నగరంలో ‘కొకైన్’ జాడలు
ABN , First Publish Date - 2021-11-06T05:00:59+05:30 IST
నగరంలో ‘కొకైన్’ జాడలు

లాడ్జిలో సేవిస్తుండగా ఆరుగురు యువకుల అరెస్టు
పట్టుబడిన వారిలో ఇద్దరు విక్రయదారులు
రూ.3.16 లక్షల మత్తుపదార్థాలు స్వాధీనం
గోవా నుంచి తీసుకువచ్చి నగరంలో రహస్య అమ్మకాలు
హనుమకొండ క్రైం, నవంబరు 5: పాశ్చాత్య నగరాల్లో కనిపించే మత్తు సంస్కృతి నగరానికి పాకింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొకైన్ అమ్మకాలు జరుగుతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. హంటర్‌రోడ్డులోని ఓ లాడ్జిలో ఆరుగురు యువకులు కొకైన్, చరాస్ వంటి మత్తుపదార్థాలు తీసుకుంటుండగా వరంగల్ టాస్క్‌ఫోర్స్, సుబేదారి పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వారి నుంచి రూ.3.16లక్షల విలువగల కొకైన్, చరాస్, గంజాయి నూనెతోపాటు మత్తును కలిగించే ఎల్‌ఎ్‌సడీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం వరంగల్ సీపీ తరుణ్‌జోషి పట్టుకున్న మత్తుపదార్థాలను చూపించి వివరాలను వెల్లడించారు.
వరంగల్ పిన్నవారివీధికి చెందిన శివ్వా రోహన్, హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన పెంచికల కాశీరావులు హైదరాబాద్‌లో బీటెక్ చదువుతున్న సమయంలో మంచి స్నేహితులు. రోహన్ బీటెక్ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటుండగా.. కాశీరావు హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరు సంపన్న కుటుంబాలకు చెందిన యువతను లక్ష్యంగా చేసుకుని మత్తుకు బానిసలుగా చేస్తారు. ఈ క్రమంలో రోహన్, కాశీరావు గోవాలో ఉంటున్న విదేశీయులు కాల్‌జోఫర్, జాక్‌ల ద్వారా కొకైన్, చరాస్, గంజాయితో తయారు చేసిన పూనెతో పాటు ఇంకా మత్తును కలిగించే పదార్థాలను కొనుగోలు చేసి వరంగల్‌కు తీసుకువచ్చారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో మూడేళ్లుగా లాడ్జిలను మారుస్తూ గదులు అద్దెకు తీసుకుని తెలిసిన మిత్రుల వద్ద డబ్బులు తీసుకుని మత్తుపదార్థాలు విక్రయించేవారు. కొన్ని సమయాల్లో బాటిట్‌షాట్ ద్వారా గంజాయి పొడిని పొగగా మార్చి బాంగ్ షాట్‌లుగా అందించేవారు. మత్తుపొందేవారికి నిమిషానికి వేల రూపాయలు తీసుకుని అందించేవారు. కొందరిని నేరుగా కొకైన్, చరా్‌సను విక్రయించేవారు. వీరిద్దరూ పలుమార్లు గోవాకు వెళ్లి మత్తుపదార్థాలు తెచ్చి ఇక్కడ అమ్మకాలు జరిపారు.
ఈ క్రమంలో రెండు రోజులుగా హనుమకొండ హంటర్‌రోడ్డులోని ఆర్ క్రిస్టల్ లాడ్జిలో కొందరు యువకులు మత్తులో తూగుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో శుక్రవారం వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతో పాటు సుబేదారి పోలీసులు సంయుక్తంగా లాడ్జిపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 3.16 లక్షల విలువగల కొకైన్, చరాస్, హుంకాపాట్, గంజాయి నూనె, ఎల్‌ఎ్‌సడీ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఆరుగురు వ్యక్తులను రిమాండ్‌కు తరలించారు. మత్తుపదార్థాలను విక్రయించి సేవించే వారిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వారిలో సెంట్రల్‌జోన్ డీసీపీ పుష్ప, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివా్‌సజీ, సంతో్‌షకుమార్, సుబేదారి ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శ్యాంసుందర్, మహేందర్, సృజన్, శ్రీనివాస్, శ్రీకాంత్‌లను సీపీ తరుణ్‌జోషి అభినందించారు.
పోలీసుల గోప్యత
హంటర్‌రోడ్డులోని లాడ్జిలో మత్తుయువకులపై పోలీసులు దాడి చేసిన సమయంలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. కానీ ఇద్దరి పేర్లు మాత్రమే మీడియాకు వెల్లడించారు. మరో నలుగురి పేర్లు వివరాలు వెల్లడించకపోవడం పట్ల పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సంపన్నవర్గాలకు చెందిన వారు కావడంతోనే నలుగురి పేర్లు బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తపడ్డట్టు విశ్వసనీయ సమాచారం. మరో కీలకమైన వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్టు సీపీ వెల్లడించారు.