వ్యాట్‌ ఏ అబద్ధం కేసీఆర్‌!

ABN , First Publish Date - 2021-11-09T06:57:06+05:30 IST

‘‘కేంద్ర సర్కారు వైఫల్యం వల్లే పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. రాష్ట్రాల వాటా ఎగ్గొట్టాలని పన్నును సెస్‌ కిందకు మార్చి లక్షల కోట్లను కేంద్రం దండుకుంటోంది.

వ్యాట్‌ ఏ అబద్ధం కేసీఆర్‌!

  • పెట్రోల్‌, డీజిల్‌పై తెలంగాణ సర్కారు వ్యాట్‌ను పెంచలేదా?
  • మరి 2015లో పెంచుతూ జారీ చేసిన జీవోల సంగతేంటి?
  • పెట్రోలు, డీజిల్‌పై రూ.2 చొప్పున పెంచుతూ జనవరి 16న జీవో
  • 4.2% , 4.75% చొప్పున పెంచుతూ ఫిబ్రవరి 5న ఎర్రాటా జీవో
  • అమల్లో ఉన్నవి నాడు పెంచిన 35.2%, 27% వ్యాట్‌ రేట్లే


(హైదరాబాద్‌, ఆంధ్రజ్యోతి) : ‘‘కేంద్ర సర్కారు వైఫల్యం వల్లే పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. రాష్ట్రాల వాటా ఎగ్గొట్టాలని పన్నును సెస్‌ కిందకు మార్చి లక్షల కోట్లను కేంద్రం దండుకుంటోంది. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ను తెలంగాణ ప్రభుత్వం నయా పైసా కూడా పెంచలేదు. కేంద్రం పెంచితే... రాష్ట్రం ఆ ధరలను తగ్గించలేదు’’ 

..ఇది ఆదివారం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో 

మీడియాతో మాట్లాడుతూ వెల్లడించిన అంశం. 

పెట్రోలు, డీజిల్‌పై తెలంగాణ ప్రభుత్వం నయా పైసా వ్యాట్‌ను పెంచలేదంటున్నారు కేసీఆర్‌. కానీ.. ముఖ్యమంత్రి అసలు విషయాన్ని మరిచిపోయినట్టున్నారు. 2014లో ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోపే వ్యాట్‌ను పెంచిన విషయం గుర్తుకు రాలేదో.. ఆ విషయాన్ని అధికారులు ఆయనకు గుర్తుచేయలేదో.. లోగుట్టు పెరుమాళ్లకెరుక!! కానీ, 2015లో కేసీఆర్‌ సర్కారు పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను పెంచింది. ఇందుకు జీవోలే సాక్ష్యం. ‘తెలంగాణ వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌-2005’లోని షెడ్యూలు 6లో పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ రేట్లను మారుస్తూ రెవెన్యూ(కమర్షియల్‌ ట్యాకెస్‌-2) శాఖ 2015 జనవరి 16న జీవో 3ను జారీ చేసింది. అప్పుడు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బీఆర్‌ మీనా ఈ ఉత్తర్వును జారీ చేశారు. 6వ షెడ్యూల్‌లోని నాలుగో కాలంలో 2వ ఐటెమ్‌ కింద ఉన్న పెట్రోలుపై అప్పటికే ఉన్న 31శాతం వ్యాట్‌కు అదనంగా రూ.2 చొప్పున పెంచుతున్నట్లు పేర్కొన్నారు. అదే షెడ్యూలులోని నాలుగో కాలంలో 5వ నంబర్‌ ఐటెమ్‌గా ఉన్న డీజిల్‌పై అమల్లో ఉన్న 22.25శాతం వ్యాట్‌కు అదనంగా రూ.2 పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.


మళ్లీ ఫిబ్రవరి 5న.. దీనిని సవరిస్తూ ‘ఎర్రాటా(తప్పొప్పులను సరిదిద్దడం)’ జీవో (ఎంఎస్‌ నంబర్‌ 16)ను జారీ చేసింది. పాత జీవో ప్రకారం లీటరుకు రూ.2చొప్పున పెంచిన ధరలను మారుస్తూ.. పర్సంటెజీల రూపంలో వ్యాట్‌ను పెంచుతూ ఈ కొత్త జీవోను అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ జారీ చేశారు. పెట్రోలు లీటరుపై 2015 జనవరిలో పెంచిన రూ.2కు బదులుగా.. వ్యాట్‌ను 31 శాతం నుంచి 35.20 శాతానికి పెంచుతున్నట్లు కొత్త జీవోలో వివరించారు. అంటే.. లీటరు పెట్రోలుపై వ్యాట్‌ 4.2 శాతం పెరిగినట్టు. అలాగే, డీజిల్‌పై జనవరిలో పెంచిన రూ.2కు బదులుగా.. 22.25 శాతంగా ఉన్న వ్యాట్‌ను 27ుచేశారు. అంటే డీజిల్‌పై వ్యాట్‌ను 4.75 శాతం మేర పెంచినట్టు. అప్పటి నుంచి అవే రేట్లు అమలవుతూ వస్తున్నాయి.


2013లో తగ్గింపు..

2013 నాటికి.. పెట్రోల్‌పై వ్యాట్‌ దేశంలోకెల్లా అత్యధికంగా(33ు) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అమల్లో ఉంది. నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు 2013 సంవత్సరాంతంలో ఉమ్మడి ఏపీలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం 33 శాతంగా ఉన్న వ్యాట్‌ను 31 శాతానికి తగ్గించింది. కానీ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక... 2015లో పెట్రోలుపై ఉన్న 31 శాతం వ్యాట్‌ను 35.2 శాతానికి పెంచి అమలు చేస్తోంది. ఇప్పుడు అత్యధికంగా వ్యాట్‌ అమల్లో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండోది. రాజస్థాన్‌లో 36 శాతం వ్యాట్‌ ఉంది. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ రాబడుల్లో పెట్రోలు, డీజిల్‌పై వచ్చే వ్యాట్‌ రెవెన్యూనే 25 శాతం వరకు ఉంటుంది. అందుకే... వ్యాట్‌ను తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు.

Updated Date - 2021-11-09T06:57:06+05:30 IST