స్వచ్ఛంద పంట విరామం!

ABN , First Publish Date - 2021-12-08T08:55:28+05:30 IST

కావాల్సినన్ని నీళ్లుండి.. కరెంటూ ఉండి కూడా రైతులెవరైనా ఏ పంటా వేయకుండా సాగుభూమిని బీడుగా వదిలేస్తారా? ప్రాజెక్టులు, చెరువుల కింద బురద పొలాలున్న రైతులు ఇప్పుడు ఇదే దిశగా ఆలోచిస్తున్నారు.

స్వచ్ఛంద పంట విరామం!

  • వరి వద్దనడంతో యాసంగిలో ఆయకట్టు కింద బీళ్లే..
  • బురద పొలాల్లో ఆరుతడి పంటలసాగు అసాధ్యం 
  • రైతుల్లో ఇదే భావన.. ఏ పంటా వద్దని నిర్ణయం
  • ఏటా వానాకాలంలోనే వార్షిక కౌలు ఒప్పందం
  • వరి వద్దంటే కౌలురైతులకు గిట్టుబాటు ఎలా? 
  • ఆరుతడి పంటల విత్తనాల లభ్యతపై  అస్పష్టత? 
  • ఏడాది విరామం ప్రకటిస్తేనే ఆరుతడికి  సిద్ధం


గద్వాల, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): కావాల్సినన్ని నీళ్లుండి.. కరెంటూ ఉండి కూడా రైతులెవరైనా ఏ పంటా వేయకుండా సాగుభూమిని బీడుగా వదిలేస్తారా? ప్రాజెక్టులు, చెరువుల కింద బురద పొలాలున్న రైతులు ఇప్పుడు ఇదే దిశగా ఆలోచిస్తున్నారు. యాసంగి సీజన్‌లో వరిని సాగు చేయొద్దని.. బదులుగా ఆరుతడి పంటలేమైనా వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తుండటంతో దిక్కుతోచని స్థితిలో స్వచ్ఛంద పంట విరామం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌ కాకతీయ కింద చెరువుల్లో పూడిక తీయడం, వర్షాలు నిండుగా కురియడంతో వానాకాలం సీజన్‌ ముగిసినా రాష్ట్రంలో చెరువులన్నీ నిండు కుండల్లానే ఉన్నాయి! సాధారణంగా చెరువుల్లో పుష్కళంగా నీరుంటే ఆ నీరు జాలుగా ఆయకట్టు కింద పొలాల్లోకి వస్తుంది. దీంతో పొలమంతా బురదగానే ఉంటుంది. అప్పుడు వరిసాగు చేయడం తప్ప దాదాపు ప్రత్యామ్నాయం ఏమీ ఉండదు. దీంతో స్వచ్ఛంద పంట విరామం తప్పదని తల పట్టుకుంటున్నారు.  నీటి వసతి, 24గంటలపాటు విద్యుత్తు అందుబాటులో ఉండటంతో పాటు ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో వరిసాగుకు అనుకూలంగా మారింది.


ఇందుకు ఆరుతడి పంటల సాగు విధానం విరుద్ధం అనే అభిప్రాయంతో రైతులున్నారు. పెట్టుబడి భారంతో పాటు, కూలీల కొరతను ఎదుర్కొవాల్సి ఉంటుందని.. వరితో పోల్చితే దిగుబడి కూడా తక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. కౌలు రైతులకు మరింత కష్టమొచ్చింది. సాఽధారణంగా కౌలు ఒప్పందాలు రెండు పంటలకు జరుగుతాయి. ఆయకట్టు కింద రెండు సీజన్లలోనూ వరి పంటను సాగుచేస్తామనే ఉద్దేశంతో కౌలు ఒప్పందాలు చేసుకుంటామని.. అటువంటప్పుడు యాసంగిలో ఆరుతడి పంటలకు మరలితే నష్టం వాటిల్లదా? అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆరుతడి పంటల సాగుకు విధివిధానాలు.. అంటే విత్తనాల లభ్యత, మార్కెట్‌ సౌకర్యం, మద్దతు ధర అంశాలపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటనా చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుతడి పంటలకు పనిముట్లు ఎక్కువగా అవసరమని, పంటలో గడ్డి ఏపుగా పెరగడంతో కలుపుతీత పెనుభారమని అంటున్నారు. వరితో పోల్చితే ఆరుతడి పంటలకు చీడపీడల సమస్య ఎక్కువ అని, పిచికారీ చేయాల్సిన క్రిమిసంహారక మందులపై అవగాహన లేదని, అసలు ఆ పురుగు మందుల లభ్యతపై స్పష్టత ఏది? అని అంటున్నారు. ఎలాంటి అవగాహన లేకుండా ఆరుతడి పంటలను ఎలా వేయగలమని ఇంకొందరు ఆలోచిస్తున్నారు. 


