వెల్లువెత్తుతున్న టీచర్ల అభ్యంతరాలు

ABN , First Publish Date - 2021-12-25T06:13:04+05:30 IST

వెల్లువెత్తుతున్న టీచర్ల అభ్యంతరాలు

వెల్లువెత్తుతున్న టీచర్ల అభ్యంతరాలు

 డీఈవో కార్యాలయం వద్ద పడిగాపులు  

వరంగల్‌ సిటీ, డిసెంబరు 24 :  క్యాడర్‌ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ అనేక మంది ఉపాధ్యాయులు అభ్యంతరాలను సమర్పిస్తూనే ఉన్నారు. మూడు రోజులుగా  వందల సంఖ్యలో కేటాయింపు అభ్యంతరాల దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. విభజన ప్రక్రియలో భాగంగా కేటాయింపుల్లో   అవకతవకలు జరిగాయని ఆది నుంచి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయసంఘాలు ఆరోపిస్తున్నట్లుగానే అభ్యంతరాలు వస్తున్నట్లు తెలుస్తోంది. 

కేటాయింపుల ధృవపత్రాలు,  స్పౌజ్‌ అప్లికేషన్లు, కేటాయింపుల్లో జరిగిన తప్పులపై అభ్యంతరాలను స్వీకరించే క్రమంలో డీఈవో కార్యాలయ సిబ్బంది గందరగోళానికి గురిచేస్తున్నట్లు ఉపాధ్యాయులు అరోపిస్తున్నారు. సిబ్బంది సమన్వయ లోపంతో కేటాయింపు ధృవీకరణ పత్రాలను సమర్పించేందుకు వస్తున్న ఉపాధ్యాయులు పడిగాపులు గాస్తున్నట్లు చెబుతున్నారు.   కౌంటర్లను ఏర్పాటు చేసి డీఈవో కార్యాలయంలో ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నారు. అయితే అభ్యంతరాల కోసం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కేటాయింపుల్లో తమకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి వివరించాలో అర్థంకాక సదరు ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారు.  మూడు రోజులుగా అభ్యంతరాలు వస్తున్నా అవి ఎక్కడ సరిదిద్దుతున్నారో తెలియడం లేదని వారు వాపోతున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు హనుమకొండ డీఈవో నోడల్‌ అధికారిగా ఉన్నారు. దీంతో  వందలాదిమంది ఉపాధ్యాయులు  అభ్యంతరాల సమర్పణకు ఇక్కడికే పోటెత్తుతున్నారు. అయితే అందుకు తగినట్టుగా ఏర్పాట్లు, సిబ్బంది లేకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇతర డీఈవో కార్యాలయాల నుంచి సిబ్బందిని రప్పించి విధులు కేటాయించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 



క్రిస్మస్‌ వేడుకల్లో బిషప్‌ ఉడుముల బాల, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌...

బాలయేసును  క్రిబ్‌లో వేసిన దృశ్యం


-----------

నవీన్‌ మన వారసత్వ సంపద

కేయూ తెలుగు ఆచార్యులు బన్న అయిలయ్య

హనుమకొండ కల్చరల్‌, డిసెంబరు 24: ప్రముఖ నవలా రచయిత ‘అంపశయ్య’ నవీన్‌ అశీతి (80 ఏళ్లు) పూర్తి, గ్రంథాల ఆవిష్కరణ సభ శుక్రవారం హన్మకొండలోని ఎక్సైజ్‌ కాలనీలో ఘనంగా జరిగింది. కాళోజీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు నాగిళ్ళ రామశాస్త్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కేయూ తెలుగు ఆచార్యులు బన్న అయిలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యాన్ని, సమాజాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ తన రచనల్లో సామాజిక జీవితాన్ని  అద్భుతంగా చిత్రించిన నవీన్‌.. కేవలం తన కుటుంబానికే కాకుండా సమాజానికి కూడా వారసత్వ సంపదగా నిలిచారని కొనియాడారు.  34 నవలలు, 8 కథా సంపుటాలు, ఒక ఫీచర్‌ నవల, సినిమా సమీక్షలు, 5 విమర్శన గ్రంథాలు.. ఇలా అన్ని ప్రక్రియల్లో రచనలు చేసిన నవీన్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు.  అనంతరం ప్రముఖ రచయిత నెల్లుట్ల రమాదేవి నవీన్‌ రచించిన స్నేహరాగం నవలను ఆవిష్కరించారు. కులం, మతం, వర్గం, వర్ణం లేకుండా ఉండేది స్నేహం అలాంటి స్నేహం గురించి సరికొత్తగా స్నేహరాగం నవలలో ఆయన సృజించారని రమాదేవి కొనియాడారు. ఈ సందర్భంగా మిత్ర మండలి, సహృదయ తదితర సాహితీ సంస్థలు నవీన్‌ను ఘనంగా సత్కరించాయి. 

ఈ కార్యక్రమంలో వీఆర్‌ విద్యార్థి, అంపశయ్య లిటరరీ సంస్థ కార్యదర్శి డి.స్వప్న, ఎల్‌ఎ్‌సఆర్‌ ప్రసాద్‌, వాసిరెడ్డి కృష్ణారావు, మంథిని శంకర్‌, కర్రె సదాశివ్‌, పొట్లపల్లి శ్రీనివాసరావు, అనిశెట్టి రజిత, కొండల్‌ రెడ్డి, మిమిక్రీ ఆర్టిస్టు అంజన్‌ తదితర 100 మంది సాహిత్యకారులు పాల్గొన్నారు. అనంతరం అంపశయ్య నవీన్‌ ఇంట్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ప్రముఖ రచయిత ఎల్‌ఎ్‌సఆర్‌ ప్రసాద్‌ ప్రారంభించారు.

Updated Date - 2021-12-25T06:13:04+05:30 IST