ఒమైక్రాన్‌పై అప్రమత్తంగా ఉన్నాం..

ABN , First Publish Date - 2021-12-08T05:53:10+05:30 IST

‘కరోనా వేరియంట్‌ ఒమైక్రాన్‌ వల్ల ఇప్పటికిప్పుడు ప్రజలకు ముప్పేమీ లేదు.. అయినప్పటికీ అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.. కొత్తగా ఏర్పడిన హనుమకొండ జిల్లా చారిత్రక ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తీసే ప్రయత్నం చేస్తున్నాం.. రైతు లు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి..’ అని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు.

ఒమైక్రాన్‌పై అప్రమత్తంగా ఉన్నాం..

హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు అలాంటి కేసులు వెలుగుచూడలేదు
ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలి
వ్యాక్సిన్‌ వేసుకోకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే..
హనుమకొండ జిల్లా చారిత్రక ప్రాశస్త్యంపై ప్రత్యేక దృష్టి సారించాం..
నగర విభజనలో ఎలాంటి గందరగోళం లేదు..
నగర మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది
ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు దృష్టి సారించాలి
హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు


ఓరుగల్లు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘కరోనా వేరియంట్‌ ఒమైక్రాన్‌ వల్ల ఇప్పటికిప్పుడు ప్రజలకు ముప్పేమీ లేదు.. అయినప్పటికీ అందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.. కొత్తగా ఏర్పడిన హనుమకొండ జిల్లా చారిత్రక ప్రాశస్త్యాన్ని వెలుగులోకి తీసే ప్రయత్నం చేస్తున్నాం.. రైతు లు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి..’ అని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. సోమవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో పలు విషయాలను వెల్లడించారు.

ప్రశ్న: మరోసారి కొవిడ్‌ భయం అంతటా వ్యాపిస్తోంది. సమాజానికి ఒమైక్రాన్‌ ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ వైద్య పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి.. జిల్లాలో ఒమైక్రాన్‌ ముప్పు నుంచి కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు...?
జవాబు: నిజమే.. మరోసారి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. జిల్లా యంత్రాంగం సైతం ముందస్తు చర్యలు చేపడుతోంది. కొవిడ్‌ -19, ఒమైక్రాన్‌, ఏ వేరియంట్‌ వచ్చినా ప్రజలు చేయాల్సింది కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించడమే.. కొవిడ్‌ తీవ్రత తగ్గిందికదా అని నిర్లక్ష్యం వహించొద్దు. గుంపులుగా ఉండొద్దు. భౌతిక దూరం పాటించాలి. మాస్క్‌ వేసుకోవాలి. చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి.

ప్ర: ఒమైక్రాన్‌ ఆనవాళ్లు ఏమైనా జిల్లాలో ఉన్నాయా..? ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లను గతంలో ట్రేస్‌ చేసినట్టు ఏమైనా చేస్తున్నారా..?
జ: జిల్లాలో ఒమైక్రాన్‌ ఉనికి ఇప్పటి వరకు లేదు. ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్లను విమానాశ్రయ అధికారుల ద్వారా సమాచారం సేకరించి రా ష్ట్ర హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు పూర్తిస్థాయిలో మానిటరింగ్‌ చేస్తున్నా రు.  జిల్లా అధికార యంత్రాంగం ముఖ్యంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న వారిని గ్రామస్థాయిలో కూడా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలతో పాటు అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.  

ప్ర: మరోసారి మాస్క్‌ జరిమానాలు పెరిగాయి.. పోలీసులు మాత్రమేనా, గ్రామస్థాయిలో ఇతర శాఖల అధికారులు కూడా దీన్ని అమలు చేసే అవకాశం ఉందంటారా..?
జ:  లేదు.. మాస్క్‌ ధరించకపోతే జరిమానా విధించే పనిని ఇతర శా ఖల అధికారులు చేయడం లేదు. పోలీసులు మాత్రమే ఆ పని చేస్తున్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలి. అందరూ మాస్క్‌ ధరించాలి. ఇప్పటి వరకు కూడా వ్యాక్సిన్‌ వేసుకోకుంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. వ్యాక్సిన్‌ తప్పని సరిగా వేయించుకోవాలి. కరోనా నుంచి రక్షణ పొందాలి.

