తీన్‌మార్‌

ABN , First Publish Date - 2021-11-17T05:34:42+05:30 IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఓరుగల్లుకు అనూహ్య ప్రాధాన్యం దక్కింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీ ఆర్‌ తన మార్కును మరోసారి ప్రదర్శించారు. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో మూడింటిని ఓరుగల్లుకే కే టాయించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, తక్కెళ్ళపల్లి రవిందర్‌రావు, బండా ప్రకాశ్‌కు అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో పాటు మంగళవారం నామినేషన్లు వేయించారు.

తీన్‌మార్‌
హైదరాబాద్‌లో ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేస్తున్న అభ్యర్థులు తక్కెళ్లపల్లి రవిందర్‌రావు, బండా ప్రకాశ్‌, కడియం శ్రీహరి

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓరుగల్లుకు అనూహ్య ప్రాధాన్యం
కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవిందర్‌రావుతో పాటు బండా ప్రకాశ్‌కు చాన్స్‌
అభ్యర్థులను స్వయంగా అభినందించిన అధినేత కేసీఆర్‌
అనూహ్యంగా తెరపైకి వచ్చిన బండా ప్రకాశ్‌
ఈటలకు ప్రత్యామ్నాయంగా అవకాశం ఇచ్చినట్టు ప్రచారం
మంత్రివర్గంలోకి సైతం తీసుకుంటారని ఊహాగానాలు
రాజ్యసభ పదవికి త్వరలో రాజీనామా
సిరికొండ మధుసూదనాచారికి మిగిలిన నిరాశ


ఓరుగల్లు, నవంబరు 16 (ఆంధ్ర జ్యోతి ప్రతినిధి) :
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఓరుగల్లుకు అనూహ్య ప్రాధాన్యం దక్కింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీ ఆర్‌ తన మార్కును మరోసారి ప్రదర్శించారు. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాల్లో మూడింటిని ఓరుగల్లుకే కే టాయించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, తక్కెళ్ళపల్లి రవిందర్‌రావు, బండా ప్రకాశ్‌కు అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో పాటు మంగళవారం నామినేషన్లు వేయించారు. ముగ్గురిలో కడియం శ్రీహరి, తక్కెళ్ళపల్లి ర విందర్‌రావుకు ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందని ముందే అంచనా వేసినప్పటికీ, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌కు ఖరారు కావడం మాత్రం ఎవరూ ఊహించనిది.

ఇక మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారికి మాత్రం నిరాశే ఎదురైంది. ఈ సారి ఎమ్మెల్సీ అవకాశం తప్పక వస్తుందని చారి అభిమానులు, అనుచరులు ఎదురు చూశారు. కారాణాలేమైనప్పటికీ మధుసూదనాచారికి మాత్రం అవకాశం దక్కలేదు. బండా ప్రకాశ్‌ రాజ్యసభ స్థానాన్ని మధుసూదనాచారికి ఇస్తారని  జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే రాజ్యసభ సీటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇచ్చే అవకాశాలున్నాయన్న ప్రచారం లేక పోలేదు. అదే జరిగితే మధుసూదనాచారికి మరో కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారన్న చర్చ కూడా సాగుతోంది..

మంత్రి వర్గంలో ఎవరికో చాన్సు..?

మంత్రి వర్గంలో చోటెవరికి దక్కుతుంది....ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇది టాక్‌ ఆఫ్‌ ద పబ్లిక్‌గా మారింది. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌  పరాజయం అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీ, ప్రభుత్వంలో కూడా పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న బండా ప్రకాశ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారన్న చర్చ జరుగుతోంది. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన హుజూరాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.  

