‘వరి’కి గిరి

ABN , First Publish Date - 2021-10-29T06:04:37+05:30 IST

‘వరి’కి గిరి

‘వరి’కి గిరి

సాగుపై సర్కారు ఆంక్షలతో అయోమయంలో రైతులు

ఉమ్మడి జిల్లాలో 4లక్షల ఎకరాల్లో వరి సాగు

ప్రత్యామ్నాయ సాగుపై అవగాహనకు సదస్సులు

పెరగనున్న వేరుశనగ, కందులు, మినుముల సాగు

విత్తనాలపై రాయితీ ఏదీ? 

వరి విత్తనాల విక్రయంపై నిషేధం

పేరుకుపోనున్న నిల్వలు.. ఆందోళనలో విత్తన కంపెనీలు


వరిసాగుపై ప్రభుత్వం దాదాపు నిషేధం విధించినంత పని చేస్తోంది. యాసంగిలో వరి సాగు చేస్తే ఒక గింజ కూడా కొనమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ప్రకటించారు. వరి విత్తనాలను విక్రయిస్తే డీలర్లు, దుకాణదారులపై ఏకంగా కేసులు పెడతామని కూడా హెచ్చరించారు. ఎప్పుడూ లేనిది కలెక్టర్లు వరిసాగు చేయవద్దని స్వయంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితి అన్నదాతలను అయోమయానికి గురి చేస్తోంది. ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. వరి తప్ప ఇతర పంటలు పండని భూముల రైతులు ఈ పరిణామానికి కలవరపడుతున్నారు. తమ పరిస్థితి ఏమిటని దిగాలు పడుతున్నారు. ఇలాంటి భూములు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1.50లక్షల ఎకరాల వరకు ఉన్నాయి. 


హనుమకొండ, అక్టోబరు 28 (ఆంరఽధజ్యోతి) : రాష్ట్రవ్యాప్తంగా వరి సాగును తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు, ఆయోమయంలో పడ్డారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలైన పప్పు దినుసులు, నూనె గింజలకు గిట్టుబాటు ధర లభిస్తుందా? అధిక మొత్తంలో ఈ పంటలే సాగైతే ఉత్పత్తి పెరిగి డిమాండ్‌ తగ్గితే పరిస్థితి ఏమిటీ? ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా వ్యాపారులు సిండికేట్‌ అయితే విధిలేని పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్మడం వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం పూరిస్తుందా? అన్న సందేహాలను రైతులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆంక్షల వల్ల యాసంగిలో ఉమ్మడి జిల్లాలో వరిసాగు 5లక్షల ఎకరాలకు తగ్గి ఆస్థానంలో ప్రత్యామ్నాయ పంటలు చోటు చేసుకోవచ్చునని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మించిన రైతు వేదికలను కేంద్రంగా చేసుకొని అవగాహన సదస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.


విత్తన నిల్వలు

వరి సాగుపై ఆంక్షల నేపథ్యంలో విత్తన నిల్వలు పేరుకుపోయేలా ఉన్నాయి. ప్రైవేటు విత్తన కంపెనీలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు తమ దగ్గర నిలువ ఉన్న వరి విత్తనాలు ఏం చేయాలనే ఆలోచనలో పడ్డాయి. యేటా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు వరి విత్తనాలు రాయితీపై పంపిణీ చేస్తోంది. ఈ నెలలో ప్రారంభమయ్యే యాసంగి సాగుకు రెండునెలల ముందు నుంచే టీఎస్‌ సీడ్స్‌ సంస్థ విత్తన వడ్లను సేకరించి శుద్ధి చేసి 25కిలోల చొప్పున సంచులు సిద్ధం చేసి ఉంచింది. ఉమ్మడి జిల్లాలో వరి ఎక్కువగా సాగయ్యే జిల్లాలో విత్తనాలను అందుబాటులో ఉంచింది. జిల్లాలో మొత్తం మూడు రకాలకు చెందిన 15 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు నిల్వ ఉన్నాయి. ఇదిలా వుండగా, వరి విత్తనాలను మాత్రమే సాగు చేసే రైతులు కూడా సందిగ్ధంలో పడ్డారు. 


పెరుగుతున్న వరి సాగు

ఉమ్మడి జిల్లాలో యాసంగిలో వరి సాగు ఎక్కువగా ఉంటుంది. సుమారు 9 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. సాగునీరు అందుబాటులోకి రావడం, మంచి వర్షాలు కురిసి బావులు, చెరువుల్లో నిండుగా నీరుండడం, నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా కావడంతో ఉమ్మడి జిల్లాలో వరి సాగు విస్తీర్ణం రెండేళ్లలో 25 నుంచి 30శాతం పెరిగింది. ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురిసి నీరు పుష్కలంగా ఉంది. సాధారణం కన్నా వరి ఎక్కువ సాగయ్యే అవకాశం ఉంది. అలాంటిది ప్రభుత్వం యాసంగిలో వరిసాగును పూర్తిగా తగ్గించాలని నిర్ణయించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  