ధైర్యం చేసి వరిసాగు చేసినా.. 

 రాష్ట్ర ప్రభుత్వ సూచనలకు భిన్నంగా యాసంగిలో వరి సాగుచేస్తే మార్కెటింగ్‌ సమస్య ఎదురవ్వొచ్చని కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. ధైర్యం చేసి సాగు చేసినా.. మిల్లర్లు కొనేందుకు ముందుకు రాకపోతే.. లేదంటే తక్కువ ధరకైతే కొంటామని మెలికపెడితే పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్నారు. దీంతో బురద పొలాలున్న రైతుల్లో కొందరు యాసంగిలో భూములను బీడుగా ఉంచడం ద్వారా స్వచ్ఛంద పంట విరామం వైపు మొగ్గుచూపుతున్నారు. 


ద్వాల జిల్లా తుర్కోనిపల్లి రైతు బాలీశ్వర్‌రెడ్డికి జూరాల ప్రాజెక్టు కింద 28 ఎకరాల సాగు భూమి ఉంది. ఏటా వానాకాలం, యాసంగిలో వరి సాగు చేసేవాడు. ప్రస్తుతం యాసంగిలో ఆరుత డి పంటలు వేయాలంటోంది. ఈ రైతు పొలాల్లో వరి తప్ప ఆరుతడి పంటలు సాగుచేస్తే పండవు. ఒకవేళ ప్రభుత్వ సూచనలతో ఆరుతడి పంటలు వేసినా ఆ వచ్చే దిగుబడి కూలీలకు కూడా సరిపోదు.  అందుకే ప్రాజెక్టులో నిండుగా నీరు ఉన్నప్పటికీ తాను యాసంగిలో పంట సాగుచేయబోనని, స్వచ్ఛంద పంట విరామం ఇస్తానని చెబుతున్నాడు. 


రైతు రామచంద్రారెడ్డి. గద్వాల మండలం వెంకంపేట. తనకున్న ఐదెకరాలకు మరో పన్నెండెకరాలు కౌలు చేస్తున్నాడు. ఏటా వానాకాలం సీజన్‌లోనే ఏడాదికి సంబంధించిన కౌలు ఒప్పందాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఆయన ఎలా తిరస్కరించగలనని చెబుతున్నాడు. పైగా ఆయనది సాగుచేస్తోంది బురద పొలం. ప్రభుత్వం ఆరుతడి పంటలు వేయాలనడంతో బురద పొలంలో ఎలా సాగుచేయా లని ఆందోళన చెందుతున్నాడు. ఆరుతడి పంటలు సాగుచేస్తే కౌలు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. ఒకవేళ కౌలు తీసుకోకుంటే వచ్చే ఏడాది వెరొకరికి ఇచ్చేస్తారేమోనన్న ఆందో ళనా ఉంది.  దీంతో వరిసాగు చేయడం తప్ప తనకు వేరే మార్గం లేదని ఆయన చెబుతు న్నాడు. పదెకరాల్లో  వరి సాగుచేస్తానని, రెండెకరాలు బీడుగా వదిలేస్తానని తెలిపాడు. 


సబ్సిడీ విత్తనాలు లేవు..

ఆరుతడి పంటల్లో ప్రభుత్వం సూచించే పంటల్లో ప్రధానమైంది వేరుశనగ.. ఈ పంట వేయాలంటే విత్తనాలకు అధికభారం అవుతోంది. ప్రస్తుతం విత్తన వేరుశనగ మార్కెట్‌లో క్వింటాకు రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ఉంది. గతంలో రూ. 3500 వరకు సబ్సిడీని ప్రభుత్వం భరించేది. ఇప్పుడు ఆ మొత్తాన్ని రైతు భరిస్తున్నాడు. ప్రభుత్వం ప్రస్తుతం వరి వద్దని ఆరుతడి సాగుచేయాలని చెబుతోంది. అయితే ఆరుతడి పంటలు సాగుచేయాలంటే డిమాండ్‌కు తగ్గట్లుగా విత్తనాల సరఫరా కూడా ప్రస్తుతం లేదు. అందువల్ల మెజారిటీ రైతులు సబ్సిడీలు, మార్కెటింగ్‌ ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు.  


ముందస్తు ప్రణాళిక ఏది? 

యాసంగి సీజన్‌లో వరి సాగు చేయొద్దు అనే విషయంలో ప్రణాళిక లోపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకుగాను ప్రాజెక్టుల కింద నీరు నిలిపివేసినా ఆయకట్టు బురద పొలంగానే ఉంటుంది. ఆ మేరకు ఒక సీజన్‌ పూర్తిగా పంట విరామం ప్రకటిస్తే అప్పుడు ఆ పొలం ఆరుతడి పంటలకు సిద్ధమవుతుంది.  

Updated Date - 2021-12-08T08:55:28+05:30 IST