కక్షగట్టి.. జట్టుకట్టి..

ABN , First Publish Date - 2021-09-03T06:14:37+05:30 IST

కక్షగట్టి.. జట్టుకట్టి..

కక్షగట్టి.. జట్టుకట్టి..
ఎల్బీనగర్‌ హత్యాకాండ కేసు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడిస్తున్న వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి

వ్యాపారంలో మోసగించాడన్న కోపంతోనే పాశవిక హత్యలు

ఎల్బీనగర్‌ మారణకాండ కేసును ఛేదించిన పోలీసులు

ప్రధాన నిందితుడు షఫీ సహా ఆరుగురి అరెస్టు

వేటకొడవళ్లు, రంపం మిషన్‌ స్వాధీనం

వివరాలను వెల్లడించిన సీపీ తరుణ్‌జోషి


ఓరుగల్లు, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : అందరూ అనుకున్నదే నిజమైంది. వ్యాపారంలో తనను మోసం చేశాడన్న కోపంతోనే షఫీ.. తన అన్న కుటుం బంపై అతి క్రూరంగా దాడికి దిగి ముగ్గురిని బలిగొన్నట్టు తేలింది. అన్నవదినలతో పాటు ఆమె సోదరుడిని హత్య చేసిన షఫీని, అతడికి సహకరించిన వారిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.  వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీపీ తరుణ్‌జోషి నిందితుల అరెస్టును చూపించారు.  


వరంగల్‌ ఎల్బీనగర్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన మారణకాండలో పశువుల విక్రయ వ్యాపారి చాంద్‌పాషా(50)తో పాటు ఆయన భార్య సబీరాబేగం(42), ఆమె సోదరుడు ఖలీల్‌పాషా(40) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. హత్యాకాండలో పాలుపంచుకున్న ప్రధాన నిందితుడు వరంగల్‌ కాశిబుగ్గకు చెందిన మహమ్మద్‌ షఫీ తో పాటు నర్సంపేట మండలం శాంతినగర్‌కు చెందిన బోయిని వెంకన్న, వరంగల్‌ డాక్టర్స్‌ కాలనీకి చెందిన ఎమ్డీ సాజీద్‌, భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రూపిరెడ్డిపల్లికి చెందిన రాగుల విజేందర్‌, వరంగల్‌ ఉర్సు సుభా్‌షకాలనీకి చెందిన ఎమ్డీ మీర్జాఅక్బర్‌, వరంగల్‌ ఎంహెచ్‌ నగర్‌కు చెందిన మహ్మద్‌పాషాను అరెస్టు చేశారు. ఘటనకు సంబంధించి సీపీ తరుణ్‌జోషి తెలిపిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి... 


హత్యకు గురైన చాంద్‌పాషా,  ప్రధాన నిందితుడు షఫీ స్వయాన సోదరులు. వరంగల్‌ జిల్లా పరకాల నుంచి వరంగల్‌ నగరానికి వ్యాపారరీత్యా వచ్చారు. సంతల్లో పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్‌లోని కబేళాలకు అమ్మేసే వారు. వచ్చిన ఆదాయాన్ని సమాన వాటాలుగా పంచుకునేవారు. అయితే రెండేళ్లుగా వ్యాపారంలో నష్టం వాటిల్లింది. తన అన్న చాంద్‌పాషా వ్యాపారంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ డబ్బులు తీసుకుని అప్పులు చూపించేవాడని షఫీ వాపోతుండేవాడు. ఈ విషయమై చాలాసార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీలు నిర్వహించారు. తనకు అప్పులు ఎక్కువైనందున డబ్బులు ఇప్పించాలని అన్న చాంద్‌పాషాపై పెద్దమనుషుల ద్వారా షఫీ కొంతకాలంగా ఒత్తిడి తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో పశువులు అమ్మిన రైతులు, ఇతర వ్యాపారస్తులు డబ్బుల కోసం  షఫీ మీద ఒత్తిడి పెంచారు. ఒకదశలో  వారు  షఫీకి  పశువులను అమ్మడం నిలిపివేశారు. దీంతో తన అన్న చాంద్‌ పాషాను  పలుమార్లు సంప్రదించి, డబ్బులు చెల్లించాలని షఫీ కోరాడు. తాను డబ్బులు ఇచ్చేది లేదని అన్న స్పష్టం చేయడంతో షఫీ కక్ష పెంచుకున్నాడు. అన్నను, ఆయన కుటుంబాన్ని హత్య చేసేందుకు పధకం రూపొందించాడు.


15 రోజుల క్రితమే కుట్ర..