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌కు సైతం మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశాన్ని కొట్టి పారేయలేమని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలంటున్నారు. ఎమ్మెల్సీగా మళ్లీ అవకాశం దక్కించుకున్న  మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంత్రిగా సుదీర్ఘ కాలం పని చేసిన అనుభవం ఉంది.  బీజేపీతో పోరుబాటకు సిద్ధపడుతున్న పరిస్థితుల్లో కడియం లాంటి సీనియర్‌ నేత సేవలు వినియోగించుకునే అవకాశాలను కాదనలేమంటున్నారు. శాసనమండలి చైర్మన్‌గా కూడా కడియం శ్రీహరికి అ వకాశం దక్కుతుందంటున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఉం డాల్సిన సంఖ్య కంటే ఒక్కరు మాత్రమే తక్కువగా ఉన్నారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ జరిపితే తప్ప సరికొత్త మా ర్పులకు అవకాశం లేదని అంటున్నారు.  ఉంటుందంటున్నా రు. ఒకే ఒక్కరిని కేబినెట్‌లో తీసుకోవాలనుకుంటే మాత్రం  బండా ప్రకాశ్‌కే   అవకాశం దక్కుతుందంటున్నారు.

సిరికొండ భవిష్యత్తు..?
మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారికి ఎమ్మెల్సీ అవకాశం దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చివరకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో లేదా ఇతర కోటాలో మధుసూదనాచారికి అవకాశం వస్తుందని అంటున్నారు. ఇంకా కొందరు మరో అడుగు ముందుకేసి బండా ప్రకాశ్‌ స్థానంలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం దక్కవచ్చన్న చర్చ కూడా ఉంది. నిజానికి బండా ప్రకాశ్‌ స్థానంలో ఎమ్మెల్సీ క ల్వకుంట్ల కవితకు అవకాశం రావచ్చనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.. సీఎంకు అత్యంత ఆత్మీయుడిగా పేరున్న మ ధుసూదనాచారికి మాత్రం రాజ్యసభ కాకపోయినా ఏదో ఒక కోటాలో మాత్రం ఎమ్మెల్సీ ఖాయంగా వస్తుందంటున్నారు.

షాకింగ్‌ నిర్ణయాలు..
టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఎప్పుడు ఏ సంచలన నిర్ణయం తీసుకుంటారో తెలియని స్థితి ఉందని టీ ఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. 2014లో లోక్‌సభ సభ్యుడిగా గెలిచిన కడియం శ్రీహరిని ఆగమేఘాల మీద పదవికి  రాజీనామా చేయించారు. అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్యను బర్తరఫ్‌ చేసి, ఆ పదవిని  కడియంకు కట్టబెట్టారు.. అనంతరం కడియంకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.   2018 డిసెంబరులో రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన మంత్రివర్గం లో కడియంకు చాన్సు దక్కలేదు. దీంతో ఆయన చాలా కాలం పాటు ఎమ్మెల్సీగానే కొనసాగాల్సి వచ్చింది.

ఇక తెలుగుదేశం పార్టీ అగ్రనేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌ రావు 2016లో టీఆర్‌ఎ్‌సలో చేరి, తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్‌ పార్టీని టీఆర్‌ఎ్‌సలో విలీనం చేశారు. దీంతో టీఆర్‌ఎ్‌సలో దయాకర్‌ రావు ప్రాధాన్యత పెరిగింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌ రావుకు కీలకమైన మంత్రి పదవి లభించింది. 2018లో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచిన  దాస్యం వినయ్‌ భాస్కర్‌కు  మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ పదవి మాత్ర మే లభించింది. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మం త్రి వర్గంలోకి తీసుకున్నారు. ఇది కూడా అనూహ్యంగా జరిగిందే.  టీఆర్‌ఎ్‌సలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అనేకమంది సీనియర్లు కేసీఆర్‌ సంచలన నిర్ణయాలతో షాక్‌కు గురవుతున్నారు. పార్టీలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతున్నాయనే వ్యాఖ్య జోరుగా వినిపిస్తోంది.



