పంపకాల్లో రచ్చ
ABN , First Publish Date - 2021-10-29T08:41:20+05:30 IST
ఉప ఎన్నికలో ప్రచారానికి తెరపడగా.. పంపకాల లొల్లిలతో హుజూరాబాద్ దద్దరిల్లుతోంది. అధికార పార్టీ నేతలు ఓటుకు రూ.6వేల చొప్పున ఇస్తున్నారని, బీజేపీ నేతలు సైతం ఏ మాత్రం తగ్గకుండా రూ.5వేల చొప్పున డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరగడంతో.. తమకు ఇంకా అందలేదే..
- హుజూరాబాద్‌లో రోడ్డెక్కిన ఓటర్లు..
- డబ్బుల కోసం వాగ్వాదాలు, ధర్నాలు
‘‘నువ్వు సర్పంచ్‌వైతే ఏంది? పార్టీవోళ్లు ఇచ్చిన డబ్బులు నువ్వెట్ల ఆపుతవు? గ్రామంలో సగం మందికే పైసలిస్తవా? మేమేం పాపం చేసినం? మాకెందుకు ఇయ్యవు? నువ్వు కూడా మేము ఓట్లేస్తేనే గెలిచినవు.. నిన్ను ఎట్ల గెలిపించినమో.. అట్లనే దింపేస్తాం.. ఏమనుకుంటున్నవో.. మరి.. డబ్బులు మాకూ ఇస్తే సరే..లేదంటే అందరి దగ్గర వెనక్కితీసుకో.. కాదంటే చెప్పు.. రోడ్డు మీదనే కూసుంటం’’.. హుజూరాబాద్ మండలంలోని పాపయ్యపల్లిలో గ్రామస్థుల ఆందోళన ఇదీ. పోలీసులు నచ్చజెప్పినా వినకుండా గంట పాటు వారు రోడ్డుపై బైఠాయించారు.
‘‘మేమేం తప్పు చేసినం? మాకెందుకు ఇయ్యవు పైసలు? మీకు కావాల్సిన వాళ్లకైతే ఇస్తవా? టీఆర్‌ఎస్ వాళ్లు ఎక్కడ ప్రచారానికి పిలిచినా పోయినం. ఎవరెవరికో డబ్బులు ఇచ్చి.. మాకు మాత్రమే ఎగ్గొడతవా? కేసీఆర్ అందరికీ ఇవ్వమని డబ్బులు పంపితే కొందరికే ఎట్ల ఇస్తవయ్యా? గిట్లనే ఉంటదా? ఇంత అన్యాయమా?’’... - వీణవంక మండలం గంగారంలో ధర్నా సందర్భంగా మహిళల వ్యాఖ్యలివి.
‘‘రెండు రోజుల నుంచి గ్రామంలో ఎవరెవరికో పైసలు ఇస్తున్నరట. మాకు మాత్రం ఇప్పటిదాంకా ఇయ్యలేదు. మేము బీజేపీ, కాంగ్రెస్ వాళ్ల వెంబడి తిరిగినమని చెప్పి మాకు పైసలు ఇస్తలేరా? 20 ఏండ్ల నుంచి టీఆర్‌ఎ్‌సకే మేమూ ఓటేస్తున్నాం. మాపైనే ఎందుకింత వివక్ష.. ఇస్తే అందరికీ సమానంగా ఇయ్యాలె. లేదంటే బంద్ చెయాలె. గిట్ల అన్యాయం చేస్తే మేం ఎవరికీ ఓటు వేయం’’... ఇల్లందకుంట మండలం సీతంపేటలో 70 మంది మహిళలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో జరిగిన సంభాషణ ఇది.
హుజూరాబాద్, అక్టోబరు 28: ఉప ఎన్నికలో ప్రచారానికి తెరపడగా.. పంపకాల లొల్లిలతో హుజూరాబాద్ దద్దరిల్లుతోంది. అధికార పార్టీ నేతలు ఓటుకు రూ.6వేల చొప్పున ఇస్తున్నారని, బీజేపీ నేతలు సైతం ఏ మాత్రం తగ్గకుండా రూ.5వేల చొప్పున డబ్బులు పంచుతున్నారని ప్రచారం జరగడంతో.. తమకు ఇంకా అందలేదే.. అంటూ ఓటర్లు కంగారుపడుతున్నారు. ఊర్లో కొందరికే ఇచ్చి.. తమకు ఇవ్వలేదంటూ గురువారం ఉదయం నుంచీ చాలా చోట్ల ఆందోళనలు మొదలయ్యాయి. సగం డబ్బులే ఇచ్చారని కొన్ని చోట్ల, అసలు డబ్బులే ఇవ్వలేదని మరి కొన్ని చోట్ల గొడవలకు దిగారు. స్థానిక సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఇళ్ల ఎదుట ధర్నాలు చేపట్టారు. 30న పోలింగ్ ఉండడంతో ఆ లోగా డబ్బులు ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దీంతో స్థానిక నాయకులు హైరానా పడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా డబ్బు పంపిణీ చేయాల్సి ఉండగా... ఇంకా ఎందుకివ్వలేదంటూ ఓటర్లే ఆందోళనకు దిగుతుండడంతో ఫోన్లు స్విచ్‌ఆ్‌ఫ చేసి అందుబాటులో లేకుండా పోయారు. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న వేళ.. ధర్నాల రచ్చ మొదలవడంతో తలలు పట్టుకుంటున్నారు. కొందరు నేతలు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. హుజూరాబాద్ పరిధిలోని చాలా గ్రామాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది.
