాన్ని వెలుగులోకి తేవడానికి ఉన్నతస్థాయి కమిటీతో విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడంతో పాటు దళిత, గిరిజనులకు మూడెకరాల భూపంపిణీకి అవసరమైన భూములు లభ్యమవుతాయన్నారు.

Updated Date - 2021-05-02T08:34:23+05:30 IST