పోటెత్తిన అభిమానం

ABN , First Publish Date - 2021-07-08T07:47:20+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారితో గాంధీభవన్‌తోపాటు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. కార్యక్రమం ఊహించిన దానికంటే విజయవంతం

పోటెత్తిన అభిమానం

ర్యాలీకి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు..

రేవంత్‌రెడ్డికి అడుగడుగునా ఘనస్వాగతం


హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి కార్యకర్తలు, అభిమానులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారితో గాంధీభవన్‌తోపాటు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. కార్యక్రమం ఊహించిన దానికంటే విజయవంతం కావడంతో పార్టీ నేతలు, కార్యకర్తల్లో సంతోషం వ్యక్తమైంది. ఉదయం నుంచే జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ నివాసం వద్దకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో కోలాహలం నెలకొంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ముహూర్తం పెట్టుకున్న రేవంత్‌రెడ్డి.. తొలుత జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఫౌండర్‌ చైర్మన్‌ పి.విష్ణువర్ధన్‌రెడ్డి, అర్చకులు ఘనస్వాగతం పలికారు.


మాజీ మంత్రి జానారెడ్డి అక్కడికి వచ్చి రేవంత్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం పెద్దమ్మ గుడి వద్ద నుంచి రేవంత్‌ ర్యాలీగా బయలుదేరారు. భారీ స్వాగత ఏర్పాట్లు చేయడంతోపాటు రేవంత్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ర్యాలీలో భాగంగా నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేసి గాంధీభవన్‌కు రావాల్సి ఉండగా.. అభిమానుల కోలాహలంతో ర్యాలీ నెమ్మదిగా సాగింది.  ముహూర్తం దాటిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రేవంత్‌ మధ్యలోనే కారుదిదగి, బైక్‌పై గాంధీభవన్‌కు వెళ్లారు. ముహూర్తానికి బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాంపల్లి దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు.  


ఉత్తమ్‌ నుంచి బాధ్యతల స్వీకరణ..

గాంధీభవన్‌లోని టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్‌లో రేవంత్‌రెడ్డి.. తాజా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, మూడు కమిటీల చైర్మన్లు కూడా బాధ్యతలు స్వీకరించారు. రేవంత్‌ బాధ్యతలను స్వీకరించడంతోనే కార్యకర్తలు బాణసంచా పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. 


భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు...

భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులతో గాంధీభవన్‌ పరిసరాలు నిండిపోయాయి. ఎటు చూసినా జనసందోహమే కనిపించింది. గాంధీభవన్‌ వరకు కాంగ్రెస్‌ శ్రేణులు పార్టీ జెండాలతో కవాతు నిర్వహించారు. రేవంత్‌ బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు కొవిడ్‌ నిబంధనలు అనుసరించి ఏర్పాట్లు చేశారు. వీవీఐపీ, వీఐపీ, మీడియా పాస్‌లు ఉన్నవారినే పోలీసులు లోపలికి అనుమతించారు. ఏ ఒక్క కార్యకర్తనూ లోపలికి వదల్లేదు. అయితే వివిధ జిల్లాల నుంచి బుధవారం ఉదయానికే పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు, అభిమానులు సభ ప్రారంభం కాగానే ఒక్కసారిగా ఇనుప బ్యారికేడ్‌లను నెట్టి.. కింద పడేసి ప్రాంగణంలోకి దూసుకెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీకి, రేవంత్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేస్తూ సభను హోరెత్తించారు.  


వర్షాన్నీ లెక్క చేయక..

రేవంత్‌రెడ్డి ప్రసంగం ప్రారంభం కావడంతోనే వర్షం మొదలైంది. కార్యకర్తలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రసంగాన్ని విన్నారు. వెంట తెచ్చుకున్న ప్లకార్డులు, బ్యానర్లనే గొడుగులుగా చేసుకుని నిలబడ్డారు.  మనలను వరుణదేవుడూ ఆశీర్వదించారంటూ రేవంత్‌ అన్నారు. కార్యకర్తలను ఉత్తేజితులను చేసేలా ఆయన ప్రసంగం సాగింది. తనపై అభిమానంతో చేస్తున్న నినాదాల విషయంలో హెచ్చరికలూ జారీ చేశారు. తనపైన, ఇతర వ్యక్తులపైన వ్యక్తిగత అభిమానంతో నినాదాలు చేస్తే క్షమించేది లేదని హెచ్చరించారు. ఇక కార్యక్రమం ఆద్యంతం అందరు నాయకులనూ రేవంత్‌ కలుపుకొనిపోయారు. మొత్తంగా చాలా కాలం తర్వాత గాంధీభవన్‌ కళకళలాడింది. 


రేవంత్‌పై కేసు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా జనసమీకరణ చేయడంతోపాటుౖ ట్రాఫిక్‌కు ఆటంకం కలిగిస్తూ ర్యాలీ నిర్వహించినందుకు విపత్తు నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 


జీపులో ర్యాలీగా వచ్చిన జగ్గారెడ్డి..

నూతన పీసీసీ కమిటీ బాధ్యతల స్వీకరణకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఓపెన్‌ టాప్‌ జీపులో ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు. తన కూతురు జయారెడ్డిని వెంటబెట్టుకుని ఆయన స్వయంగా జీపు నడుపుతూ వచ్చారు. కాగా, బుధవారం జగ్గారెడ్డి పుట్టినరోజు కూడా కావడంతో గాంధీభవన్‌లో వేదికపైనే ఆయనకు రేవంత్‌ సన్మానం చేశారు. 

Updated Date - 2021-07-08T07:47:20+05:30 IST