పలు గ్రామాల్లో జరిగిందిదీ..
హుజూరాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లిలోని హనుమాన్ దేవాలయం వద్ద ఓట్లకు సంబంధించిన డబ్బులు రాలేదంటూ గ్రామస్థులు ధర్నాకు దిగి రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో 2800 మంది ఓటర్లు ఉండగా.. 1600మందికే డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. అన్యాయంగా వ్యవహరించిన సర్పంచ్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులతోనూ వారు వాగ్వాదానికి దిగారు. కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ఆందోళనలు చేపట్టరాదని పోలీసులు చెప్పగా.. మరి డబ్బులు పంచుతున్నప్పుడు ఏం చేస్తున్నారని వారు ఎదురు ప్రశ్నించారు. పోలీసులు నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోకుండా గంటపాటు రోడ్డుపైనే బైఠాయించారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని, ఇలా ఆందోళనలు చేస్తే ఊరుకోబోమని సీఐ హెచ్చరించడంతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు. ఇదే మండలంలోని ఇప్పల్ నర్సింగాపూర్, రంగాపూర్, కందుగుల, కాట్రపల్లిలోనూ డబ్బులు రాలేదంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. ‘‘గ్రామంలో 2650 ఓట్లు ఉంటే 850 మందికి రూపాయి కూడా ఇవ్వలేదు.
12 మంది వార్డు సభ్యులు.. వాళ్లకు తెలిసినోళ్లకే పైసలు ఇచ్చిండ్రు.. గిదేం పద్ధతి. మాకూ ఓట్లు ఉన్నయి కదా... మేమూ ఓటు వేయాలి కదా.. మరి మాకెందుకు ఇవ్వరు పైసలు. రూ.6వేలు ఏమన్నా మీ జేబులోకెల్లి ఇస్తున్నారా? పైన వాళ్లు ఇచ్చినయి పంచడానికి మీకేం నొప్పి?’’...అంటూ రాంపూర్ వాసులు సర్పంచ్ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. వీణవంక మండలం గంగారంలో సర్పంచ్ ఇంటి ఎదుట 70 మంది మహిళలు ధర్నా చేపట్టారు. ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో సర్పంచ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు మహిళలను సముదాయించి ధర్నా విరమింపజేశారు. ఇల్లందకుంట మండలంలోని సీతంపేటలో టీఆర్‌ఎస్ నుంచి తమకు డబ్బులు రాలేదంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై కొందరు ధర్నాకు దిగారు. కొందరు నాయకులు తమకు రావాల్సిన డబ్బులు ఆపారని, ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వారిని నుంచి వారిని పంపించేశారు.
అందరికీ సమానంగా ఇవ్వాలి
ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు పంపిణీ చేసిన డబ్బును అందరికీ సమానంగా ఇవ్వాలి. రాజకీయ నాయకులు కొన్ని కులాల ప్రాతిపదికన ఇవ్వడం మంచిది కాదు. ముదిరాజ్, యాదవ కుటుంబాల్లో కొందరికే ఇచ్చి మరికొందరికి ఇవ్వకపోవడంలో అంతర్యమేంటి
విజయ, సీతంపేట
ఎన్నిక వల్లే గ్రామంలో విభేదాలు
మా గ్రామంలో అందరం కలిసి ఉంటాం. కానీ, ఉప ఎన్నికతో మహిళల మధ్య గొడవలవుతున్నాయి. రెండు రోజుల క్రితం రాజకీయ నాయకులు కొందరికి డబ్బులు ఇచ్చారు. దీంతో డబ్బులు రాని వాళ్లు గొడవ చేస్తున్నారు.
సరిత, సీతంపేట

అడిగితే దాడులు చేస్తున్నారు
గ్రామంలో ఓటు ఉన్న అందరికీ డబ్బులు పంచాలి. డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే లోకల్ లీడర్లు దాడులు చేస్తున్నారు. గ్రామంలో కొంత మందికే డబ్బులిస్తున్నారు. ఎంత మంది ఉంటే అందరికీ డబ్బు పంపిణీ చేయాలి.
గట్టు భిక్షపతి, ఓటరు, పెద్దపాపయ్యపల్లి