ఫలించిన ‘తక్కెళ్లపల్లి’ చిరకాల వాంఛ
గిరిజనేతర వర్గాలకు భరోసా

మహబూబాబాద్‌, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) :
ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర సాధనోద్యమంలో మలిదశ ఉద్యమానికి ఊపిరిలూదిన  మానుకోట గడ్డకు గులాబీ సుప్రీం కేసీఆర్‌ పెద్దపీట వేశారు. ఇప్పటికే ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలో జిల్లాకు చెందిన సత్యవతిరాథోడ్‌కు అవకాశం ఇచ్చి క్యాబినేట్‌లో మంత్రి హోదా కల్పించిన సీఎం కేసీఆర్‌ తాజాగా మలిదశ తెలంగాణ ఉద్యమనాయకుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావుకు మరో ఎమ్మెల్యేల ఎమ్మెల్సీగా హోదా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం రవీందర్‌రావుకు కేసీఆర్‌ బీఫాం అందజేసి నామినేషన్‌ దాఖలు చేయించారు. మెజారిటీ బలమున్న టీఆర్‌ఎ్‌సలో ఎమ్మెల్సీల ఎన్నిక లాంఛనమే కానుంది.

విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలంతో నాయకుడిగా ఎదిగిన తక్కెళ్లపల్లి రవీందర్‌రావు తెలుగుదేశం పార్టీలో గ్రామ పార్టీ అధ్యక్ష స్థానం నుంచి ఉమ్మడి వరంగల్‌ జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ తరగతుల్లో శిక్షకుడిగా ప్రతిభ కనబరిచారు. సీనియర్‌ రాజకీయవేత్త, మాజీ మంత్రి, దివంగత నెమురుగొమ్ముల యతిరాజరావు శిష్యరికంలో రాటుదేలారు. రవీందర్‌రావు దాదాపు 17 ఏళ్లుగా చట్టసభల్లో అడుగుపెట్టేందుకు కలలు కన్నారు. తొలుత 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబాబాద్‌ నియోజకవర్గ టీడీపీ టికెట్‌ కోసం పోటీపడ్డారు. టికెట్‌ వేం నరేందర్‌రెడ్డికి దక్కడంతో ఆయన గెలుపు కోసం కృషి చేశారు.

మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న 2007లో ఉద్యమనేత కేసీఆర్‌ ఆహ్వానం మేరకు టీఆర్‌ఎ్‌సలో చేరారు. 2009 ఎన్నికల సమయంలో చెన్నూరు నియోజకవర్గంపై దృష్టి సారించారు. నియోజకవర్గాల పునర్విభజనలో చెన్నూరు నియోజకవర్గం ఆదృశ్యమై పాలకుర్తి నియోజకవర్గంగా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే టీడీపీ ప్రాతినిధ్య ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్థన్నపేట నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావడం, ఆ ఎన్నికల్లోనే టీడీపీ, టీఆర్‌ఎస్‌ అలయన్స్‌తో ఎర్రబెల్లి దయాకర్‌రావుకు(టీడీపీ) ప్రాతినిధ్యంలో పాలకుర్తి టికెట్‌ రావడంతో మరోమారు నిరాశకు గురయ్యారు. తిరిగి 2014 ఎన్నికల సమయంలో యతిరాజారావు తనయుడు డాక్టర్‌ నెమురుగొమ్ముల సుధాకర్‌రావు టీఆర్‌ఎ్‌సలో చేరడంతో పాలకుర్తి టికెట్‌ ఆయనకే దక్కింది. 2016లో ఎర్రబెల్లి దయాకర్‌రావు టీఆర్‌ఎ్‌సలో చేరడంతో 2018 ఎన్నికల్లో రవీందర్‌రావుకు పాలకుర్తిలో చుక్కెదురైంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ద్వారా చట్టసభల్లో కాలుమోపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యమకారుడిగా రవీందర్‌రావుకు గుర్తింపునిచ్చి ఎమ్మెల్యేల ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

మహబూబాబాద్‌ జిల్లా పరిధిలో గిరిజనేతరులకు ఎలాంటి పదవులు లేవన్న అపోహాలను తొలగించడంతో పాటు ఉద్యమకారుడికి అవకాశం కల్పించినట్లవుతుందన్న కోణంలోఎమ్మెల్సీ స్థానానికి తక్కెళ్లపల్లి రవీందర్‌రావును ఎంచుకున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-11-17T05:34:42+05:30 IST