ప్ర: ఒక వైపు అన్నిరకాల వేడుకలకు అనుమతిని ఇస్తున్నారు కదా..! భౌతిక దూరం ఎలా సాధ్యమవుతుందంటారు..?
జ: కరోనా కాలమంతా ప్రజలు అన్నిరకాల వేడుకలకు దూరంగా ఇంటికే పరిమితం అయిపోయారు. తీవ్రత తగ్గడం వల్ల ఇపుడిప్పుడే కొంచెం కుదుట పడుతున్నారు. వ్యాపార లావాదేవీలు, విద్యా వ్యవస్థ గాడిన పడుతున్నాయి. పెళ్లిళ్లు ఇతరత్రా వేడుకలు కొనసాగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాలి.  లాక్‌డౌన్‌ కాలంలో మనమంతా ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుంచుకోవాలి. పరిమిత సంఖ్యలోనే వేడుకలకు హాజరు అయ్యేటట్టు చూసుకోవాలి. ఎలాంటి వేడుకలోనైనా భౌతిక దూరం, మాస్క్‌ ధరించడం తప్పని సరిగా పాటించాలి..

ప్ర:  వరంగల్‌ నగరం రెండుగా చీలి హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కేంద్రాలుగా మారాయి. ఇప్పటివరకు కూడా సరిహద్దు సమస్యపై కొంత ప్రజల్లో గందరగోళంగా ఉంది..?
జ: నగరం కాబట్టి ఆ సమస్య ఉన్నట్టు కనిపిస్తున్నట్టు ఉంది. గ్రామీణ ప్రాంతం అయితే సరిహద్దుల ఏర్పాటు స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మండలాలు, వాటి పరిధిలోని రెవెన్యూ గ్రామాలే సరిహద్దులుగా ఉన్నాయి. మరింత స్పష్టంగా అర్థం కావడానికి చర్యలు చేపడతాం.

ప్ర: గ్రేటర్‌ వరంగల్‌ చీలిపోయిన తర్వాత హనుమకొండ ప్రాశస్త్యం పెంచే విధంగా ప్రత్యేకంగా సాంస్కృతిక ఉత్సవాలు జరిపే అవకాశాలు ఉన్నాయంటారా..?
జ:  వరంగల్‌ అంటే సుప్రసిద్ధ చారిత్రక ప్రాంతం అన్న పేరు ఉంది. నిజానికి హనుమకొండ కాకతీయరాజుల కాలం కంటే ఎంతో ముందు రాజధానిగా వెలుగొందిన ప్రాంతం. ఇప్పటికీ ఆ ఆనవాళ్లు హనుమకొండలో ఉన్నాయి. అదే విధంగా అరుదైన జైనశిల్పాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఎన్నో చారిత్రక, సాంస్కృతిక ఆధారాలు హనుమకొండలో ఉన్నాయి. కొవిడ్‌ కాలం కాబట్టి ఉత్సవాలు ఇప్పట్లే చేయలేం. హనుమకొండ ప్రాశస్త్యాన్ని తెలిపే విధంగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తాం.

ప్ర: ఏదైనా నగరం అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా మాస్టర్‌ ప్లాన్‌ ఉండాలి. 50 ఏళ్ల కిందటి మాస్టర్‌ ప్లాన్‌ తప్ప ఇప్పటి వరకు సరికొత్త మాస్టర్‌ ప్లాన్‌ లేదు. నగర అభివృద్ధి ఎలా జరుగుతుందంటారు..?
జ: సరికొత్త మాస్టర్‌ ప్లాన్‌ మార్పులు చేర్పులతో త్వరలో ఆమోదించే అవకాశం ఉంది.. కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో మెమో జారీ చేసింది. పూర్తి స్థాయిలో మాస్టర్‌ ప్లాన్‌ అమల్లో లేదు.

ప్ర: జిల్లాలో ప్రభుత్వ భూములు, అసైన్డ్‌ భూములు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించి హాయిగా ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు చాలా ఉన్నాయి.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?
జ: ధరణి వచ్చిన తర్వాత అలాంటి అవకతవకలకు అవకాశం లేదు. అయినప్పటికీ మా దృష్టికి ప్రజలు ఆధారాలతో తీసుకువస్తే అక్రమాలకు పాల్పడే వ్యక్తులు ఏస్థాయిలో ఉన్న వారైనా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. భూములను రక్షిస్తాం..

ప్ర: జిల్లాలో యాసంగి సాగులో కూడా వరి సాగు చేసే రైతులు ఎక్కువగానే ఉన్నారు... వరి వద్దంటే వారి పరిస్థితి ఏంటి ..?
జ: వరి విషయంలో ఇప్పటికే రైతులకు ఒకఅవగాహన వచ్చిందనుకుంటున్నాం. వరి పంట సాగు చేసి ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి వస్తే రైతులకు మరింత ఇబ్బంది కదా.. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

Updated Date - 2021-12-08T05:53:10+05:30 IST