షఫీ తన అన్న చాంద్‌పాషా, అతడి కుటుంబాన్ని హత్యచేసేందుకు పదిహేను రోజుల క్రితమే స్కెచ్‌వేశాడు. పాషా, సాజిద్‌, విజేందర్‌, అక్బర్‌, వెంకన్నను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. వారు తన దగ్గర పని చేసేవారు కావడంతో హత్యలకు సహకరిస్తామని ఒప్పుకున్నారు. హత్య చేసేందుకు షఫీ హైదరాబాద్‌ నుంచి ఐదు వేట కొడవళ్లను తెప్పించాడు. వరంగల్‌ చౌరాస్తాలోని ఓ షాపులో చెట్లను కోసేందుకు ఉపయోగించే బ్యాటరీ రంపాన్ని కొనుగోలు చేశాడు.


మంగళవారం రాత్రి అందరూ పూటుగా మద్యం తాగి హత్యాకాండ ప్లాన్‌ను ఖరారు చేసుకున్నారు.  బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఎల్బీనగర్‌లోని చాంద్‌పాషా ఇంటికి రెండు ఆటోలు, ద్విచక్రవాహనంపై వెళ్లారు. చాంద్‌పాషా ఇంటి ఎదుట ఆటోను నిలిపిన తర్వాత,  నిందితుల్లో ఒకరైన వెంకన్న బ్యాటరీ రంపంతో  ఇంటి ప్రధాన ద్వారం తలుపులను కట్‌ చేశాడు. షఫీతో పాటు మిగతా వాళ్లు వేటకొడవళ్లతో సిద్ధంగా ఉన్నారు.  ఈ శబ్ధానికి నిద్రలేచిన చాంద్‌పాషా కుటుంబ సభ్యులు తమ గదుల నుంచి బయటకువచ్చి విషయం అర్థం చేసుకునేలోపే, నిందితులు ఇంటికి కరెంట్‌ సరఫరా కట్‌ చేశారు. అనంతరం కళ్లల్లో కారం చల్లారు. అనూహ్య పరిణామం నుంచి వారు తేరుకోకముందే వేటకొడవళ్లతో దాడికి దిగారు.  ముందుగా చాంద్‌పాషను అతడి భార్య షబీరా బేగంను వేట కొడవళ్లతో పాటు, రంపంతో విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. అడ్డువచ్చిన చాంద్‌పాషా బావమరిది ఖలీల్‌పాషాను చంపేశారు. అడ్డుకునేందుకు వచ్చిన చాంద్‌పాషా కుమారులు ఫహాద్‌, సమద్‌పైన బ్యాటరీ రంపంతో  దాడిచేశారు. విచ్చలవిడిగా వారి శరీరంపై గాట్లు పెట్టారు. 


హత్య జరుగుతున్న సమయంలో చాంద్‌పాషా కుమార్తె రుబీనా తన వాళ్లను చంపొద్దంటూ వేడుకుంది. దీంతో ఆమెను  ఓ గదిలో బంధించారు. యథేచ్ఛగా మారణకాండ కొనసాగించిన తర్వాత అందరూ చనిపోయారని భావించి అక్కడి నుంచి నిందితులు వెళ్లిపోయారు.  రుబీనా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితుల కోసం గాలింపు జరిపి అరెస్ట్‌ చేశామని సీపీ వివరించారు.  వారి నుంచి హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లు, బ్యాటరీ రంపం, రెండు ఆటోలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో వెస్ట్‌ జోన్‌ డీసీపీ పుష్ప, వరంగల్‌ ఏసీపీ గిరి   కుమార్‌, ఇంతేజార్‌గంజ్‌ సీఐ మల్లేష్‌, ఎస్‌ఐ గోవర్దన్‌ పాల్గొన్నారు.


యూట్యూబ్‌లో చూసి..

అన్న చాంద్‌పాషా మీద పగతో రగిలిపోతున్న షఫీ ఆయనను హత్య చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. అన్న ఇంట్లోకి ఎలా వెళ్లాలి...  అనే విషయం మీద పెద్దఎత్తున కసరత్తు చేశాడు. ఇందుకోసం యూట్యూబ్‌ను ఉపయోగించుకున్నాడు. తలుపులు వేగంగా బద్దలు కొట్టాలంటే  బ్యాటరీ రంపం మేలని తెలుసుకున్నాడు. వరంగల్‌ చౌరస్తాలోని ఓ షాపులో దాన్ని కొనుగోలు చేశాడు.  అన్నతో పాటు అతడి కొడుకులు బలంగా ఉండడం వల్ల తిరిగి దాడిచేసే అవకాశం ఉందని భావించి,  వారికి  ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా  పకడ్బందీగా దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే మారణాయుధాలను వాడి పని పూర్తి చేసుకున్నాడు. కాగా, హత్యకు ముందు తానే ఆత్మహత్య చేసుకోవాలని ఓ దశలో అనుకున్నానని నిందితుడు  పోలీసులకు చెప్పినట్లు సమాచారం. కాగా,  ప్రధాన నిందితుడు షఫీ గతంలో అక్రమ ఆయుధాలకు సంబంధించిన కేసులో నిందితుడుగా ఉన్నాడు. సాంకేతిక కారణాలతో ఆ కేసు న్యాయస్థానం కొట్టి వేసింది.

Updated Date - 2021-09-03T06:14:37+05:30 IST