ఓటర్ల అవస్థలు

ABN , First Publish Date - 2021-03-15T05:21:15+05:30 IST

వరంగల్‌- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జంబో బ్యాలెట్‌ పేపర్‌ ఓటర్లను ఇబ్బందులకు గురిచేసింది.

ఓటర్ల అవస్థలు

జంబో బ్యాలెట్‌ పేపర్‌తో చిక్కులు
హన్మకొండ, మార్చి 14 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌-  ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జంబో బ్యాలెట్‌ పేపర్‌ ఓటర్లను ఇబ్బందులకు గురిచేసింది. ఒక్కో ఓటుకు గరిష్టంగా 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టింది. దీంతో పోలింగ్‌ ప్రక్రియలో తీవ్ర జాప్యం చోటుచేసుకున్నది. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది.  చాలా సమయం నిరీక్షించలేక కొన్నిచోట్ల వృద్ధులు, మహిళలు ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ఈసారి పోలింగ్‌ కేంద్రాలను కూడా సరిపడా ఏర్పాట్లు చేయలేదు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 1,81,339 మంది ఓటర్లకు కేవలం 195 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి ఏమాత్రం సరిపోలేదనే విమర్శలు వ్యక్తమయ్యాయి. గతంలో కంటే ఈసారి ఓటర్లు 15నుంచి 20శాతం పెరిగారు. అందుకు సరిపడ కేంద్రాలను పెంచలేదు.  పైగా పోలింగ్‌ కేంద్రాలు దూరంగా ఉండడంతో పట్టభద్రులైన వృద్ధులు, మహిళలు ఓటేయడానికి రాలేకపోయారు. ఓటర్ల రద్దీ అధికంగా ఉన్నచోట అదనంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఎన్నికల సంఘం అదేశించినప్పటికీ అది ఎక్కడా అమలు కాలేదు.

Updated Date - 2021-03-15T05:21:15+05:30 IST