వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ సుడిగాలి పర్యటన

ABN , First Publish Date - 2021-06-22T05:29:06+05:30 IST

వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ సుడిగాలి పర్యటన

వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ సుడిగాలి పర్యటన
అర్బన్‌ కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తున్న సీఎం

 సెంట్రల్‌ జైలు స్థలంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన

 అర్బన్‌, కలెక్టరేట్‌ భవన సముదాయం, హెల్త్‌ వర్సిటీ పరిపాలన భవనానికి ప్రారంభోత్సవం

 ఆచార్య జయశంకర్‌, ప్రజాకవి కాళోజీలకు ఘననివాళి

హన్మకొండ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ సోమవారం వరంగల్‌ నగరంలో సుడిగాలి పర్యటన చేపట్టి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వరంగల్‌ మెడికల్‌ హబ్‌గా మార్చడానికి పునాది రాయి వేశారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు అంజలి ఘటించారు. కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన నిలువెత్తు విగ్రహాన్ని  ఆవిష్కరించారు. 

ఇదే ప్రాంగణంలో రూ.25కోట్లతో నిర్మించిన కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ పరిపాలన భవనాన్ని ప్రారంభించారు. వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.వెయ్యి కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి భవనానికి భూమి పూజలు చేశారు. సుబేదారిలో నిర్మించిన సమీకృత  జిల్లా కలెక్టరేట్‌ భవనాన్నీ ప్రారంభించారు.  మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆర్ట్స్‌ కాలేజీకి వెళ్ళి హెలీకాప్టర్‌లో యాదాద్రికి బయలుదేరి వెళ్లారు. నెల రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రెండోసారి వరంగల్‌లో పర్యటించారు. ఈ సారి పర్యటనలో సీఎం అనేక వరాలు కురిపించారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్‌గా మార్చనున్నట్టు ప్రకటించారు. డెంటల్‌ కాలేజీ, వెటరినరీ విశ్వవిద్యాలయం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 

జయశంకర్‌కు నివాళి

సీఎం ఆర్ట్స్‌ కాలేజీ నుంచి నేరుగా హన్మకొండ బాలసముద్రంలోని జయశంకర్‌ స్మృతి వనంకు చేరుకున్నారు. అక్కడ జయశంకర్‌ విగ్రహానికి పూలు చల్లి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం సాధనలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. పార్క్‌ను పరిశీలించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్‌ సార్‌ నిర్వహించిన పాత్రను ప్రతిబింబించే ఫొటోలతో ఒక గ్యాలరీని ఏర్పాటు చేయాలని సూచించారు.  

మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి 

బాలసముద్రంలో జయశంకర్‌కు నివాళులర్పించిన తర్వాత సెంట్రల్‌ జైలు స్థలానికి చేరుకున్నారు.  సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 2గంటలకు చేరుకోగానే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మేళతాళాలు, కోలాటాలతో సాదరంగా తోడ్కొని వెళ్లారు.  25 ఎకరాల విస్తీర్ణంలో రూ.1000కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి భవనానికి సీఎం భూమి పూజలు చేశారు.  భవన నిర్మాణ స్థలంలో రెండు అడుగుల లోతు వరకు గోతి తవ్వి అందులో నవధాన్యాలతో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు 58మంది వేద పండితులు పూజలు నిర్వహించారు. భవనం నిర్మించే చోట శాస్త్రోక్తంగా భూమి శుద్ధి చేశారు.   వేదపండితులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వేయిస్తంభాల గుడి ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ పర్యవేక్షించారు.  

భూమి పూజా కార్యక్రమానికి శృంగేరి పీఠం నుంచి కూడా వేద పండితులు హాజరయ్యారు. అనంతరం కేసీఆర్‌కు ఆశీర్వచనం చేశారు. శంకుస్థాపన ప్రాంతంలో ఏర్పాటు చేసిన మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి బ్లూప్రింట్‌, డిజైన్‌, నిర్మాణానికి సంబంధించిన సమాచారంతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సీఎం వీటిని తిలకించారు. కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. వరంగల్‌ కేంద్ర కారాగారాన్ని తొలగించి మొత్తం 60 ఎకరాల్లో 33 అంతస్తులతో సకల హంగులతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. 2వేల పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో 35 సూపర్‌ స్పెషాలిటీ విభాగాలను ఏర్పాటు చేస్తారు. భవనంపై హెలీప్యాడ్‌ను సైతం ఏర్పాటు చేస్తారు.

హెల్త్‌ యూనివర్సిటీ భవనం

అనంతరం కేఎంసీ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ పరిపాలన భవనాన్ని ప్రారంభించారు.  ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. యూనివర్సిటీ పరిపాలన భవనం శిలాపలకాన్ని ఆవిష్కరించారు. రిబ్బన్‌ను కత్తిరించి యూనివర్సిటీ భవనాన్ని ప్రారంభించారు. రూ.25కోట్లతో ఐదంతస్థులతో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక భవనాన్ని నిర్మించారు. అక్కడి నుంచి మూడో అంతస్తులోని వీసీ చాంబర్‌కు చేరుకున్నారు. భద్రకాళి అమ్మవారి ఫొటోకు పూలమాలవేసి కొబ్బరి కాయకొట్టారు. వైస్‌చాన్సలర్‌ను సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం వైస్‌చాన్సలర్‌ సీఎంను శాలువా కప్పి సత్కరించారు. అక్కడి నుంచి భవనంపై అంతస్థుకు వెళ్లి అక్కడి నుంచి సెంట్రల్‌ జైలు స్థలాన్ని పరిశీలించారు. తిరిగి లిప్టు ద్వారా కిందకు చేరుకొని కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద కార్యాలయ అధికారులతో గ్రూప్‌ ఫొటో దిగారు. 

సమీకృత కలెక్టరేట్‌ సముదాయం

సుబేదారిలో నిర్మించిన సమీకృత  జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం ప్రారంభించారు.  ఇదే ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా ప్రగతిపై చర్చించారు. మరింత అభివృద్ధికి ప్రతిపాదనలను కోరారు. అనూహ్యంగా వరాలు కురిపించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాను హన్మకొండ జిల్లాగా, వరంగల్‌ రూరల్‌ జిల్లాను వరంగల్‌ జిల్లాగా పేరు మార్చుతున్నట్టు ప్రకటించారు.   

ఘనస్వాగతం

షెడ్యూల్‌ ప్రకారం సీఎం ఉదయం 11.55 గంటలకు నగరానికి రావాల్సి ఉండగా, మధ్యాహ్నం 1.10 గంటలకు చేరుకున్నారు.  సీఎం కేసీఆర్‌కు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ హెలీప్యాడ్‌ వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలను అందచేశారు. సీఎంకు స్వాగతం పలికినవారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌,  ఎంపీలు సంతోష్‌ కుమార్‌, బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, మాలోతు కవిత, ఎంఎల్‌సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నర్సిరెడ్డి, జడ్పీ చైర్మన్లు గండ్ర జ్యోతి, హర్షిని, సుదీర్‌ కుమార్‌, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్‌, డాక్టర్‌ రాజయ్య, రెడ్యా నాయక్‌, శంకర్‌ నాయక్‌, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తదితరులు ఉన్నారు. పర్యటన అనంతరం సాయంత్రం 5.30 గంటలకు యాదాద్రికి బయలుదేరి వెళ్లారు. Updated Date - 2021-06-22T05:29:06+05:30 IST