కార్పొరేటర్‌ అక్రమ నిర్మాణంపై కొరడా

ABN , First Publish Date - 2021-12-15T05:41:47+05:30 IST

కార్పొరేటర్‌ అక్రమ నిర్మాణంపై కొరడా

కార్పొరేటర్‌ అక్రమ నిర్మాణంపై కొరడా

   బ్రాహ్మణవాడలో కూల్చివేత చర్యలకు బల్దియా శ్రీకారం

  ఆలయానికి ముప్పు అంటూ అడ్డుకున్న స్థానికులు

  ప్రహరీని కూల్చి అర్ధాంతరంగా      వెనుదిరిగిన అధికారులు

  వివాదాస్పదంగా మారుతున్న చర్యలు

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), డిసెంబరు 14 : హనుమకొండ బ్రాహ్మణవాడలోని 7వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌ ఇంటి ప్రహరీని వరంగల్‌ మహానగర పాలక సంస్థ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు కూల్చివేసే చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగిందని అధికారులు వెల్లడించారు. లోకాయుక్తకు కూడా ఫిర్యాదులు చేరాయని ఈ క్రమంలో మంగళవారం కమిషనర్‌ ప్రావీణ్య ఆదేశాలతో కూల్చివేత చర్యలకు దిగినట్లు అధికారులు చెప్పారు. అధికార పార్టీ కార్పొరేటర్‌ కావడంతో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.

 సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బ్రాహ్మణవాడలో నాలుగు అంతస్తుల భవనాన్ని 7వ డివిజన్‌ కా ర్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌ నిర్మించుకున్నారు. సెట్‌బ్యాక్‌లు లేకుండా నిర్మాణం జరిగిందనేది అధికారుల వా దన. అంతే కాకుండా స్టిల్ట్‌+3 అంతస్తుల వరకే భవన నిర్మాణ అనుమతులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నా రు. కాగా, నాలుగో అంతస్తుకు అనుమతి లేదని, అంతే కాకుండా పెంట్‌ హౌజ్‌ నిర్మాణం కూడా జరిగిందం టూ అధికారులు వెల్లడించారు. 9 ఫీట్ల రహదారి మా త్రమే ఉందని, సెట్‌బ్యాక్‌ లేకుండా ప్రహరీ, బిల్డింగ్‌ ఎలివేషన్‌ అక్రమంగా జరిగాయని ఫిర్యాదులు రావడం, కమిషనర్‌ ఆదేశాలతో కూల్చివేత చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఘటన జరుగుతున్న ప్రాంతంలో కార్పొరేటర్‌ వేముల శ్రీనివాస్‌ అందుబాటులో లేరు. 

అడ్డుకున్న స్థానికులు..

ప్రహరీ కూల్చివేత చర్యలను వేముల శ్రీనివాస్‌ మద్దతుదారులు, అనుచరులు అడ్డుకున్నారు. వేముల శ్రీనివాస్‌ ఇంటి పక్కనే శ్రీలక్ష్మి దొప్ప నర్సింహాస్వామి ఆలయం ఉండడంతో ఆలయ పూజారులు  కూడా కూల్చివేత చర్యలను ప్రతిఘటించారు. కూల్చివేతల వల్ల పక్కనే ఉన్న ఆలయం ధ్వంసం అయ్యే అవకాశం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయానికి నష్టం జరిగే చర్యలను సహింబోమంటూ బల్దియా అధికారులపై మండిపడ్డారు. కూల్చివేత చర్యలు నిలిపివేయాలని పూజారులు కూడా ఆందోళనకు దిగారు. జేసీబీలను ముందుకు కదలనివ్వకుండా అడ్డుపడ్డారు. బల్దియా అధికారులతో వాగ్వాదానికి దిగారు. 

ఈ పరిణామాలతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.  పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు అధికారులపై కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  వివాదం ముదురుతున్న క్రమంలో మరిన్ని పోలీస్‌ బలగాలు మోహరించాయి. చివరకు శ్రీనివాస్‌ ఇంటి కూల్చివేతను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. విపరీతమైన రాజకీయ ఒత్తిడి కారణంగా కూల్చివేత చర్యలను వాయిదా వేసినట్టు తెలిసింది.

 

Updated Date - 2021-12-15T05:41:47+05:30 IST