కలకలం రేపిన వీఆర్‌ఏ మృతి

ABN , First Publish Date - 2021-12-08T08:36:48+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలో ఓ వీఆర్‌ఏ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఇసుక మాఫియానే వీఆర్‌ఏను హత్య చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా..

కలకలం రేపిన వీఆర్‌ఏ మృతి

  • ఇసుక మాఫియానే హతమార్చింది!.. 
  • కుటుంబ సభ్యుల ఆరోపణ
  •  పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా
  • ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు


బోధన్‌ రూరల్‌, డిసెంబరు 7: నిజామాబాద్‌ జిల్లాలో ఓ వీఆర్‌ఏ మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఇసుక మాఫియానే వీఆర్‌ఏను హత్య చేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. తగాదాలు, పాత కక్షల వల్ల జరిగిన ఘర్షణలోనేమరణించాడని పోలీసులు చెబుతున్నారు. బోధన్‌ మండలం ఖండ్‌గావ్‌కు చెందిన గౌతమ్‌ కుమార్‌(40) వీఆర్‌ఏగా పని చేస్తున్నారు. గ్రామ శివారులోని వాగు నుంచి ఇటీవల కొందరు వ్యక్తులు ఇసుకను తరలిస్తున్నారు. పలుమార్లు గౌతమ్‌ వారిని అడ్డుకున్నారు. సోమవారం గౌతమ్‌ రాత్రి గ్రామానికి చెందిన కొందరు గౌతమ్‌ ఇంటికి వచ్చి.. పని ఉందంటూ అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వీరి మధ్య వాగ్వాదం జరగ్గా.. ముగ్గురూ కలిసి గౌతమ్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కుటుంబసభ్యులు గౌతమ్‌ను వెంటనే బోధన్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి అర్ధరాత్రి 12 గంటలకు మృతి చెందా రు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్నందుకే గౌతమ్‌పై దాడి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం బోధన్‌ రూరల్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకూ కదిలేది లేదని బైఠాయించారు. విషయం తెలుసుకున్న పలువురు వీఆర్‌ఏలు పోలీస్‌స్టేషన్‌కు తరలి వచ్చారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏలు మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను అమలు చేసే క్రమంలో మాఫియా చేతిలో వీఆర్‌ఏలు ప్రాణా లు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కాగా, ఖండ్‌గావ్‌లో ఇసుక రవాణాను అడ్డుకోవాలని ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేదని బోధన్‌ తహసీల్దార్‌ గఫార్‌మియా స్పష్టం చేశారు. వీఆర్‌ఏ గౌతమ్‌కుమార్‌కు ప్రత్యేకంగా విధులు కేటాయించలేదని చెప్పారు. 


పాత కక్షలే కారణం : డీసీపీ అరవింద్‌

 బోధన్‌ ఏసీపీ రామారావు ఆందోళనకారులతో మాట్లాడారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.వీఆర్‌ఏ మృతి వెనక వ్యక్తిగత తగాదాలున్నట్లు విచారణలో వెల్లడైందని ఏసీపీ వివరించారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. పాత కక్షల వల్లే గౌతమ్‌ హత్యకు గురైనట్లు నిజామాబాద్‌ డీసీపీ అరవింద్‌ బాబు తెలిపారు.  

Updated Date - 2021-12-08T08:36:48+05:30 IST