జనం మధ్యకు రాని సీఎం మనకు అవసరమా?: విజయశాంతి
ABN , First Publish Date - 2021-10-21T19:40:28+05:30 IST
సీఎం కేసీఆర్ ఒక పిరికోడని.. అందుకే హుజురాబాద్ రావడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు.
కరీంనగర్ : సీఎం కేసీఆర్ ఒక పిరికోడని.. అందుకే హుజురాబాద్ రావడం లేదని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. నేడు హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనం మధ్యకు రాని సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రావణ రాజ్యం పోవాలన్నారు. దేశంలోనే కేసీఆర్ చెత్త సీఎం అని సర్వేలో తేలిందని గుర్తు చేశారు. సుప్రీం కోర్టు, హై కోర్టు లాంటి తీర్పులు నవంబర్ 2న ప్రజలే ఇవ్వాలన్నారు. కేసీఆర్‌ను గద్దె దించాలని.. టీఆర్ఎస్‌ను సమాధి చెయ్యాలన్నారు. ఇక బానిస బతుకులు మనకు వద్దని విజయశాంతి పేర్కొన్నారు.
‘‘కేసీఆర్ నిన్ను గద్దె దించే వరకు వదిలిపెట్టం. నీకు యముడు బీజేపీ. గుణపాఠం చెప్పేది బీజేపీ. కేసీఆర్ ఏం చెప్తే కాంగ్రెస్ అది చేస్తుంది. ప్రజలు ఇంకా మోసపోవద్దు. దళిత బంధు కేసీఆర్ మాయ. ఉద్యమకారులను కేసీఆర్ అవహేళన చేశారు. తడిగుడ్డతో గొంతు కోశారు. మాట నిలబెట్టుకొలేని సీఎం మనకు అవసరమా. రావణ రాజ్యం పోవాలి. రాముడి రాజ్యం రావాలి.’’ అని విజయశాంతి పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ పేరే వినిపిస్తుందని విజయశాంతి అన్నారు. తమ బిడ్డను తామే గెలిపించుకుంటామని హుజూరాబాద్ ప్రజలు అంటున్నారని ఆమె తెలిపారు. ‘‘కేసీఆర్ ఎన్ని ఇచ్చిన తీసుకుంటాం. కానీ ఓటు మాత్రం ఈటల రాజేందర్‌కే అంటున్నారు. 6 సార్లు గెలిచారు అంటే ఆయనకు చిత్తశుద్ది ఉంది. పని చేసే నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఉద్యమ కారులను కేసీఆర్ అవహేళన చేశారు. తడిగుడ్డతో గొంతు కోశారు. బలవంతంగా నా పార్టీని విలీనం చేయించాడు. ఈటల రాజేందర్.. ఉద్యమంలో కుటుంబాన్ని వదిలిపెట్టి తిరిగారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పని చేశారు. కేసీఆర్ కానీ వారి కుటుంబం సభ్యులు ఎవరు కూడా బయటికి రాలేదు.’’ అని విజయశాంతి విమర్శలు చేశారు.