ప్రత్యామ్నాయ పంటలు

వరిపై ప్రభుత్వంపై ఆంక్షలు విధించడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ, కందులు, మినుములు, కుసుమలు, నువ్వులు, పెసర్లు, బొబ్బెర్లు, జనుము తదితర పంటలను ఎక్కువగా వేసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న తర్వాత మొదటి నుంచి వేరు శనగ, కందులు, మినుములు ఎక్కువగా  సాగవుతాయి. యాసంగిలో ఈ పప్పు దినుసుల సాగు విస్తీర్ణం పెరగనున్నది. మరి విత్తనాల సంగతేమిటీ? ఈవిత్తనాలపై ప్రభుత్వం గతంలో రాయితీ ఇచ్చేది. గత నాలుగైదేళ్లుగా రాయితీని ఎత్తివేసింది. చేసేది లేక రైతులు మార్కెట్‌లో పూర్తిధర చెల్లించి వీటిని కొనుగోలు చేస్తున్నారు. యాసంగిలో వీటి డిమాండ్‌ పెరిగితే విత్తన వ్యాపారులు ధరను కూడా అమాంతం పెంచవచ్చు. ఎక్కువ ధర పెట్టి రైతులు కొనవలసివస్తే వారిపై ఆర్థికభారం పడక తప్పని పరిస్థితి ఏర్పడనున్నది. ఇప్పటి వరకు ఈ విత్తనాల ధరలు, రాయితీని ప్రభుత్వం ప్రకటించకపోవడంతో రాయితీ లేనట్లేనని తెలుస్తోంది. దీంతో పూర్తి ధరతో, అవకాశం దొరికితే డిమాండ్‌ను బట్టి ఎక్కువ ధరకు విక్రయించేందుకు ప్రాథమికవ్యవసాయ సహకార సంఘాలతోపాటు ప్రైవేటు వ్యాపారులు సిద్ధం అవుతున్నారు. వేరుశనగ విత్తనాలపై రాయితీ లేనందు వల్ల క్వింటాలు విత్తనం రూ.6,800 చెల్లించాలి వస్తోంది. ఈ లెక్కన విత్తనస్థాయిలోనే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రైతులపై రూ.20కోట్ల భారంపడే అవకాశం ఉంది. వరి విత్తనాలపై కిలోకు రూ.5 రాయితీ ఉంది. ఇతర విత్తనాలకు సంబంధించి రాయితీ ప్రకటిస్తేనే అన్నదాతలకు కాస్త ఊరట లభిస్తుంది.


ఐదు లక్షల ఎకరాల్లో..

ఉమ్మడి జిల్లాలో 9లక్షల ఎకరాలలో వరి సాగువుతోంది. ఇందులో సుమారు 2 లక్షల ఎకరాలు విత్తనోత్పత్తి కోసం రైతులు వరి సాగు చేస్తున్నారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌, హసన్‌పర్తి, ధర్మసాగర్‌ తదితర మండలాల్లో వరి విత్తనోత్పత్తి పెద్దఎత్తున జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో వరి తప్ప ఇతర పంటలు పండని భూములు 2లక్షల ఎకరాల వరకు ఉన్నాయి. ప్రభుత్వ ఆంక్షలు ఉన్నా ఇక్కడ రైతులు విధిగా వరి సాగు చేయాల్సిందే. మొత్తం 2లక్షల ఎకరాలు పోతే ఇక మిగిలిన 5 లక్షల ఎకరాల్లోనే వరికి బదులు ప్రత్నామ్నాయ పంటలు సాగయ్యే అవకాశాలున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రత్యామ్నా పంటలుగా వ్యవసాధికారులు సూచిస్తున్న పంటల్లో వేరు శనగవైపు రైతులు ఎక్కువగా మొగ్గుచూపే అవకాశం ఉంది. వేరుశనగ ఎకరాకు సరాసరి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం క్వింటాలు ధర రూ.5000నుంచి రూ. 5600 వరకు పలుకుతోంది. నువ్వులను కూడా ఎక్కువగా పండించవచ్చు. ఎకరాలకు ఎంతలేదన్నా రెండున్నర కింటాళ్ల దిగుబడి వస్తుంది. నువ్వులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. క్వింటాలు రూ.6వేలపైనే ధర పలుకుతోంది. మినుముల పండించేందుకు కూడా రైతులు ఎక్కువగా ఆసక్తి చూపవచ్చు. మినుములను కొనుగోలు చేయడానికి నాఫెడ్‌ సిద్ధంగా ఉంది. పెసర్లు, కందులు, జనుము, పొద్దు తిరుగుడు పూలు, సోయా తదితర పంటలను కూడా రైతులు ప్రత్యామ్నాంగా ఎంచుకోవచ్చునని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇవన్నీ స్వల్పకాలిక పంటలు. వీటికి మంచి మార్కెట్‌ కూడా ఉంటుందంటున్నారు. వరి, పత్తి, మొక్క జొన్న పంటలతో పోల్చితే బ్యాంకులు ఇచ్చే రుణాల (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌) పరిమితి కాస్త తక్కువగా ఉంటుంది. వరి స్థానంలో వేసే ఈ ప్రత్యామ్నాయ పంటల రుణ పరిమితిని పెంచాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


అవగాహన సదస్సులు : దామోదర్‌ రెడ్డి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు

ప్రభుత్వ నిర్ణయం మేరకు వరి సాగు తగ్గించి ఆ స్థానే ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను మళ్లించేందుకు రైతువేదికల ద్వారా ఆవగాహన సదస్సుల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాము. వారంపాటు అన్ని గ్రామాల్లో ఈ సదస్సులు పెద్దఎత్తున జరుగనున్నాయి. ప్రభుత్వం వరిసాగు వద్దని రెండు నెలల ముందు నుంచే చెబుతోంది. రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల సాగుకు మానసికంగా దాదాపుగా సిద్ధమయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రణాళికను సిద్ధం చేశాము. 

Updated Date - 2021-10-29T06:04:37+05:30 IST