ఆధ్యాత్మిక హంగులతో కల్యాణకట్ట

ABN , First Publish Date - 2021-11-26T08:50:02+05:30 IST

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణలో భాగంగా వైటీడీఏ సకల సదుపాయాలతో నూతన కల్యాణకట్టను నిర్మిస్తోంది.

ఆధ్యాత్మిక హంగులతో కల్యాణకట్ట

  • 2.27 ఎకరాల్లో 13.99 కోట్లతో నిర్మాణం
  • యాదాద్రి క్షేత్రంలో ముమ్మరంగా పనులు

యాదాద్రి టౌన్‌, నవంబరు 25: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణలో భాగంగా వైటీడీఏ సకల సదుపాయాలతో నూతన కల్యాణకట్టను నిర్మిస్తోంది. స్వామికి మొక్కుగా తలనీలాలను సమర్పించి పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగుతాయన్నది భక్తుల విశ్వాసం. ఆలయ విస్తరణలో భాగంగా కొండ కిందే భక్తులకు అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో కొండపైన కల్యాణకట్టను కొండకింద గండి చెరువు సమీపంలో సుమారు రూ.13.99 కోట్ల అంచనా వ్యయంతో 2.27 ఎకరాల్లో 47 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. కల్యాణకట్టలో పురుషులు, స్త్రీలు వేర్వేరుగా తలనీలాలు సమర్పించుకునేలా  రెండు హాళ్లను నిర్మించారు. ఇందులో క్షౌరశాలలు, లాకర్‌ గదులు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలకల్పన పనులు కొనసాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన అనంతరం యాదాద్రికి వచ్చే భక్తుల్లో పురుషుల క్షౌరశాలలో 360 మంది, స్త్రీల క్షౌరశాలలో 160 మంది ఒకేసారి తలనీలాలు సమర్పించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణకట్ట ముందు భాగంలో స్త్రీలు, పురుషులకు వేర్వేరుగా టికెట్‌ కౌంటర్లు, కల్యాణకట్టలో విధులు నిర్వహించే సిబ్బందికి ఆఫీస్‌ గదులను నిర్మించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు నేరుగా లక్ష్మీపుష్కరిణి వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


కల్యాణకట్ట భవనానికి ఆధ్యాత్మిక హంగులు

యాదాద్రి క్షేత్రంలో ప్రతి నిర్మాణం, కట్టడం ఆధ్యాత్మికత, ఆహ్లాదానికి ఆలవాలంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేయటంతో కల్యాణకట్ట భవనాన్ని ఆధ్యాత్మిక హంగులతో తీర్చిదిద్దేందుకు మండపం ఆకృతిలో ప్లాన్లను రూపొందించారు. కృష్ణ శిలలకు దీటుగా సిమెంట్‌లో ఆధ్యాత్మిక కళాఖండాలను తీరిదిద్దే పనిలో కళాకారులు నిమగ్నమయ్యారు. సాలాహారంలో ఆగమ శాస్త్రాన్ని తెలియజేసే దేవతా విగ్రహాలను పొందుపరుస్తున్నారు. కల్యాణకట్టకు ముందు భాగం, పిల్లర్లపై ఏనుగులు, లతలను అమర్చుతున్నారు.

Updated Date - 2021-11-26T08:50:02+05:30 IST